ఆధ్యాత్మికం : ఇవి దేవుడి కోసమే కాదు.. మన జీవిత ఆనందం... ఆత్మ విశ్వాసం కోసం కూడా.. !

భగవంతుడికి భక్తుడికి అవినాభావ సంబంధం ఉంటుంది. అబద్ధం, అధర్మం, అన్యాయం, అక్రమాలకు పోకుండా న్యాయబద్ధంగా బతకాలి భక్తుడు అని మన పురాణాలు చెప్తున్నాయి. రోజూ గుడికి వెళ్లి కొబ్బరి కాయలు కొట్టి స్వార్థం.... అసూయలతో ఇతరులను ఇబ్బంది పెట్టే భక్తులని దేవుడూ అంగీకరించడు. ధ్యానాలు, హోమాలు, ఇంట్లో పూజలు చేస్తూ అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకునే వాళ్లకు దేవుడు దూరంగానే ఉంటాడు. భక్తి అంటే దేవుడికి ఇష్టంగా నడుచుకోవడం. ప్రకృతి, సమాజం, తోటి మనుషులతో స్నేహంగా మెలగడం. దేవుడి దృష్టిలో మనుషులందరూ ఎలా సమానులో , అలాగే భక్తుడి దృష్టిలోనూ సమానులే అన్నమాట.

కొందరు భక్తులు తమకు భగవంతుడే కావాలని కోరుకుంటారు. మరి కొందరు భక్తులు సుఖంగా, సంతోషంగా బతకడానికి ధనం, ఆరోగ్యం, ఉద్యోగం... లాంటివి అడుగుతారు. అయితే దేవుడికి భక్తులు తొమ్మిది మార్గాల ద్వారా తమ గురించి తాము విన్నవించుకుంటారని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. ఇవి ప్రస్తుత సమాజానికి చాలా అవసరమైనవి. ఆనందంగా, సుఖంగా బతకడానికి ఉపయోగపడేవి. ఒత్తిడి..ఆందోళనల నుంచి దూరం చేసేవి.

శ్రవణం...  అంటే వినడం అని అర్థం. పరీక్షిత్తు మహారాజు అలా వినడం వల్లే మోక్షాన్ని పొందాడని చెప్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడికి సంబంధించిన కథలే కాదు పెద్దవాళ్లు...  చిన్న పిల్లల్లో కూడా కథలు చదవడం, వినడంపై పూర్తి ఆసక్తి తగ్గిపోయింది. టీవీలు, సెల్ ఫోన్ లతో  కాలక్షేపం చేస్తున్నారు. అలాంటిది రోజువారీ జీవితంలో కొంత టైంను ఏదో ఒక విషయాన్ని వినడానికి కేటాయించడం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది. కొత్త విషయాలను తెలుసుకోవచ్చు.

కీర్తనం...  అంటే దేవుడిని పాటలతో ప్రార్థించడం. అన్నమయ్య, త్యాగయ్య లాంటి భక్తులెందరో కీర్తనం ద్వారా భగవంతుడిని చేరారని అంటారు. సంగీతం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పాటల వల్ల గాయకులే కాదు, విన్నవాళ్లూ ఆనందిస్తారు. మ్యూజిక్ థెరఫీలాంటివి వచ్చేశాయి అంటే...  ఈ మార్గం గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన పని లేదు. 

స్మరణ .... అంటే దేవుడిని రోజూ తలచుకోవడం.  ఏదైనా పనిమీద దృష్టి పెట్టాలి అంటే ఏకాగ్రత అవసరం. మరో విషయం పైకి వెళ్లకుండా చూసుకోవాలి. నిత్యం దాని గురించే ఆలోచిస్తూ ఉండాలి. ఇలాంటిదే స్మరణ..  ప్రహ్లాదుడు ఇలాంటి స్మరణ వల్లే మోక్షాన్ని పొందాడని భాగవతం చెప్తుంది.

