ప్రజా పంపిణీ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది.?

దేశంలో ఆహార భద్రత సాధించడానికి తీసుకున్న చర్యల్లో ప్రజా పంపిణీ  కీలకమైంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆహార కొరత ఏర్పడినప్పుడు ధరల నియంత్రణకు ప్రభుత్వం రేషనింగ్ చర్యలు చేపట్టింది. రేషనింగ్​లో చట్టబద్ధమైన రేషనింగ్, అనియత రేషనింగ్ ఉంటాయి. చట్టబద్ధమైన రేషనింగ్​లో రేషనింగ్ అమలు చేసే వస్తువులను ప్రభుత్వమే పంపిణీ చేస్తుంది. బహిరంగ మార్కెట్లో నిషేధిస్తారు. స్వాతంత్ర్యానికి ముందు ఇలాంటి రేషనింగ్ ఉండేది. అనియత రేషనింగ్​లో బహిరంగ మార్కెట్ కూడా పనిచేస్తుంది. ప్రభుత్వం అందించే పరిమాణం కంటే అదనపు పరిమాణాన్ని బహిరంగ మార్కెట్లో వినియోగదారుడు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అమలులో ప్రజా పంపిణీ వ్యవస్థ ఈ తరహాకు చెందిందే. 1943 నుంచి నిరుపేదలకు తక్కువ ధరలకు ఆహార ధాన్యాల పంపిణీ జరిగేది.

 1955లో నిత్యావసర వస్తువుల చట్టం తీసుకువచ్చారు. 1957 నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రారంభమైంది. వినియోగదారులకు నిత్యావసర వస్తువులను సబ్సిడీపై తక్కువ ధరకు అందుబాటులోకి తీసురావడం ద్వారా ధరల పెరుగుదల నుంచి రక్షించడం. పేదల అవసరాలకు తగినంత పరిమాణంలో వస్తువులను అందజేసి కనీస పోషక స్థాయిని సాధించడం. అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రయోజనం అందించడం ప్రజా పంపిణీ వ్యవస్థ లక్ష్యాలు. 

ఆహార ధాన్యాల సేకరణ 

ప్రజా పంపిణీ వ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు పరుస్తున్నాయి. కేంద్రం ఎఫ్ సీఐల ద్వారా ఆహార ధాన్యాలను సేకరించి, నిల్వ చేసి రాష్ట్రాలకు కేటాయిస్తుంది. రాష్ట్రాలు బీపీఎల్ కుటుంబాలను గుర్తించి, రేషన్ కార్డులు జారీ చేసి, చౌకధరల దుకాణాలను ఏర్పాటు చేసి, వినియోగదారులకు అందిస్తుంది. గోధుమలు, బియ్యంతోపాటు చక్కెర, కిరోసిన్లను కూడా పంపిణీ చేస్తారు. 1965లో ఏర్పాటు చేసిన ఎఫ్ సీఐ ఆహార ధాన్యాలు కొనుగోలు, నిల్వ, రవాణా, పంపిణీ తదితర చర్యలు చేపడుతాయి. దీనివల్ల రైతులకు సముచితమైన ధర లభిస్తుంది. మరోవైపు వినియోగదారుడికి తక్కువ ధరకు లభిస్తాయి. ఎఫ్​సీఐ ప్రభుత్వం తరఫున బఫర్ నిల్వలు నిర్వహిస్తుంది. 2022 నాటికి దేశ వ్యాప్తంగా 5.39 లక్షల చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. 16 కోట్ల కంటే ఎక్కువ కుటుంబాలకు వీటి ద్వారా వస్తువులు అందుతున్నాయి. ప్రపంచంలోనే ఇంత పెద్ద నెట్వర్క్ కలిగింది పీడీఎస్. 

పునర్నిర్మిత ప్రజా పంపిణీ వ్యవస్థ

1992, జనవరిలో ప్రక్షాళన చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. కరువు ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు సమగ్ర గిరిజన అభివృద్ధి పథకం కిందకు వచ్చే బ్లాకులను ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరించారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతంలో నివసించే వినియోగదారులకు కూడా నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తీసుకురావడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. కొన్ని రాష్ట్రాల్లో టీ, సబ్బులు, పప్పుధాన్యాలు, అయోడిన్ కలిపిన ఉప్పు కూడా ఈ పథకం కింద విక్రయించారు .

లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ

ఆహార సబ్సిడీ భారాన్ని తగ్గించి నిజంగా అవసరమైన లక్షిత వర్గానికి ఆహార ధాన్యాలను చేర్చేందుకు 1997, జూన్ 1 నుంచి లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీని ప్రధాన ఉద్దేశం బీపీఎల్ వర్గానికి సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను అందించడం. ఏపీఎల్ వర్గం వారికి అధిక ధరలకు అందించడం. అంటే పీడీఎస్ సార్వత్రిక లక్ష్యాన్ని కొనసాగిస్తూనే బీపీఎల్ వర్గం వారిపై ప్రత్యేకమైన దృష్టి సారించడం. 

లక్షిత వర్గం: ప్రణాళికా సంఘం నిర్వచనం ప్రకారం జనాభాను బీపీఎల్, ఏపీఎల్ అని విభజిస్తారు. ప్రారంభంలో ఒక్కో కుటుంబానికి 10 కేజీల ఆహార ధాన్యాలను అందించారు. ఆ తర్వాత 25 కేజీలకు పెంచారు. 2002 నుంచి అంత్యోదయ అన్న యోజన కింద 35 కేజీలకు పెంచారు. 

