సమాజంలో థర్డ్​ జెండర్ అంటే?

మానవ సమాజంలో మనుషుల లైంగిక లక్షణాల ఆధారంగా స్త్రీలు, పురుషులు అని సహజమైన విభజన ఉంది. దీన్నే జెండర్ బైనరీ అంటారు. స్త్రీలు, పురుషులతోపాటు ఎలాంటి లైంగికపరమైన లక్షణాలు లేకపోవడం లేదా క్రోమోజోమ్​ల లోపం వల్ల స్త్రీ, పురుష లక్షణాలు కలిసి ఒక్కరిలోనే ఉండేవారిని  థర్డ్​ జెండర్​గా వ్యవహరిస్తారు. ఇందులో పురుషుడిగా జన్మించినా స్త్రీగా మారాలనే కోరిక ఉండటం లేదా స్త్రీగా జన్మించినా పురుషుడిగా మారాలనుకునే మానసిక కోరిక ఉన్నవారు

ఈ క్రమంలో లైంగిక అవయవాలు మార్పిడి చేసుకున్నవారు ఇందులోకి వస్తారు. వీరు జెండర్​ కారణంగా సామాజిక వెలి, వివక్షతలను ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం థర్డ్​ జెండర్ సంక్షేమం కోసం హక్కుల కల్పన, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి.

జెండర్ బైనరీ అంటే లింగపరంగా లేదా లైంగిక లక్షణాల పరంగా మనుషులు రెండు రకాలుగా ఉంటారు. అవి.. 1. పురుష లైంగిక, శారీరక లక్షణాలు 2. స్త్రీ లైంగిక, శారీరక లక్షణాలు. కానీ, వాస్తవానికి మనుషులు స్త్రీ, పురుష లింగాలుగానే కాకుండా అంతకుమించి కూడా ఉంటారు. ఇలాంటి వారిని సాధారణంగా ఇతర లింగం లేదా అదర్ అని పిలిచేవారు.

కానీ, ట్రాన్స్​జెండర్స్​ పర్సన్స్ యాక్ట్​ 2019 అమలులోకి వచ్చిన తర్వాత థర్డ్​ జెండర్ అనే పదం ఉపయోగించడం చట్టబద్ధంగా మారింది. 2014 నల్సా కేసులో థర్డ్​ జెండర్ అనే ఒక రకమైన జెండర్​ ఉంటుంది. స్త్రీ, పురుష లింగాలతోపాటు థర్డ్​ జెండర్ లేదా మూడో లింగం గుర్తింపు చట్టబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 

మూడో లింగం వారి సమస్యలు

  •     థర్డ్​ జెండర్ వారు సామాజిక వెలికే కాకుండా కుటుంబం నుంచి వివక్షతకు గురవుతున్నారు. వీరు లింగపరమైన మైనార్టీలు. వీరికి ఓటు బ్యాంకు ఉండదు కాబట్టి రాజకీయంగా ప్రభావ వర్గంగా ఉండలేరు. 
  •     ప్రభుత్వ పథకాలు, విధానాల్లో జెండర్ బడ్జెటింగ్​, జెండర్ మెయిన్​ స్ట్రీమింగ్​ వ్యూహాలు కేవలం మహిళలకే పరిమితమవుతున్నాయి. కానీ, మూడో లింగం వారిని దృష్టిలో పెట్టుకుని ఆయా వ్యూహాలు ఉండటం లేదు. 
  •     పుట్టుకతో సమాజం ఆపాదించిన లింగపరమైన లక్షణాలకు భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటారు. ఈ కారణంగా తీవ్రమైన మానసిక సంఘర్షణకు, అంతర్గత ఉద్వేగానికి లోనవుతారు. 
  •     సమాజంలో వీరికి స్త్రీల మాదిరిగా ప్రత్యేక సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆయా సామాజిక వనరులను వినియోగించుకోలేకపోతున్నారు. 
  •     వీరు సమాజంలో పేదరికానికి, భిక్షాటనకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో అక్రమ రవాణాలో బలవుతున్నారు. హెచ్​ఐవీ సోకే దుర్బల వర్గంలో వీరూ ఒకరు. 
  •     ప్రజలందరికి ఉద్దేశించిన సౌకర్యాలైన పాఠశాలలు, రవాణా సౌకర్యాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను స్త్రీ, పురుషుల మాదిరిగా వినియోగించుకోలేకపోతున్నారు. ఇందు ప్రధాన కారణం సమాజంలో వీరి పట్ల ఉన్న చిన్న చూపు, వివక్షత.

సంక్షేమ కార్యక్రమాలు గరిమ గృహ

గరిమ గృహ పథకం ముఖ్య ఉద్దేశం కుటుంబం వదిలించుకున్న మూడో లింగంతోపాటు అనాథలకు ప్రాథమిక సౌకర్యాలైన నివాసం, భద్రత, ఆహారం తదితర సౌకర్యాలు కల్పించడం. ప్రస్తుతం దేశంలో 12 గరిమ గృహాలు సేవలు అందిస్తున్నాయి. 

స్కాలర్​షిప్ లు 

మూడో లింగం విద్యార్థులకు సెకండరీ, సీనియర్​ సెకండరీ, డిప్లొమా, డిగ్రీ, పీజీ స్థాయిలో స్కాలర్​షిప్​లు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఏడాదికి రూ.13,500 అందిస్తున్నారు. 