Also Read : మనుషులు కూడా ముక్తిని పొందవచ్చు

పాదసేవనం... అంటే సేవ చేయడం.... విష్ణుమూర్తికి నిత్యం లక్ష్మీదేవి పాదసేవ చేయడం వల్ల ముక్తి పొందిందని అంటారు. సేవ చేయడం అంటే చేసే పనిపై శ్రద్ధ, ఇష్టం పెట్టాలి. పనినే దైవంగా భావించాలన్నమాట. సర్వస్వాన్ని పని పూర్తి చేయడానికే వినియోగించాలి. ఎక్కువ, తక్కువ అనే భేదాన్ని వదిలేయాలి..

అర్చనం ...అంటే పూజించడం. పృథుచక్రవర్తి దేవుడ్ని పూజించి మోక్షాన్ని పొందాడని చెప్తారు. అర్చన అంటే ధూపదీపాలతో భగవంతుడిని పూజచేయడమని చెప్తారు. సాధారణంగా ఏ పనిచేయాలన్నా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమంలో వెళ్తే ఏ పనిలో అయినా విజయం సాధ్యమవుతుంది. 

వందనం ....అంటే సమస్కారం. అక్రూరుడు భగవంతుడికి నమస్కరించడం వల్లే మోక్షానికి వెళ్లాడని అంటారు. దేవుడి పైనే కాదు పెద్దలు, గురువులు, తల్లిదండ్రులు... లాంటి వాళ్లను గౌరవించాలని, మర్యాదగా నడుచుకోవాలని ఈ మార్గం చెప్తుంది. ఇది ప్రవర్తనను మంచి మార్గంవైపు నడిపే సూత్రమన్నమాట.

దాస్యం .... అంటే నేను భగవంతుడికి దాసుడుని అనే భావంతో జీవించడం. హనుమంతుడు రాముడికి సేవచేస్తూ ముక్తి పొందాడని చెప్తారు. నేను ఎక్కువ అనే ఆలోచన దీని ద్వారా పోతుంది. అహం నశిస్తుంది. అమ్మానాన్నలకు, చదువు చెప్పిన గురువులకు, స్నేహితులకు ప్రతి ఒక్కరూ దాస్యులనే చెప్తాయి పురాణాలు. 

సఖ్యం ... అంటే దేవుడిని స్నేహితుడిగా భావించి అతనితో మెలగాలని అర్థం. అర్జునుడు కృష్ణుడితో సఖ్యం చేశాడు. ఫ్రెండ్స్ లో , జీవిత భాగస్వామిలో, పిల్లల్లో, తోటివాళ్లలో దేవుడ్ని చూడమని చెప్తుంది ఈ భక్తి మార్గం. రామకృష్ణ పరమహంస కాళికాదేవితో ఇలాంటి స్నేహభక్తినే కలిగి ఉన్నాడని అంటారు. ఈ మార్గం వల్ల సమాజంలో ప్రేమాభిమానాలు పెరిగి, అసూయ ద్వేషాలు తగ్గుతాయి.

ఆత్మ నివేదనం ... అంటే తనను తాను దేవుడికి అర్పించుకోవడమే. ఈ రకమైన భక్తికి ఉదాహరణ బలిచక్రవర్తి. తనకున్నదంతా దేవుడికి దానం చేసి, పాతాళానికి తొక్కి వేయబడ్డాడు. భగవంతుడికి భక్తుడికి మధ్య ఎలాంటి భేదం లేదని చెప్పుకోవడమే ఈ మార్గ ఉద్దేశం, మాటలు, చేతలు, ప్రవర్తన... ప్రతిదీ భగవంతుడి కోసమే అన్నట్లు ప్రవర్తించాలి. కామం, క్రోధం, లోభం, మోహం లాంటి చెడు గుణాలను వదిలేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది..

-వెలుగు,లైఫ్-