అవేర్ నెస్ : డోన్ట్ వర్రీ డు ఇట్​ బ్యాడ్లీ!

విషయం ఏదైనా సరే కొందరు ఎప్పుడు చూసినా యాంగ్జైటీ అంటే... ఆందోళన, ఆత్రుత, చింత, ఆదుర్దా పడుతుంటారు.  మరి ఇలాంటి వాళ్లు మానసికంగా బలంగా తయారవ్వాలంటే  ఏం చెయ్యాలి? దాని గురించి బెంగేం అక్కర్లేదు దాన్నుంచి బయటపడేందుకు సైన్స్​ పరంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి. పరిశోధించి మరీ సైంటిఫిక్​గా నిరూపించిన ఆ పద్ధతులు  ఫాలో అయితే యాంగ్జైటీ తగ్గించుకుని ఏ విషయం గురించి అయినా హెల్దీగా వర్రీ కావచ్చు!

యాంగ్జైటీకి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా... భయం, విశ్రాంతి లేకపోవడం, చేస్తున్న పని మీద దృష్టి పెట్టలేకపోవడం, రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడం, ప్రతి దానికి చిరాకు పడడం వంటివి ఉంటాయి. చుట్టు పక్కలవాళ్లతో మాట్లాడితే జడ్జ్​ చేస్తారని మాట్లాడరు చాలామంది. ఆ ఫీలింగ్​ వల్ల ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే మాటల్లో నత్తి, విపరీతమైన చెమట, ముఖం ఎర్ర బడటం, పొట్టలో ఇబ్బంది వంటివి ఉంటాయి. ఇదంతా పానిక్​ ఎటాక్​లా​ అనిపిస్తుంది. ​అకస్మాత్తుగా వచ్చే యాంగ్జైటీ స్పైక్స్​ వల్ల హార్ట్​ ఎటాక్​ వస్తుందేమో అన్నట్టు ఉంటుంది పరిస్థితి. దాంతో పెద్దగా అరవడం లేదా అదుపు తప్పి ప్రవర్తిస్తారు. రోజంతా అలానే ఉండే అవకాశం ఉంది. దీన్నే వైద్య పరిభాషలో ‘యాంగ్జైటీ డిజార్డర్’​ అంటారు. దీనివల్ల భవిష్యత్తు గందరగోళంగా కనిపిస్తుంది. ఏదో ఒక టైంలో ఇలాంటిది అనుభవం అవుతుంది ఎక్కువమందికి. ఈ డిజార్డర్​ కంటిన్యూ అయితే దాని ప్రభావం జీవితం మీద విపరీతంగా పడుతుంది.

మీ జీవితం మీ చేతుల్లో లేకుండా పోయింది అనిపిస్తుందా? నిర్ణయాలు తీసుకోవడంలో కష్టంగా ఉందా?  కొత్త పని మొదలుపెట్టడం కష్టంగా ఉందా? అయితే ‘డూ ఇట్​ బ్యాడ్లీ’ . ఇలా చేయడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో స్పీడ్​ పెరుగుతుంది. పనిచేయడం అనేది మొదలవుతుంది.  అలా చేయకుండా యాంగ్జైటీతో ఉంటే ఆ పని ఎలా చేయాలి? ఏం చేయాలి? అనేది ఆలోచిస్తూ గంటల కొద్దీ టైం వేస్ట్​ అయిపోతుంది. దానివల్ల టైం గడిచిపోవడమే కాకుండా ఒత్తిడికి గురవుతారు.

ఏదైతే అదవుతుందని...

చాలామంది ఏదైనా పని మొదలుపెట్టేముందు పర్ఫెక్ట్​గా చేయాలి అనుకుంటారు. అలాకాదంటే పర్ఫెక్ట్​ టైం కోసం ఎదురుచూస్తుంటారు. దీనివల్ల కూడా పని ఆలస్యం అవుతుంది లేదా ఆ పని చేయకుండా ఆగిపోతుంది. ఈ పరిస్థితి కూడా ఒత్తిడికే దారితీస్తుంది. అదే ఆ తరువాత యాంగ్జైటీకి కారణం అవుతుంది. ఈ పరిస్థితుల్లోకి జారిపోకుండా ఉండాలంటే ‘డూ​ ఇట్​ బ్యాడ్లీ’. ఒక్కముక్కలో చెప్పాలంటే ... ఏదైతే అది అయిందని పని మొదలుపెట్టేయాలి. అంతేకానీ, ‘ఇలా చేస్తే ఏమవుతుందో? ఎండ్ రిజల్ట్​  ఎలా ఉంటుందో?’ అని ఆలోచించడం మానేయాలి. అప్పుడే పని మొదలుపెట్టడం చాలా ఈజీ అవుతుంది. అంతేకాదు టాస్క్​ కూడా చాలా స్పీడ్​గా పూర్తయిపోతుంది. అంతకుముందు మీరు చేసిన పనులకంటే వేగంగా కంప్లీట్ అయిందనే విషయం మీకే తెలుస్తుంది. అసలు పనంటూ పూర్తయితే ఆ తరువాత ఆ పనిలో మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు.

