ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్ పోస్టుల భర్తీ ఎప్పుడు?

అన్ని రకాల టీచర్ పోస్టులను భర్తీ చేసి బడి పిల్లలకు న్యాయం చేయాల్సిన పాలకులు ఆ పనిని చేయకుండా గ్రామీణ విద్యార్థులకు తీవ్రమైన ద్రోహం చేస్తున్నారు. విద్యావ్యవస్థలో అన్ని మార్పులు తేవడానికి తెచ్చిన విద్యాహక్కు చట్టం, నూతన విద్యా విధానాల లక్ష్యం నెరవేరడంలేదు. మూడు దశాబ్దాలకు పైగా ఆర్ట్, క్రాఫ్ట్ విద్యలను విద్యార్థులకు దూరం చేశారు. విద్యార్థి దశలోనే కళా, వృత్తివిద్యలు అత్యంత అవసరమని 2009 విద్యాహక్కు చట్టం చెబుతోంది. 

భారతీయ సంప్రదాయ కళలతో పాటు నైపుణ్యాలను మెరుగుపరిచి మేకిన్ ఇండియాకుఊపిరి పోయాలని నూతన విద్యా విధానం కోరుతోంది. అయినప్పటికీ దీని అమలులో గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. కావాలని ఈ విద్యలపై నిర్లక్ష్యం చేస్తున్నట్లు స్పష్టంగా తేలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నూతన ఉపాధ్యాయుల నియామకాలలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ ఉపాధ్యాయుల పోస్టులను  నియామకాలు చేపట్టకపోవడం  విద్యా హక్కు చట్టం నిర్వీర్యం చేస్తుంది. 

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేవిధంగా,  విద్యార్థులలో సృజనాత్మకను పెంపొందించే విధంగా కళలు ఉపయోగపడతాయి.  విద్యార్థి అంతర్గత ఒత్తిడిని  దూరం చేసి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. విద్యార్థులలో ఇమిడి ఉన్న భావాలను బయటికి తీసుకొస్తారు. ఒక్క కళాత్మక రంగం అనేక శాస్త్రాలను తనలో ఇముడ్చుకుంటుంది. విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధికి కళలు దోహదం చేస్తాయి.   ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ ఉపాధ్యాయుల కోర్సులను పూర్తి చేసి సుమారు 3 లక్షల మంది నిరుద్యోగులు  నియామకాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఈ  పోస్టుల భర్తీ  కోసం చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాం.

-  రావుల రాజేశం, లెక్చరర్