స్మైల్​ పథకం

ఈ పథకాన్ని సపోర్ట్​ ఫర్​ మార్జినలైజ్డ్​ ఇండివిడ్యువల్​ ఫర్​ లైవ్లీహుడ్​ ఎంటర్​ ప్రెన్యూర్​ అంటారు. దీనిని 2022, ఫిబ్రవరి 12న ప్రారంభించారు. స్మైల్​ పథకంలో భాగంగా మూడో లింగం, భిక్షాటకులకు సమీకృత పునరావాసాన్ని అందిస్తారు. ఇందులో భాగంగానే గరిమ గృహాలను నిర్మించారు. 

సర్టిఫికేట్లు, ఐడెంటిటీ కార్డులు 

మూడో లింగం వారికి ఐడెంటిటీ కార్డులు అందించేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ పరిధిలో సపోర్టు ఫర్​ మార్జినలైజ్డ్​ ఇండివిడ్యువల్స్​ ఫర్​ లైవ్లీహుడ్​, ఎంటర్​ప్రైజ్​ అనే పోర్టల్​ (నేషనల్​ పోర్టల్​ ఫర్ ట్రాన్స్​జెండర్​ పర్సన్స్​), పథకం ద్వారా స్మైల్​ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీనిలో మూడో లింగం వారి సంక్షేమం, పునరావాస పథకం, భిక్షాటకుల పునరావాస పథకం అనే రెండు ఉప పథకాలు ఉన్నాయి. 

నైపుణ్యాభివృద్ధి, శిక్షణ

మూడో లింగం వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా పీఎం దక్ష అనే పథకంలో భాగంగా నైపుణ్య, శిక్షణాభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖలో భాగంగా పనిచేసే నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ సోషల్​ డిఫెన్స్​ వారు కూడా వీరి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. 

ట్రాన్స్​జెండర్లకు సమాన అవకాశాల విధానం 

ఈ విధానాన్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ రూపొందించింది. ట్రాన్స్​జెండర్​ పర్సన్స్​ లేదా మూడో లింగం వారి పట్ల వివక్షత అంతం చేయడం, సమాన అవకాశాలు కల్పించడం, పనిచేసే దగ్గర అన్ని హక్కులతోపాటు గౌరవానికి భంగం కలిగించకుండా చూడటం ఈ విధానం లక్ష్యాలు.

ద ట్రాన్స్​జెండర్​ పర్సన్స్​ (ప్రొటెక్షన్​ ఆఫ్​ రైట్స్​) యాక్ట్​ 2019

మూడో లింగం వారి హక్కులను కాపాడటం, సమాన అవకాశాలు కల్పించడం ఈ చట్టం ముఖ్య లక్ష్యం.  ఈ చట్టం ద్వారా మూడో లింగం వారికి చట్టబద్ధమైన గుర్తింపు, వివక్షతలకు వ్యతిరేక హక్కు, తల్లిదండ్రులు లేదా కుటుంబంతో నివసించే హక్కును కల్పించింది. ఈ చట్టంలోని సెక్షన్​ 22 ప్రకారం కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వశాఖ 2020, సెప్టెంబర్ 25న నియమ నిబంధనలు రూపొందించింది. ​సెక్షన్ 3 ప్రకారం మూడో లింగం వారి పట్ల వివక్షతను నిషేధించారు. సెక్షన్ 4 ప్రకారం మూడో లింగం వారికి చట్టపరమైన గుర్తింపును ఇచ్చింది.

5వ సెక్షన్ ద్వారా మూడో లింగం వారిని గుర్తించే సర్టిఫికేట్​ను అందిస్తున్నారు. సెక్షన్ 7 ద్వారా ఎవరైనా లింగ మార్పిడి వివరాలను వారి సర్టిఫికేట్​లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సెక్షన్ 9 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో వివక్ష ఉండకూడదు. సెక్షన్​ 12 ప్రకారం కుటుంబ సభ్యులతోపాటు నివసించే హక్కును కల్పించారు. సెక్షన్ 13 ప్రకారం విద్యా సంస్థలు, మూడో లింగం వారికి కూడా విద్యావకాశాలు కల్పించాలి. సెక్షన్ 14 ప్రకారం వీరికి వృత్తిపరమైన శిక్షణ, స్వయం ఉపాధి కల్పించాలి. సెక్షన్ 15 ప్రకారం వీరికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి.

సెక్షన్​ 16 ప్రకారం వీరికోసం జాతీయ స్థాయిలో నేషనల్​ కౌన్సిల్​ ఫర్ ట్రాన్స్​జెండర్​ పర్సన్​ లేదా మూడో లింగం వారి కోసం జాతీయ మండలిని ఏర్పాటు చేశారు. సెక్షన్​ 6 ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్​ వీరికి గుర్తింపు కార్డును జారీ చేస్తారు. సెక్షన్ 18 ప్రకారం మూడో లింగం వారితో వెట్టిచాకిరి, ఆరోగ్య భద్రతకు హాని కలిగించేలా శారీరకంగా, మానసికంగా హింసించినా , దూషించినా, లైంగిక దాడికి పాల్పడినా నేరంగా పరిగణిస్తారు. ఇందుకు ఆరు నెలల నుంచి రెండేండ్ల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తారు.