ఈ మధ్య ఏడ చూసినా ‘డిజిటల్ అరెస్ట్’ వార్తలే.. ‘డిజిటల్ అరెస్ట్’ అంటే ఏంటసలు..?

డిజిటల్అరెస్ట్..ఈ మధ్యన్యూస్ పేపర్లలో, టీవీల్లో, సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్​చల్ చేస్తున్నాయి.సైబర్​ నేరగాళ్లు ‘పోలీసులు, ఇన్​కం ట్యాక్స్ ఆఫీసర్స్’మంటూ బెదిరించి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. గంటల కొద్దీ.. అవసరమైతే రోజులతరబడి డిజిటల్ అరెస్ట్ పేరుతో బాధితుల్ని దోచుకుంటున్నారు. అయితే మనదేశంలో అసలు ‘డిజిటల్ అరెస్ట్’ అనేది లేదు అని ప్రధాని కూడా చెప్పారు. అయినా సరే.. ఇంకా చాలామంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? దాన్నుంచి ఎలా తప్పించుకోవాలి? సైబర్​ మోసాలను ఎలా గుర్తించాలి? వంటి అంశాలన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రీసెంట్​గా మియాపూర్​కి చెందిన ఒక టెకీ డిజిటల్​ అరెస్ట్​ ఉచ్చు నుంచి తప్పించుకున్నాడు. అది కూడా ఒక రోజంతా డిజిటల్ అరెస్ట్​ అయ్యాక, అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అదృష్టం కొద్దీ అరెస్ట్​కి గురైన రోజు బ్యాంక్​ సెలవు కావడంతో డబ్బు పోకుండా బయటపడ్డాడు. కానీ చాలామంది డబ్బు తమ చేయి జారిపోయాక కంప్లయింట్​లు ఇస్తున్నారు. అలాంటి సంఘటనలు కూడా మనదగ్గర జరిగాయి. హైదరాబాద్​లోనే ఒక వ్యక్తి డిజిటల్ అరెస్ట్​ వల్ల దాదాపు 20 లక్షలు నష్టపోయాడు. 

ఆ తర్వాత అతను కంప్లయింట్ ఇవ్వడంతో ఆ మోసగాళ్లను బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత అతని డబ్బు అకౌంట్​కి ట్రాన్స్​ఫర్ చేయించారు. అయితే ఒకరికి డ్రగ్స్ అని, మరొకరికి మనీ లాండరింగ్​ కేసు​లో ఇరుక్కున్నారని, చాలా పాస్​బుక్​లు ఉన్న పార్శిల్ వచ్చిందని బెదిరిస్తారు. దీంతో పరువుపోతుందని కొంతమంది మాత్రం ఆ విషయం బయటకు చెప్పట్లేదట. కనీసం ఫ్రెండ్స్, ఫ్యామిలీకి కూడా చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదని పోలీసులు చెప్తున్నారు. 

డిజిటల్ అరెస్ట్​ అంటే.. 

నేరగాళ్లు ఈ మధ్య డైరెక్ట్​గా ఫోన్ చేయట్లేదు. ముందుగా ఒక ఆటోమేషన్ కాల్ రికార్డింగ్​ ద్వారా మన ఫోన్​కి కాల్ చేస్తారు. ఆ కాల్​లో ‘మీ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ డ్రగ్స్​తో లింక్ అయి ఉన్నట్టు తెలిసింది. కాబట్టి మీ ఫోన్ రెండు గంటల్లో బ్లాక్ అవ్వబోతోంది. ఆ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే ఫలానా నెంబర్​ నొక్కండి’ అని చెప్పి కట్ అయిపోతుంది. ఆ నెంబర్ నొక్కగానే ఒక వ్యక్తి వీడియోకాల్ చేస్తాడు. 

