ఆధ్యాత్మికం: కర్మ .. యోగం .. అంటే ఏమిటి.. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు.

సాంఖ్య యోగంలో కర్మసన్యాసమే గొప్పదంటాడు కృష్ణుడు. అదివిన్న అర్జునుడు  కర్మ సన్యాసమే గొప్పదైతే నన్ను ఈ యుద్ధ కర్మ ఎందుకు చేయమంటున్నావో వివరించు' అని ప్రార్థిస్తాడు. నిజానికి జ్ఞాన యోగం, కర్మ యోగం వేరువేరుకావు. ప్రతిఫలాపేక్ష లేకుండా, భౌతిక వాంఛలకు లోనుకాకుండా చేసే పనుల వల్ల, విద్యుక్త ధర్మాచరణ వల్ల, అంతఃకరణం పరిశుద్ధ మవుతుంది. ఇది మోక్షసాధనకు మొదటి మెట్టు. ఇలా అంతఃకరణ శుద్ధి పొందిన సాధకుడు అన్నిటినీ పరమాత్మమయంగానే చూస్తాడు. ఏవని చేసినా అది చేసింది తాను కాదనుకుంటాడు. తానుచేసే పనులన్నిటికీ... కర్త, కర్మ, క్రియ భగవంతుడే అనుకుంటాడు. ఇలా ఉండడాన్నే సాంఖ్యయోగం లేదా జ్ఞానయోగం అంటారు.

స్వధర్మే నిధనం శ్రేయః
 పరధర్మో భయావహః

“మంచిగా అనిపించే పరధర్మం కంటే కూడా గొప్పగా అనిపించనప్పటికీ స్వధర్మమే ఉత్తమమైంది. ఎప్పటికైనా పరధర్మం భయావహమే.. స్వధర్మాచరణలో ప్రాణం పోయినా మంచిదే అంటాడు పరమాత్మ బాగా అనిపించే పరధర్మాన్ని పట్టుకోకుండా బాగా అనిపించకున్నా స్వధర్మాన్నే ఎందుకు నమ్ముకోవాలి?

స్వధర్మం అంటే మన సహజ స్థితికి సరిపోయే ధర్మం. మన ప్రకృతికి సరిపోయే ధర్మం. మన ఆత్మ పరిణామ దశ. ఆత్మస్థాయికి తగ్గ ధర్మం. దీనికి వ్యతిరేకమైన ధర్మం పరధర్మం. ఈ విషయం బాగా అర్థం కావాలంటే... శరీర కొలతలకు సరిపోయే దుస్తులు అందంగా లేక పోయినా అవి వేసుకోవడమే సౌకర్యం. -మనకు సరిపోని దుస్తులు ఎంత బాగున్నా ఇబ్బంది కలిగిస్తాయి.

మహాభారత కాలంలో...  ద్రోణుడు బ్రాహ్మణుడు .  సాత్విక ప్రవృత్తికి చెందిన వృత్తి చేయాలి. అందుకు భిన్నంగా రాజస ప్రవృత్తితోకూడిన వృత్తిని చేశాడు.. బ్రాహ్మణులు ఆయుధ విద్యలను ఇతరులకు నేర్పించొచ్చు. అది సాత్విక ప్రవృత్తి. స్వయంగా ఆయుధం ధరించియుద్ధం చేయకూడదు. ఎందుకంటే అది రాజన ప్రవృత్తి తనకుల ధర్మానికి, సహజ ప్రవృత్తికి విరుద్ధంగా ఉన్న మరో ధర్మాన్ని పాటించడంవల్లే ఏకలవ్యుడి లాంటి వాడికి అన్యాయం చేశాడు.    అర్జునుడు క్షత్రియుడు ...కులధర్మంగా... ప్రవృత్తి ధర్మంగా ధర్మ రక్షణకు ఆయుధం పట్టాలి. ప్రాణాలకు తెగించి పోరాడాలి. అలాంటి వాడు ఆయుధాలను వదిలి బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తానన్నాడు. అలా చేయడం తాత్కాలికంగా బాగున్నా సత్ఫలితాలను ఇవ్వదు. 

ఇక ఇప్పటి పరిస్థితులకు వస్తే కులధర్మాలు లేవు. వృత్తిధర్మాలు ఉన్నాయి. పక్కవాళ్లతో పోల్చుకుని తమ వృత్తిని కించపరుచుకునే వాళ్లనీ చూస్తున్నాం. దీనికి కారణం మనకు సరిపోని వృత్తులను స్వీకరించడమే. స్వీకరించిన వృత్తికి న్యాయం చేయలేక పోవడమే. అందుకే సహజ ప్రవృత్తికి సరిపోయే వృత్తినే స్వీకరించి, ఆ వృత్తికి న్యాయం చేయాలి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ప్రవర్తించొద్రని చెబుతుంది భగవద్గీత.

