Lifestyle: ఉదయాన్నే నిద్ర లేవడంతోనే ఏం చూడాలో తెలుసా..

పూర్వకాలంలో మునులు...మహర్షులు.. బ్రహ్మముహూర్తంలో లేచి కాలకృత్యాల అనంతరం జపం.. అనుష్ఠానం చేసేవారు.  ఇక మానవులు... కొంచెం ఆలస్యంగా లేచినా....సరే.. పెద్దలు చెప్పిన విధంగా చేసేవారు.  కాని ఇప్పుడు అలా కాదు.. ఒకే ఇంట్లోని వారు ఎప్పుడు పడుకుంటారో.. ఎప్పుడు లేస్తారో తెలియని పరిస్థితిలో ఉన్నాం.  కాని కొంతమంది పెద్దలు చెప్పినట్లుగానే ఆచరించేవారు కూడా లేకపోలేదు. అసలు నిద్రలేవడంతోనే ఏం చూడాలి.. ఏ శ్లోకం చదవాలి.. వాటి వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు గురించి తెలుసుకుందాం. . .

చాలామంది  నిద్రలేచిన వెంటనే కొందరు చేతులు చూసుకుంటారు...మరికొందరు అద్దంలో ముఖం చూసుకుంటారు..ఇంకొందరు దేవుడి ఫొటో చూసి నమస్కరిస్తారు..ఇంకా తల్లిదండ్రుల ముఖం చూసి నిద్రలేచేవారు కొందరు, పిల్లలు ముఖం, జీవిత భాగస్వామి ముఖం చూస్తారు. చాలామందికి అసలు ఇలాంటి సెంటిమెంటే ఉండదు. సెంటిమెంట్ లేనివారిసంగతి సరే..మరి వీటిని అనుసరించేవారి సంగతేంటి? పొద్దున్నే నిద్రలేవడం మాత్రమే కాదు...నిత్యం అనుసరించాల్సిన ముఖ్యమైన విషయాలున్నాయని పురాణాలు చెబుతున్నాయి..

 సూర్యోదయానికి ముందు నిద్రలేవాలి

దీనినే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం అంటారు. సూర్యోదయానికి 90 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రాహ్మీ అంటే సరస్వతి దేవి. మనలో బుద్ధి ప్రభోదం చెందే సమయం కాబట్టే దానిని బ్రాహ్మీ ముహూర్తం అని పిలుస్తారు. ఈ ముహూర్తాన్ని పూర్వం ఘడియలలో లెక్కపెట్టేవారు. ఘడియ అంటే 24 నిముషాలు అని అర్థం. ఓ ముహూర్తం అంటే 2 ఘడియలకాలం..అంటే.. 48 నిముషాలు. సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాల్లో మొదటిది బ్రహ్మముహూర్తం.

 హిందూ ధర్మశాస్త్రాల్లో ఈ ముహూర్తం గురించి ప్రస్తావన ఉంది. ప్రకృతి కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చైతన్యంగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి ఉంటుంది..అందుకే ముహూర్తంలో నిద్రలేచేవారిలో సానుకూల ఆలోచనలు వస్తాయి. ఈ సానుకూలశక్తితో ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు. ఈ ముహూర్త సమయంలో వీచేగాలి అమృతంతో సమానంగా భావిస్తారు. 
 
వర్ణా కీర్తి మతిం లక్ష్మీ స్వాస్త్యమాయుశ్ఛ విదంతి|
బ్రహ్మ ముహూర్తే సంజాగ్రచ్ఛివ పంకజ యథా||

బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల  ఈ సమయంలో నిద్రలేవడం వల్ల అందం, బలం, జ్ఞానం, తెలివితేటలు, ఆరోగ్యం వృద్ధి చెందుతాయిని పై శ్లోకానికి అర్థం. 

అరచేతులు చూసుకుని నమస్కరించాలి

నిద్రలేచిన వెంటనే చాలామంది చేతులు చూసుకుంటారు. ఇది చాలా మంచి అలవాటు అని చెబుతారు పండితులు.. ఎందుకు అనేది ఈ శ్లోకంలో వివరించారు...
 
"కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి
కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం"

  • కరాగ్రే వసతే లక్ష్మీ... - అరచేయి పైభాగనంలో శ్రీ మహాలక్ష్మి
  • కర మధ్యే సరస్వతి ....- చేయి మధ్యభాగంలో సరస్వతి
  • కర మూలే స్థితా గౌరీ - .....మణికట్టు వద్ద  గౌరీదేవి కొలువై ఉంటారు.
  • ప్రాతః కాలంలో ఈ శ్లోకం చదివి అరచేతులను కళ్లకు అద్దుకుని లేవడం ద్వారా..ఆ మూడు శక్తులను స్మరించినట్టు

ఏ పని చేసినా చేతి చివరిభాగం వేళ్లదే ప్రధాన పాత్ర..అంటే ఎంత కష్టపడితే అంత ఫలితం, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సరస్వతీ కటాక్షం సిద్ధించాలంటే అరచేతుల్లో పుస్తకాన్నుంచి శ్రద్ధగా చదవాలని అర్థం. పుస్తకం పట్టుకోవడంపై మీకుండే నిబద్ధతే మీ భవిష్యత్ ని నిర్ణయిస్తుంది. పైకి లేచేటప్పుడు చేయి మణికట్టు దగ్గర బలాన్నుంచి నిలబడతాం..ఆ శక్తి స్వరూపమే గౌరీ దేవి... నీ చేతుల ఆధారంగా ఎలా పైకి లేస్తావో.. కష్టం వచ్చినప్పుడు అలాగే పైకి లేచి నిలబడు అని అర్థం.  చేతులారా చేసుకున్నావ్ అనే మాట వినే ఉంటారు కదా.. అంటే ఏదైనా నీ చేతుల్లోనే ఉందని ఆంతర్యం. అందుకే నిద్రలేస్తూ అరచేతులకు నమస్కరించి లేస్తే అంతా శుభమే అని చెబుతారు.  

 భూమికి నమస్కారం చేయాలి

సముద్ర వసనే దేవీ పర్వతస్థన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే

నిద్రలేచిన తర్వాత కాలు కింద మోపే ముందు ఈ శ్లోకం చదవాలి. వనసే అంటే దుస్తులు... సముద్రవసనే దేవీ  అంటే సముద్రాన్ని వాసంగా ధరించిన దేవీ అని అర్థం.  70 శాతం భూమి ... నీటితో కప్పి ఉంటుంది. భారతీయులు శరీరాన్ని 70శాతం దుస్తులతో కప్పుకున్నట్టే.. భూమిపై 70శాతం నీరున్న ప్రదేశాన్ని దుస్తులుగా ధరించావమ్మా అని అర్థం.   
పర్వత స్థన మండలే అంటే ...పర్వతాలను స్థానాలుగా కలిగిన దేవి... అంటే బిడ్డలు అడగకుండానే ఆకలి తెలుసుకుని పాలిచ్చే తల్లి అని అర్థం. అలాంటి భూదేవిపై కాలుమోపుతున్నందుకు క్షమించమని అడుగుతూ అడుగు నేలపై పెట్టాలి. 

సుమంగళ ద్రవ్యాలు చూడాలి

చాలామంది నిద్రలేవగానే వివాహితులు అయితే మంగళసూత్రం తీసి కళ్లకు అద్దుకుంటారు. ఇలా చేస్తే సుమంగళి యోగం అని భావిస్తారు. అయితే నిద్రలేవగానే మంగళద్రవ్యాలు ఏం చూసినా ఆరోజంతా శుభం జరుగుతుంది. మంగళద్రవ్యాలంటే అగ్ని, బంగారం, దేవుడి పటం, అద్దం ...వీటిలో ఏం చూసి నిద్రలేచినా మంచిదేనని పండితులు చెబుతున్నారు. 

  • తల్లిదండ్రులకు నమస్కరించాలి
  •  భవిష్యత్ ని ఉన్నతంగా తీర్చిదిద్దే గురువులను తలుచుకుని నమస్కరించాలి  
  • మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