రాష్ట్రంలో అసైన్డ్ ల్యాండ్స్ కు పట్టాలెప్పుడు?

  • వరంగల్ డిక్లరేషన్ లో అసైన్డ్, పోడు భూములకు హక్కుల హామీ
  •     ఈ హామీ అమలైతే 23 లక్షల ఎకరాల అసైన్డ్  భూమి కలిగిన లక్షలాది కుటుంబాలకు లబ్ధి
  •     ఇప్పటికే కేరళ, కర్నాటక, యూపీ, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో హక్కులు
  •     గతంలో అసెంబ్లీలో హామీ ఇచ్చి మరిచిన కేసీఆర్
  •     రేవంత్  సర్కార్ పై అసైనీల ఆశలు 

కరీంనగర్, వెలుగు : ‘పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ, విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తాం’. ఇది 2022 మే 6న వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన ఆరో డిక్లరేషన్. రాష్ట్రంలో దశాబ్దాలుగా తాతలు తండ్రుల కాలం నుంచి వస్తున్న అసైన్డ్  ల్యాండ్స్ ను సాగు చేసుకోవడం తప్ప.. అవసరానికి అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్రంలో లక్షలాది మంది అసైనీలు ఇబ్బందులు పడుతున్నారు. ధరణి పోర్టల్  వచ్చాక ఈ భూములను ప్రొహిబిటెడ్  లిస్టులో పెట్టడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. 

వీళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలే 95 శాతం మంది ఉన్నారు. క్షేత్ర స్థాయిలో రైతుల ఇబ్బందులను అర్థం చేసుకునే కాంగ్రెస్  పార్టీ వరంగల్  రైతు డిక్లరేషన్  సభలో ఆరో డిక్లరేషన్ లోని మొదటి అంశంగా పోడు, అసైనీలకు శాశ్వత హక్కులు, రెండో అంశంగా ‘ధరణి పోర్టల్ రద్దు.. దాని స్థానంలో సరికొత్త రెవెన్యూ వ్యవస్థ’ను చేర్చారు. రెవెన్యూ ముసాయిదా బిల్లు–2024 ద్వారా సరికొత్త రెవెన్యూ వ్యవస్థ వైపు ఇప్పటికే అడుగులు పడుతున్న నేపథ్యంలో.. పోడు, అసైన్డ్  ల్యాండ్స్ కు శాశ్వత హక్కులు కల్పిస్తామన్న డిక్లరేషన్ ను అమలు చేయాలనే విజ్ఞప్తులు ప్రజాభవన్ లో వెల్లువెత్తుతున్నాయి. 

గతంలో హామీ ఇచ్చి మరిచిన కేసీఆర్.. 

అసైన్డ్  భూములపై పూర్తి హక్కులు కల్పించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని 2021 మార్చి 26న అప్పటి సీఎం కేసీఆర్ నిండు అసెంబ్లీలో ప్రకటించారు. త్వరలోనే దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పిలుస్తానని, ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్లకు మంచి జరుగుతుందేమోనన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని చెప్పారు. ఆ తర్వాత  అంశాన్ని పట్టించుకోలేదు. 

అసైన్డ్ భూములపై ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు హక్కులు కల్పించకపోగా గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, నర్సరీల ఏర్పాటు, ఇతర అవసరాల కోసం గతంలో కాంగ్రెస్  ప్రభుత్వం ఇచ్చిన వేలాది ఎకరాల అసైన్డ్ భూములను దౌర్జన్యంగా లాక్కున్నారు. ఈ క్రమంలోనే హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్  కాలేజీలో జరిగిన కాంగ్రెస్  వరంగల్ రైతు డిక్లరేషన్  సభలో తొలిసారిగా అసైన్డ్  ల్యాండ్స్  కలిగిన రైతులకు శాశ్వత హక్కులు కల్పిస్తామని కాంగ్రెస్  డిక్లరేషన్ ప్రకటించింది. 

కాంగ్రెస్  ప్రభుత్వాలు పంచిన భూమి 

22.55 లక్షల ఎకరాలు..

ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్  ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు విడతల వారీగా పేదలు సాగు చేసుకునేందుకు సర్కార్ భూములను అసైన్డ్  చేశాయి. ఇలా 1956 నుంచి 2014 వరకు తెలంగాణలో 22,55,617 ఎకరాలను 13,88,530 మందికి అసైన్  చేసినట్లు ప్రభుత్వ గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో భూసంస్కరణల చట్టం అమల్లోకి వచ్చాక మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో పంపిణీ చేసిన భూములే ఎక్కువగా ఉన్నాయి. అసైనీలు చనిపోతే వారి వారసులు పంచుకోవడం ద్వారా అసైనీల సంఖ్య ప్రస్తుతం 25 లక్షలు దాటొచ్చని అంచనా. అయితే పేదల అవసరాలను, బలహీనతలను ఆసరాగా చేసుకుని వాళ్ల అసైన్డ్  భూములను తక్కువ రేటుకు సంపన్నులు తీసుకునే పరిస్థితి ఉండడంతో అప్పటి ప్రభుత్వం అసైన్డ్  భూముల బదలాయింపు నిషేధ చట్టం -1977ను తీసుకొచ్చింది. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా పేదల అవసరాలకు ఈ నిబంధన గుదిబండగా మారింది. 