గీతలో కృష్ణుడు అర్జునుడితో... 'అర్జునా! ఎవడైతే మనసులో ఇంద్రియాలను వశపరచుకొని, కర్మ ఫలాపేక్ష లేనివాడై కర్మయోగాన్ని అనుసరిస్తాడో వాడే పరమ శ్రేష్ఠుడు' అంటాడు.

 ఇక్కడ కర్మ' అంటే వృత్తి ధర్మం.. 'యోగం' అంటే భగవంతునితో సంయోగం.. ప్రాపంచిక ధర్మాలను నిర్వర్తిస్తూ భగవంతుడిపైనే మనసు నిలిపేవాడు కర్మయోగి .  అలాంటివాడు ఏ పని చేస్తున్నా కర్మబంధాలూ అంటవు. ఎందుకంటే ఏ వ్యక్తినైనా కర్మబంధాలతో కట్టిపడేసేది కర్మఫలాలపై ఆసక్తి మాత్రమే... అంతేకాని కర్మలు కావు. పనిచేయడం కర్మ ... కర్మను భగవదర్పణంగా చేయడం కర్మయోగం. నీకు నిర్దేశించిన కర్మలను నువ్వు చేయడమే సరైంది. దేనినీ చేయకపోవడంకంటే నీధర్మాన్ని అనుసరించిన కర్మ చేయడమే  ఉత్తమం. ఏ కర్మా చేయకుంటే నీ శరీర  నిర్వహణ కూడా కొనసాగదు కదా!

ఎవరు చేసే కర్మవాళ్లు వేయాలి. ప్రతి వ్యక్తికీ కొన్ని తప్పనిసరి కర్మలుంటాయి. వాటినే నియతకర్మలన్నాడు పరమాత్మ. నియతకర్మలను చేయకుంటే సమాజం ముందుకు వెళ్లదు. నియతకర్మలను ఈశ్వరార్పణం చేసి కొనసాగిస్తే ఎలాంటి మానసిక ఒత్తిడులూ దరిచేరవు. 

అర్జునా! సర్వం ఈశ్వరార్పణం అనే భావనతో చేసే కర్మలన్నీ యజ్ఞకర్మలే. నీ విద్యుక్తధర్మాన్ని, కర్మ ఫలాసక్తి లేకుండా. ..ఈశ్వరార్పణ దృష్టితో నిర్వహించు.   

సృష్టి ప్రారంభంలో జీవులను సృష్టించిన సృష్టికర్తే యజ్ఞాలను సృష్టించాడు. కోరిన కోరికలను తీర్చే యజ్ఞాలు చేసి వృద్ది పొందమన్నాడు. దేవతలకు ప్రియమైన యజ్ఞాలను చేస్తే దేవతలు సంతృప్తి చెందుతారు. సంతృప్తి చెందిన దేవతలు మీ కోరికలు తీరుస్తారు. అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. యజ్ఞాల వల్ల సంతృప్తిపొందిన దేవతలు కావలసిన వాటిని ప్రసాదిస్తారు. ఇలా లభించిన వాటిని ఆ దేవతలకు సమర్పించకుండా అనుభ వించేవాళ్లు నిస్సందేహంగా నిర్వహణ కూడా కొనసాగదు కదా!


ప్రకృతే మన ఉనికికి, మనుగడకు ఆధారం మనం పొందే ప్రతిదానినీ ప్రకృతినుంచే పొందినప్పుడు  ప్రకృతికి ఎంతో కొంత తిరిగివ్వాలి. అలా ఇచ్చేది భక్తిపూర్వకంగా ఉండాలి. భక్తిపూర్వకంగా ప్రకృతికి చేసే సమర్పణే యజ్ఞం.   యజ్ఞంలో హోమద్రవ్యాలతో పాటు అహంకారాన్ని కూడా ఆహుతిచేసే సర్వం. భగవంతునికి సమర్పించాలి. అందుకే యజ్ఞాలలో ఆహుతిని ఇచ్చేటప్పుడు 'ఇదం స మవ' 'ఇది నాది 'కాదు' అంటారు. యజ్ఞాన్ని కోరికలు తీర్చే సాధనంగా కాకుండా ప్రకృతికి చేసే కృతజ్ఞత సమర్పణంగా నిర్వహించాలి. అలా చేస్తేనే ప్రకృతి సంతోషిస్తుంది.

జ్ఞానం అకస్మాత్తుగా రాదు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ. సంపాదించుకోవాల్సిందే. ఒక్కోసారి పైమెట్టులో ఉన్న వాళ్లకి కింది మెట్టులో ఉన్న వాళ్ల పనులు. అర్ధంలేనివిగా అనిపించొచ్చు. అంతమాత్రం చేత అలాంటి పనులను విమర్శించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు నిరాకార దైవాన్ని ఉపాసించే వ్యక్తికి విగ్రహారాధన చేయడం అల్పత్వంగా అనిపిస్తుంది. అయినా అలా చేసేవాడిని తప్పు పట్టొద్దు దానిని సాధనలో తొలిమెట్టుగానే భావించాలి. క్రమంగా మలిమెట్టుకు మార్గం చూపాలి.