డు ఇట్​ బ్యాడ్లీ అనే మోటో కొత్త విషయాలు చేసేందుకు ధైర్యాన్ని ఇస్తుంది. అంతేనా చేసే పనిలో కొంత ఫన్​ కూడా నింపుతుంది. అన్నింటికంటే ముఖ్యం రిజల్ట్​ ఎలా వస్తుందో అనే ఆందోళనను ఆపేస్తుంది. దానివల్ల పని మొదలుపెట్టడం, ఆ తరువాత దాన్ని మెరుగుపరుచుకోవడం అనే విషయాలే ఆలోచిస్తుంది బుర్ర. ఇలా చేయడం వల్ల బుర్రకి ఒకరకమైన స్వాతంత్య్రం వస్తుంది.

ఎవర్ని వాళ్లు క్షమించుకోవాలి?

ఇక్కడ ఒక ఉదాహరణ చూస్తే... ఫ్రెండ్స్​లో ఒకరు ‘తప్పంతా నీలోనే ఉంది. జీవితాన్ని నీకు లీడ్​ చేయడం రావట్లేదు’ అని ఎప్పుడూ ఏదో ఒక నెగెటివ్​ కామెంట్ చేస్తుంటే...  అప్పటికప్పుడు వాళ్ల నుంచి దూరంగా పోవాలి అనిపిస్తుంది కదా! యాంగ్జైటీ డిజార్డర్​ ఉన్న వాళ్లు తరచుగా తమ గురించి తాము అలానే అనుకుంటుంటారు. అలా అనుకుంటున్న విషయం వాళ్లు గుర్తించలేరు కూడా. ఇలా తమని తాము తక్కువగా అనుకునే వాళ్లకు వాళ్ల మీద వాళ్లకు దయ ఉండదు.

అందుకే ఇలాంటి వాళ్లలో మార్పు వెంటనే మొదలు కావాలి. సొంతంగా ఎవరికి వాళ్లు వాళ్లని క్షమించుకోవడం మొదలుపెట్టాలి. ఏదైనా ఒక పరిస్థితి లేదా పని వల్ల చిరాకు పుడితే మిమ్మల్ని విమర్శించుకోవద్దు. ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే వెంటనే మిమ్మల్ని మీరు బ్లేమ్​ చేసుకుంటారనే విషయాన్ని మైండ్​కి చెప్పాలి. అలాంటి నెగెటివ్​ ఆలోచనలను వదిలేయాలి. మీ దృష్టంతా మీరు చేస్తున్న పని మీదకు మళ్లించాలి.

ఆందోళన వాయిదా వేసి...

మరో ఎఫెక్టివ్​ స్ట్రాటజీ... ‘వెయిట్​ టు వర్రీ’. ఆందోళన పడటాన్ని వాయిదా వేయాలి.  చేస్తున్న పనిలో అనుకున్నట్టు కాకుండా వేరే రిజల్ట్​ వస్తే... ‘అయ్యో’ అని వెంటనే దాని గురించి వర్రీ కావద్దు. ఆ వర్రీని కాస్త పోస్ట్​పోన్​ చేయాలి. అంతేకాదు రోజులో పదినిమిషాలు వర్రీ అవడం కోసం టైం పెట్టుకోవాలి. ఆ పది నిమిషాలు మీకు ఎంత కావాల్సి వస్తే అంత వర్రీ కావచ్చు. ఇలా ఒక టైం పెట్టుకుని ఆ టైంలోనే వర్రీ అవ్వాల్సిన విషయాన్ని గుర్తు చేసుకుంటే...  దాని గురించి అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఇక్కడ అర్థం కావాల్సింది ఒక్కటే... బుర్రలో ఆలోచనలకు మనం ఎనర్జీని  ఇవ్వకపోతే అవి త్వరగా ఖాళీ అయిపోతాయని.