భూమి సాగు చేసుకోవడానికి తప్ప.. తమ అవసరాలకు అమ్ముకోలేని దుస్థితి ఏర్పడింది. ధరణి పోర్టల్  రాక ముందు చాలా మంది తెల్లకాగితాలపై రాసుకుని అసైన్డ్ భూములను అమ్మేసుకున్నారు. కొనుక్కున్న వ్యక్తుల పేర్లు ఆ తర్వాత రెవెన్యూ రికార్డుల్లోకి వచ్చాయి. 2017లో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనలో అసైన్డ్  భూముల కొనుగోళ్ల వ్యవహారం పెద్ద సంఖ్యలో వెలుగు చూసింది. కొనుగోలుదారులు కూడా పేదలైతే, అసైన్డ్  భూములు పొందడానికి అర్హులైతే వారికి కొత్త పట్టా పాస్ బుక్స్  జారీ చేశారు. వరంగల్  డిక్లరేషన్ ప్రకారం అసైన్డ్  భూములకు శాశ్వత హక్కులు కల్పిస్తే సుమారు 25 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. చట్ట సవరణతో ఈ ప్రక్రియ పూర్తవుతుందని, ప్రభుత్వానికి పైసా భారం ఉండదని అసైనీలు అభిప్రాయపడుతున్నారు. 

దేశంలోని పలు రాష్ట్రాల్లో శాశ్వత హక్కులు.. 

అసైన్డ్  భూములపై శాశ్వత హక్కు కల్పించే విధానం దేశంలోని పలు రాష్ట్రాల్లో అమల్లో ఉంది. మన పక్కనే ఉన్న కర్నాటకలో అసైన్డ్  చేసిన 15 ఏండ్ల తరువాత, తమిళనాడులో 20 ఏండ్ల తరువాత, కేరళలో 25 ఏండ్ల తరువాత, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో 10 ఏండ్ల తర్వాత అర్హతను బట్టి అక్కడి ప్రభుత్వాలు అసైనీలకు భూములపై శాశ్వత హక్కులను కల్పిస్తున్నాయి. గతంలో ఏపీ ప్రభుత్వం ఇలాగే చుక్కల భూములకు, మాజీ సైనికులు, ఫ్రీడం ఫైటర్ల భూములపై అసైనీలకు హక్కు కల్పించింది. నిరుడు జులైలో ఏపీ కేబినెట్  తీసుకున్న నిర్ణయం ప్రకారం.. అసైన్డ్  ల్యాండ్  పొందిన లబ్దిదారులు భూమి పొందిన 20 ఏండ్ల తరువాత పూర్తి హక్కులు అనుభవించవచ్చు. ఇలా అక్కడ 63,19,184 ఎకరాల అసైన్డ్  భూములపై రైతులు హక్కుదారులు కానున్నారు. అలాగే లంక భూముల విషయంలో మరో 66,111 మందికి పూర్తి హక్కులు కల్పించారు. తెలంగాణలో మాత్రం దశాబ్దాలు గడిచినా అసైనీల కల నెరవేరడం లేదు. 

వరంగల్  డిక్లరేషన్ అమలు చేయాలి.. 

వరంగల్  రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్  అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన 9 అంశాల్లో ఆరో అంశంగా పోడు, అసైనీలకు శాశ్వత హక్కుల కల్పన ఉంది. పోడు, అసైనీలకు కూడా శాశ్వత హక్కులు కల్పిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రభుత్వానికి పైసా భారం లేకుండా మంచి పేరు తెచ్చే ప్రక్రియ ఇది. ప్రభుత్వానికి ఎప్పుడైనా అవసరం ఉండి అసైన్డ్  భూమిని సేకరించినా అసైనీలకు పట్టాదారులతో సమానంగా పరిహారం ఇవ్వాలని చట్టాలు, కోర్టు తీర్పులు చెబుతున్నాయి. అందువల్ల అసైన్డ్  భూములను ప్రభుత్వం తనదిగా భావించినా పెద్దగా ప్రయోజనం లేదు. ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలి. 

–గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి, కన్వీనర్, అసైన్డ్ భూముల శాశ్వత హక్కుల సాధన సమితి