ఆధ్యాత్మికం : పండుగులకు.. ప్రకృతికి సంబంధం ఏంటీ... గ్రహాలు, నక్షత్రాల ప్రభావం ఏంటీ..!

మానవ జీవనం ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. ప్రకృతిలోని మార్పుల ఆధారంగా అంటే కాలానికి అనుగుణంగా గ్రహ,నక్షత్రాల ప్రభావాలను పరిశీలిస్తూ పండుగలు నిర్ణయిస్తారు. కాబట్టే నోములు, వ్రతాలు, ఉత్సవాలు, పండుగలు.. లాంటి కార్యాలు చేసుకుంటాం. మనదేశంలో సంవత్సరమంతా ఏదో ఒక రూపంలో వేడుక నిర్వహిస్తూనే ఉంటాం.

మకర సంక్రాంతి

తెలుగువాళ్లు నిర్వహించుకునే మరో ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి. సూర్యుడు ఉత్తరాభి ముఖంగా ప్రయాణం చేస్తూ ప్రకృతిలో అందం, ఆనందంతో కూడిన మార్పుని తీసుకొస్తాడు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినపుడు మకర సంక్రాంతి అంటారు. ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాభి ముఖంగా పయనిస్తాడు. సంక్రాంతి అంటేనే ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు, గంగిరెద్దుల సంబరాలు, కోళ్ల పందేలు, పతంగులు ఎగరేస్తారు. పత్తి, నూనె, నెయ్యి, జీలకర్ర.. లాంటి వస్తువులతో నోములు నోచుకుంటారు. భోగి మంటలు, గోదా కల్యాణాలు. కనుమ రోజు పశువులకు పూజ చేస్తారు..

Also Read :- ముక్కోటి ఏకాదశి.. ముక్తి దాయకం.. క్షీర సముద్రం నుంచి అమృతం పుట్టిన రోజు ఇదే

అనుబంధాన్ని పంచే రాఖీ

శ్రావణ మాసంలో పూర్ణిమ రోజు చేసుకునే ఉత్సవం రాఖీ పూర్ణిమ సోదరులకు వాళ్ల అక్క చెల్లెళ్లు రాఖీలు కట్టి ఆత్మీయతను పంచుకుంటారు. ఇది కుటుంబ వాతావరణంలో ఆనందాన్ని, అనుబంధాన్ని పెంచుతుంది. ప్రకృతికి సంబంధించిన మరో ఉత్సవం హోళి... దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. రంగులు చల్లుకోవడంతో పాటు ముందు రోజు కామదహనం నిర్వహిస్తారు.

దైవ చింతన ప్రధానం

మిగిలిన పండుగల్లోనూ పూర్తిగా దైవచింతనే ప్రధానంగా ఉంటుంది. శ్రీ రామనవమి, హనుమత్ జ్జయంతి, నృసింహ జయంతి, తొలి ఏకాదశి, వ్యాస పూర్ణిమ (గురు పూర్ణిమ), వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలు, దీపావళి, కార్తీక దీపోత్సవాలు, దత్త జయంతి, ముక్కోటి ఏకాదశి, రథ సప్తమి.. మొదలైన ఉత్సవాలన్నీ దైవాలకు అనుబంధంగా నిర్వహించుకునే పండుగలే. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పండుగలు చేసుకోవడం వల్ల దైవ చింతన కలిగి ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి.

మహిళలు సమూహంగా చేసుకునే పండుగల్లో బోనాలు, బతుకమ్మ, దసరా, సంక్రాంతి మొదటిస్థానంలో ఉంటాయి. శ్రావణ మంగళ, శుక్రవారాల్లో నోచే నోములకు ప్రముఖ స్థానమే. పండుగలను నిర్వహించడంలో తెలుగువాళ్లకి అందులోనూ తెలంగాణ ప్రాంత ప్రజలకు విశిష్టమైన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలున్నాయి. తెలుగు మాసాల పరంగా చూస్తే మన పండుగల్లో మొట్టమొదటిది చైత్రశుద్ధ పాడ్యమి రోజు నిర్వహించే 'ఉగాది'. తెలుగు వాళ్లకు ఉగాది చాలా ప్రత్యేకం. ఆ రోజు ఆరు రుచులతో పచ్చడిని తిన్న తర్వాతే మిగిలిన పనులు ప్రారంభిస్తారు.

మానసిక ప్రశాంతత

ప్రకృతికి అనుగుణంగా జీవించడం, మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు దైవ పూజలు నిరంతరం చేస్తుండటం, అందరితో ఆనందంగా గడపడం, అందరికీ పండుగల సమయాల్లో ఆహారం, ధనం, వస్తువులు పంచుకోవడం, ఉన్నతిని కోరుకోవడం తెలుగువారి పండుగల నిర్వహణలో ముఖ్య ఉద్దేశం.

-వెలుగు, లైఫ్-