కేంద్ర, రాష్ట్రాల నియంత్రణ

బీపీఎల్ జనాభాను ప్రస్తుతం కేంద్రం నిర్ణయిస్తుంది. గతంలో రాష్ట్రానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. 

సబ్సిడీ

పీడీఎస్ కింద నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తుంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్​ నుంచి ధాన్యం సేకరణ ఎక్కువగా జరగ్గా, గోధుమల విషయంలో పంజాబ్, హర్యానాల నుంచి ఎక్కువ సేకరణ జరుగుతున్నది. 

వికేంద్రీకృత సేకరణ పథకం

1997లో వికేంద్రీకృత సేకరణ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వమే ఆహార ధాన్యాలను సేకరించి నిల్వ చేసి వివిధ కేంద్ర పథకాల కింద ధాన్యాన్ని విడుదల చేస్తారు. దీని వల్ల ప్రజా పంపిణీ  వ్యవస్థ సామర్థ్యం పెరుగుతుంది. రవాణా ఖర్చులు తగ్గుతాయి. స్థానిక ప్రజల అభిరుచులకు, అలవాట్లకు సరిపడే విధంగా ఆహార ధాన్యాలను అందించవచ్చు. 

ఆర్థిక వ్యయం

ఇందులో బోనస్​తో కలిపి కనీస మద్దతు ధర, ఆహార ధాన్యాలను సేకరించడానికి 
అయ్యే ఖర్చులు, పంపిణీకి చేసిన ఖర్చులు కలిసి ఉంటాయి. ఇది రాష్ట్రానికి, రాష్ట్రానికి మారవచ్చు. 

లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ సమీక్ష 

  • పేదలకు పరిమిత ప్రయోజనం: గ్రామీణ, పట్టణ పేదలు తమ అవసర వస్తువులకు పీడీఎస్ పై కంటే బహిరంగ మార్కెట్​పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అధిక పేదరిక ప్రభావం ఉన్న బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ తక్కువ వాటాను కలిగి ఉన్నాయి. 
  • లక్షిత గ్రూప్ నిర్ణయంలో సమస్యలు: పేదల నిర్వచనం, పేదల ఎంపికలో భావనాత్మక, ఆచరణాత్మక సమస్యలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నిజంగా పేదవారు బీపీఎల్ వర్గంలోకి రావడం లేదు. మరోవైపు ధనిక వర్గం వారు బీపీఎల్లో చేరుతున్నారు. 
  • ఆహార ధాన్యాలు పక్కదారి పట్టడం: అధిక సబ్సిడీని పొందేందుకు తప్పుడు కార్డులు సృష్టిస్తున్నారు. దీనివల్ల ఆహార ధాన్యాలు పక్కదారి పడుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చే ఆహార ధాన్యాలు చౌకధరల దుకాణాలకు చేరకుండానే అదృశ్యమవుతున్నాయి. 
  • ఆలస్యం, క్రమ రాహిత్యం: ఆలస్యంగానూ క్రమరాహిత్యంగానూ రేషన్ షాపులకు ఆహారధాన్యాలు చేరుతున్నాయి. 
  • సబ్సిడీ భారం: ఆహార సబ్సిడీ భారం పెరుగుతున్నది. 
  • ఎఫ్సీఐ నిర్వహణ అసమర్థత: మిగులు ప్రాంతాల నుంచి కొరత ప్రాంతాలకు ఆహార ధాన్యాలను తీసుకెళ్లడంలో విఫలమైంది.

ద్వంద్వ ధరలు

బీపీఎల్ వర్గం వారికి కేంద్రం జారీ చేసిన ధర కంటే తక్కువ ధరకు, ఏపీఎల్ వర్గం వారికి కేంద్ర జారీ ధర కంటే అధిక ధరకు అందిస్తారు. 2000లో అంత్యోదయ అన్న యోజన ప్రవేశపెట్టిన తర్వాత వారికి మరింత తక్కువ ధరకు అందిస్తున్నారు. ఎఫ్ సీఐ రాష్ట్రానికి ఆహార ధాన్యాలను అందించడానికి అయ్యే ఆర్థిక వ్యవయంలో 50 శాతానికి బీపీఎల్ వర్గం వారికి, 100 శాతం వ్యయానికి ఏపీఎల్ వర్గం వారికి అందిస్తారు. అయితే, ఏపీఎల్ వర్గం వారు వీటిని కొనుగోలు చేయడం మానివేయడంతో తర్వాత వాటి ధరను కూడా కొంత తగ్గించారు. 2002 నుంచి కేంద్రం జారీ ధరను మార్చలేదు. ఏపీఎల్ కుటుంబాలకు గోధుమను కేజీ రూ.6.10లకు, బియ్యం రూ.8.30లకు అందిస్తున్నారు. బీపీఎల్ కుటుంబాలకు గోధుమ రూ.415లకు, బియ్యం రూ.5.65లకు అందిస్తుంచారు. ఏఏవై కుటుంబాలకు గోధుమలు రూ.2, బియ్యం రూ.3లకు అందించారు.