మీకు ఒక పార్శిల్ వచ్చింది. అందులో ఇల్లీగల్ ఐటెమ్స్ ఉన్నాయి అంటారు. లేదంటే చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం’ అని చెప్తారు. ఇందులో భాగంగా డీప్ ఫేక్​ వీడియోలు, నకిలీ అరెస్ట్​ వారెంట్​ చూపిస్తారు. నమ్మకపోతే వ్యక్తి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ చెప్తారు. దాంతో పాటు దీన్నుంచి బయటపడాలంటే ఆన్లైన్​లోనే సైబర్​ లేదా పోలీస్ డిపార్ట్​మెంట్ వాళ్లకు స్క్రైప్​ ద్వారా కనెక్ట్ చేస్తామని నమ్మిస్తారు. అందులో మరో నకిలీ ఆఫీసర్ కనిపిస్తాడు. పోలీస్, ఆర్బీఐ, నార్కోటిక్ వంటి ఏదో ఒక డిపార్ట్​మెంట్​కి సంబంధించిన ఆఫీసర్​​లా నటిస్తాడు. నమ్మించడానికి బ్యాక్​గ్రౌండ్​లో 

పోలీస్​ స్టేషన్ లేదా ఇన్వెస్టిగేషన్​ వంటి సెటప్ చేసుకుని, అవి వీడియోలో కనిపించేలా చూసుకుంటారు. అంతేకాకుండా నకిలీ యూనిఫాం వేసుకుని, ఐడీ కార్డు కూడా చూపిస్తారు. దాంతోపాటు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ చూపిస్తారు. నకిలీ డిజిటల్ అరెస్ట్ వారెంట్ కూడా చూపిస్తాడు. ఉన్నచోటు నుంచి కదలకూడదు. ఎవరికీ ఫోన్​ చేయొద్దు. బాత్​రూమ్​కి కూడా తలుపు తెరిచే వెళ్లాలి అని షరతులు విధిస్తారు. ఒక్క నిమిషం కాల్ కట్ చేసినా, వెంటనే చేసి మళ్లీ బెదిరిస్తారు. బయట మావాళ్లు ఉన్నారు. కాల్ కట్ చేస్తే వాళ్లు లోపలికి వచ్చి అరెస్ట్ చేసి ముంబై తీసుకొస్తారని చెప్తారు.

గంటలు.. రోజుల తరబడి..

నేరం చేయలేదని నిరూపించుకోవాలంటే ఆర్బీఐ ఏర్పాటు చేసిన అకౌంట్​లోకి మీ దగ్గర ఉన్న డబ్బంతా టాన్స్​ఫర్ చేయాలని చెప్తారు. నేరంలో మీకు ఎలాంటి ప్రమేయం లేదని తేలితే డబ్బు తిరిగి ట్రాన్స్​ఫర్ చేస్తామని చెప్తారు. అప్పటికే మోసగాళ్ల వలలో పడిన బాధితులు భయపడి, కేసైతే పేరు చెడిపోతుందనే ఆలోచనలోకి వెళ్తారు. కాబట్టి ఎవరికీ తెలియకుండా ఉండేందుకు వాళ్లు చెప్పిన అకౌంట్​కు ట్రాన్స్​ఫర్ చేస్తారు. ఇలా గంటలు, రోజుల తరబడి వీడియోకాల్​లో ఉంచి మభ్యపెడతారు. 

ఆన్​లైన్ ట్రాన్సాక్షన్ మాత్రమే కాదు.. బ్యాంక్​కి వెళ్లి మరీ తన అకౌంట్​లో ఉన్న డబ్బు, ఎఫ్​డీలు, షేర్లు వంటివన్నీ తమ అకౌంట్​కు ట్రాన్స్​ఫర్ చేయించుకుంటారు. అకౌంట్లో అమౌంట్ లేకపోయినా లోన్​ ఇప్పించి మరీ ట్రాన్స్​ఫర్ చేయించుకుంటారు. ఒక్కరోజులోనే వేరే అకౌంట్​కి ట్రాన్స్​ఫర్ చేసి, విత్ డ్రా చేసుకుంటారు. అలా ఈ ఏడాది మూడు నెలల్లోనే 120 కోట్లకు పైగా డబ్బుని మోసగాళ్లు దోచుకున్నారని పోలీస్​ రికార్డులు చెప్తున్నాయి. 