ఇతరులకు చేసే సాయం

ఈ మధ్య కాలంలో ఎవరి గురించైనా ఆలోచిస్తూ ఎంత టైం గడిపారు? ఈ ప్రశ్నకు సమాధానం ‘చాలా తక్కువ లేదా అస్సలు లేనే లేదు’ అయితే మీ మోంటల్​ హెల్త్​  హై రిస్క్​ జోన్​లో ఉన్నట్టు. ఎంత పనిచేశాం? ఎంత డబ్బు సంపాదించాం? అనే విషయాల  వల్ల  దొరికే ఆనందం కంటే...  ఇతరుల అవసరాలు తెలుసుకోవడం, వాటిని తీర్చడం, అవతలి వ్యక్తులతో ప్రేమగా మాట్లాడడంలో  కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనంత దొరుకుతుంది. అలాగని చుట్టుపక్కల వాళ్లనుంచి వచ్చే పొగడ్తలు ఆనందాన్ని ఇస్తాయని కాదు. ఎవరికైనా సాయం చేస్తే బుర్రలో ఉన్న యాంగ్జైటీ, బాధలు పోతాయి. ఎదుటి వాళ్ల జీవితాల్లో కొద్ది మోతాదులో మార్పు తేగలిగినా మీ మనసుకు ఎనలేని ఆనందం కలుగుతుంది.

తెలియాల్సిన అవసరంలేదు

నలుగురితో కలిసిమెలిసి ఉండడం అనేది మానసికారోగ్యాన్ని ఇస్తుంది.  నిజానికి ‘జీవించడానికి ఏం లేదు’ అనుకునేవాళ్లకు జీవితం నుంచి ఆశించడానికి కూడా ఏమీ ఉండదు. ఇలా ఆలోచించే వాళ్లకి అర్థం కావాల్సింది... జీవితం వాళ్లను ఏదో చేయమని చెప్తోందని. ‘నా అవసరం ఇతరులకు ఉంద’నే ఆలోచన మంచి ఫీల్​ ఇస్తుంది. ఉదాహరణకు... చిన్న పిల్లలను, వయసు మీద పడిన తల్లిదండ్రులను చూసుకోవడం.  వలంటీర్​గా ఉండడం​, భవిష్యత్​ తరాలకు పనికొచ్చే పనేదైనా చేయడం. ఇలాంటి వాటిలో ఏ పని చేశారనేది ఆ తరాలకు తెలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... ఏం చేశారనేది మీ మనసుకు తెలుసు. అదిచాలు జీవితం ఎంత ముఖ్యమైనది, ఎంత భిన్నమైనది అనేది తెలిసేలా చేసేందుకు. అందుకనే డోన్ట్​ వర్రీ ‘డు ఇట్​ బ్యాడ్లీ’ అనే ఈక్వేషన్​ నమ్మి హ్యాపీగా జీవితంలో ముందుకు వెళ్లిపోవాలి.

సైన్స్​ ఏం  చెప్తోంది?

జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ఎలా హ్యాండిల్​ చేస్తున్నారు అనే దాని మీద మీలో  ఎంత యాంగ్జైటీ ఉందనేది తెలుస్తుంది. ఎందుకంటే యాంగ్జైటీ నుంచి ఎలా బయటపడుతున్నారనేది యాంగ్జైటీ లెవల్స్​ తగ్గించడంలో సాయపడుతుంది. వాటిలో టాప్​ కోపింగ్ స్కిల్స్​ గురించి కేంబ్రిడ్జి యూనివర్సిటీ  వాళ్లు చేసిన స్టడీ కొన్ని విషయాలు చెప్పింది. ఆ స్టడీలో తెలుసుకున్న విషయాలను 2017లో ప్యారిస్​లో జరిగిన ‘యూరోపియన్​ కాంగ్రెస్​ ఆఫ్​ న్యూరోసైకోఫార్మకాలజీ’లో పేపర్​ ప్రెజెంట్ చేశారు. 

అదే తగ్గుతుందిలే అనుకోవద్దు

ఈ విషయం మీద పరిశోధనలు జరిగాయి. వాటిల్లో ఏం తేలిందంటే యాంగ్జైటీ డిజార్డర్​ను ట్రీట్​మెంట్​ చేయకుండా వదిలేస్తే ... యాంగ్జైటీ కాస్తా తరువాత డిప్రెషన్​కి దారి తీస్తుంది. కొన్నిసార్లు అకాలమరణాలకు కారణం అవుతుంది. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తుంటాయి. తీవ్రమైన అనారోగ్యాల బారిన పడతారు. కొన్నిసార్లు ఎక్కువకాలం యాంగ్జైటీకి మందులు వాడితే ఆ మందులు పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. లక్షణాలు తిరగబెట్టి పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది.