పిల్లలు లేకపోతే నష్టలేంటి?

ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఎంత బాగుంటుంది! ఆఫీస్‌ నుంచి ఇంటికెళ్లి పిల్లలతో కాసేపు గడిపితే అప్పటివరకు పడ్డ స్ట్రెస్​ అంతా మాయమవుతుంది. ఇదంతా ఒకప్పటి తరం ఆలోచన. కానీ.. ఈ జనరేషన్‌లో కొందరు మాత్రం పిల్లలు లేకపోవడమే బెటర్‌‌ అంటున్నారు. పిల్లలు వద్దనుకుంటున్న వాళ్లలో కొందరు ‘ఖర్చు ఉండదు. బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం లేదు’ అంటుంటే... మరికొందరేమో పర్యావరణానికి మేలు చేస్తున్నాం’ అంటున్నారు. ఒకప్పుడు పిల్లలు లేకపోవడం చెప్పుకోలేని బాధ. ఇప్పుడు పిల్లలు ఉండడమంటే భరించలేని ఖర్చు! అందుకే ‘డ్యుయల్‌ ఇన్‌కం నో కిడ్స్‌’ అనే ట్రెండ్ ఫాలో అవుతున్నారు చాలామంది కపుల్స్‌.

నష్టాలేంటి? 

ఎక్కువ ఖర్చు 

పిల్లలు లేకపోతే.. చాలామందిలో పొదుపు చేయాలనే ఆలోచన ఉండదు అంటున్నారు ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌. లగ్జరీగా బతకడానికి సంపాదించిందంతా ఖర్చు చేసేస్తే.. అవసరానికి డబ్బు ఉండదు. యవ్వనంగా ఉన్నప్పుడు ఖర్చు చేయడంలో క్రమశిక్షణ లేకుంటే వయసొచ్చాక బాధపడాల్సి ఉంటుంది. 

వయసొచ్చాక సమస్య

యంగ్‌‌‌‌గా ఉన్నప్పుడు ఎవరి అవసరమూ ఉండదు. కానీ.. ఒక వయసొచ్చాక నా అనుకునేవాళ్లు లేకపోతే.. కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కనీసం సొంత పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తోడుండేది పిల్లలే. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం.. ఇప్పటికీ చాలామంది ఇంట్లో ఉండే పెద్దవాళ్ల కోసం శ్రద్ధ తీసుకుంటారు. వాళ్ల సంరక్షణ కోసం రోజుకు కనీసం రెండున్నర గంటల కంటే ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. కాబట్టి డింక్‌‌‌‌లు పిల్లలకు చిన్నప్పుడు అందించిన సంరక్షణకు గాను తిరిగి కృతజ్ఞత చూపించే పిల్లల వల్ల వచ్చే సంతృప్తిని అనుభవించలేరు.

భాగస్వామిని కోల్పోతే..

భార్యాభర్తలు అయినంత మాత్రాన ఇద్దరూ ఒకేసారి చనిపోరు కదా! కాబట్టి వాళ్లలో ఒకరు చనిపోతే.. మిగిలినవాళ్లు ఆ వయసులో తోడులేక చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. చేతిలో డబ్బు ఉండడం వల్ల అన్ని సౌకర్యాలు దొరుకుతాయి. కానీ.. తోడునిచ్చే నీడని మాత్ర కొనుక్కోలేం. కాబట్టి పిల్లలు ఉండడమే బెటర్ అంటున్నారు ఎక్స్‌‌‌‌పర్ట్స్. 

బాండింగ్ ఉండదు

లైఫ్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌తో ఏదైనా గొడవైనా, ఇంకేదైనా సమస్య వచ్చినా విడిపోతుంటారు. కానీ.. పిల్లలు ఉంటే డైవర్స్ తీసుకోవడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే.. విడాకులు తీసుకుంటే పిల్లలు తండ్రి లేదా తల్లి ప్రేమకు దూరమవుతారు. అందుకే భార్యాభర్తల్ని కలసి ఉండేలా చేసేది పిల్లలే అంటారు పెద్దలు.