సైబర్ మోసగాళ్లు సీనియర్ సిటిజెన్స్​ని ఎక్కువగా టార్గెట్​ చేస్తుంటారు. ఎందుకంటే రిటైర్​ అయినవాళ్లకు పెన్షన్ వస్తుంది. లేదా వాళ్ల పేరు మీద ఏవైనా ప్రాపర్టీస్ ఉండొచ్చు. వృద్ధులకు డిజిటల్​ లేదా ఆన్​లైన్ సర్వీస్​ల గురించి సరైన అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటి వాళ్లకు  రకరకాలుగా మాయమాటలు చెప్పి తమ ఆధీనంలోకి తీసుకుంటారు. మొన్నటివరకు మెసేజ్​లు, ఫోన్ కాల్స్, లింక్స్, ఓటీపీ, లోన్ యాప్స్, ట్రేడింగ్​.. ఇలా సైబర్ నేరగాళ్లు డిజిటల్ మోసాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్​ ద్వారా ప్రజల్ని దోచుకుంటున్నారు. 

డిజిటల్ అరెస్ట్​లు ఉండవు

నేరం ఏదైనా సరే డిజిటల్ అరెస్ట్​ ఉండదు. నేరస్తులను డైరెక్ట్​గానే అరెస్ట్ చేస్తారు. కానీ, డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా బెదిరిస్తే అది మోసం అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ‘డిజిటల్ అరెస్ట్’​ అనే చట్టం మనదేశంలో లేదు. 

అవగాహన లేకపోతే.. 

సైబర్ మోసాల్లో చిక్కుకోవడానికి గల కారణం అవగాహన లోపమే. అంతేకాకుండా సమాజంలో పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుందనే ఆలోచనతో బాధిత వ్యక్తి ఏ ఒక్కరికీ విషయం చెప్పకపోవడం వల్ల నష్టపోతున్నారు. అయితే ఇలాంటివి జరిగినప్పుడే అప్రమత్తంగా ఉండాలి. అందుకోసం ఈ విషయాలు గుర్తుంచుకోండి.  
భారత్​లోని ఏ దర్యాప్తు సంస్థ కూడా ప్రజల వ్యక్తిగత వివరాలను ఫోన్​ ద్వారా అడగదు. గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఫోన్​ లేదా ఆన్​లైన్ ద్వారా బెదిరించదు. 

అన్​నోన్ కాల్స్ ఆన్సర్ చేయకూడదు. ఒకవేళ లిఫ్ట్ చేస్తే వెంటనే డిస్​కనెక్ట్ చేయాలి. అదీకాకపోతే  ఆన్​లైన్​లో కంప్లయింట్ చేయాలి. నెంబర్లను రిపోర్ట్, బ్లాక్ చేయాలి. మాట్లాడిస్తున్నట్లయితే లేదా.. మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ చెప్తున్నా, టెన్షన్ పడకుండా వీడియో లేదా స్క్రీన్ రికార్డ్ చేయాలి. 
ఫోన్ కట్ చేసిన వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్​ స్టేషన్​లో లేదంటే ఆన్​లైన్​లో కూడా కంప్లయింట్ ఇవ్వాలి. లేదా నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్​ లైన్ నెంబర్​1930కు కాల్ చేయాలి. లేదా పోలీసులకు కంప్లయింట్ చేయాలి. సైబర్ క్రైమ్ హెల్ప్​ లైన్ సెంట్రల్ హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సైబర్ మోసాలకు సంబంధించిన కంప్లయింట్స్​ను నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్ట​ల్​ www.cybercrime.gov.in లో నమోదు చేయొచ్చు.