మనుషులైనా, జంతువులైనా రోజూ ఆరోగ్యంగా ఉండలేరు. ఏదో ఒకరోజు అనారోగ్యం బారిన పడాల్సిందే. తినే అలవాట్లు, చేసే పనులు, కంటి నిండా నిద్ర... ఇవన్నీ ఒక సైకిల్ ప్రకారం ఉంటే అంతా బాగానే ఉంటుంది. ఆ సైకిల్ ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడే అనారోగ్యం పలకరిస్తుంది. అలాగే.. ఓజోన్ పొర కూడా. మనం చేసే పనులను బట్టే అది ఆరోగ్యంగా ఉంటుంది.
మోతాదుకు మించి విషవాయువులు విడుదల కావడం, గ్లోబల్ వార్మింగ్‌ని ఓజోన్ లేయర్ తట్టుకోలేకపోతోంది. దాంతో నెమ్మదిగా పొర క్షీణిస్తోంది. అలా ఒక రంధ్రం ఏర్పడే స్టేజ్‌కి వెళ్తోంది. రంధ్రం పడిందంటే.. ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఎప్పుడు? ఏం జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే ప్రకృతి విలయాలు ఎలా? ఎప్పుడు? జరుగుతాయో అంచనా వేయడం కష్టం. ప్రస్తుతం చూస్తున్న విపరీతమైన వరదలు, కాలుష్యం, తీవ్రమైన ఉష్ణోగ్రతలకు కారణం మనిషే. కాబట్టి మనిషే వాటికి చెక్ పెట్టాలి. చెట్లు పెంచాలి. కాలుష్యాన్ని తగ్గించాలి.
ప్రకృతికి హాని చేసే వాటిని వాడడం మానేయాలి. అప్పుడే ఓజోన్ పొర బాగుపడుతుంది. క్రమంగా ఏర్పడిన రంధ్రం పూడిపోతుంది. దీన్నే ‘ఓజోన్ హీలింగ్’ అంటారు. అయితే... ఒక్కసారి రంధ్రం పూడిందంటే మళ్లీ ఏర్పడదని కాదు. రంధ్రం ఏర్పడాలన్నా, పూడాలన్నా మనిషి చేసే పనుల మీదే ఆధారపడి ఉంది. కాబట్టి ప్రకృతిని సరిగా కాపాడుకోకపోతే ఎన్నిసార్లైనా రంధ్రం పడొచ్చు. అది చిన్నగా ఉన్నప్పుడే గుర్తిస్తే ప్రమాదాలు జరగకుండా అడ్డుకోవచ్చు. లేదంటే చినుకు చినుకు కలిసి గాలి వాన అయినట్టు.. చిన్న రంధ్రమే పెరిగి పెద్దదవ్వొచ్చు. అప్పుడు ఎంత జాగ్రత్తపడినా లాభం ఉండకపోవచ్చు.
ఓజోన్ హోల్ అంటే..
భూమి ఉపరితలం మీద పొరలు ఉంటాయి. వాటిలో మొదటిది ట్రోపో స్పియర్. రెండోది స్ట్రాటో స్పియర్. ఈ రెండింటి పైన ఉండేదే ఓజోన్ లేయర్. సూర్యుడి నుంచి వచ్చే కిరణాల్లో అతి ప్రమాదకరమైనవి యూవీ కిరణాలు. అవి భూమ్మీద నేరుగా పడితే జీవరాశి నశించిపోతుంది. అలా జరగకుండా ఓజోన్ పొర అడ్డుగోడలా ఉంది. కానీ, గాల్లో విషవాయువులు, వేడి వాతావరణం పెరగడం వల్ల ఓజోన్ లేయర్ దెబ్బ తింటోంది.
స్ట్రాటో స్పియర్ మీద యూవీ కిరణాలు పడడం వల్ల ఎలాంటి నష్టం జరగదు. దాన్ని ముందే పసిగట్టి ఓజోన్ పొరకు పడిన రంధ్రాన్ని మళ్లీ పూడ్చడం వల్ల ప్రమాదం తప్పుతుంది. కానీ భూమ్మీదకి యూవీ కిరణాలు చేరలేదు కదాని నిర్లక్ష్యం చేస్తే అవి కాస్త ట్రోపో స్పియర్ మీదకు వస్తాయి. అప్పుడు నేరుగా జీవరాశిపై ఎఫెక్ట్ పడుతుంది.