నోటాకు ప్రాధాన్యమేది?

ఎన్నికల సంస్కరణలలో భాగంగా బ్యాలెట్​లో  ‘నోటా (నన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ది ఎబో)’  చేరింది.  ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ ఇష్టం లేకపోతే  నోటాకు ఓటేయచ్చు. అయితే  నోటాతో  ఎన్నికల ఫలితాలేమీ మారవు.  నోటాకు పోటీలో ఉన్న అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా ఎన్నికపై ఎలాంటి ప్రభావం పడదు.  నోటాకు పడిన ఓట్లు పోగా మిగతా ఓట్లలో ఎక్కువ వచ్చినవారిని విజేతగా ప్రకటిస్తారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేయడంతో నోటా ప్రాధాన్యంపై  దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.  నోటా అసలు ఉద్దేశం మంచి అభ్యర్థిని పాలకుడిగా ఎన్నుకోవడం.  కానీ, ఎన్నికల్లో నోటాకు ఎక్కువ ఓట్లుపోలైతే ఆ ఎన్నికను రద్దు చేసే అవకాశం లేదు. నోటాకు పోలైన ఓట్లు తీసేసి మిగిలిన ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు.

ఇది శాస్త్రీయంగా లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు వక్త, రచయిత శివ్‌‌‌‌ ఖేరా. నోటాకు అభ్యర్థుల కంటే ఎక్కువ పోలైతే  మళ్లీ ఎలక్షన్స్‌‌‌‌ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్ధులు మళ్లీ అదే నియోజకవర్గంలో అయిదేండ్ల వరకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశించాలన్నారు. ఈ వాదన సహేతుకమేనని అనిపిస్తోంది. 

ఓటరు చేతిలో ఆయుధం నోటా 

నోటాకు ప్రస్తుతం ఎలాంటి విలువ లేదు. ఇటీవల సూరత్‌‌‌‌లో  కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడం, ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో  ఎలాంటి ఎన్నికలు లేకుండానే బీజేపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. అయితే నోటా ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. నోటా కల్పిత అభ్యర్థి అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.

పోటీలో ఒకే అభ్యర్థి ఉన్నప్పటికీ ఎన్నిక నిర్వహిస్తే బాగుండేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఓటర్లకి అభ్యర్థులు నచ్చకపోతే  నోటాకు  ఓటేసేవారని అభిప్రాయాలున్నాయి. మంచి అభ్యర్థులను నిలబెట్టేలా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావడమే నోటా ఉద్దేశ్యం. ఒక నియోజకవర్గంలో దాదాపు అందరు అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నా, వారు మంచివారు, సమర్థులు కాకున్నా ఓటర్లు నోటాకు ఓటు వేసే అవకాశాలు ఉంటాయి. అప్పడు ఓటరు చేతిలో శక్తిమంతమైన ఆయుధంగా నోటా మారుతుంది.

నోటాను అభ్యర్థిగా పరిగణించాలి

గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నికలు ఎక్కువయ్యాయి. కొందరు కండ, అర్థబలంతో ప్రత్యర్థులను బెదిరించి పోటీ లేకుండా గెలుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే నోటాను కల్పిత అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుందన్న వాదన వినిపిస్తోంది.  స్థానిక సంస్థల ఎన్నికల్లో హర్యానా,  మహారాష్ట్ర, ఢిల్లీలో నోటాను కల్పిత అభ్యర్థిగా పరిగణిస్తున్నారు.  మన రాష్ట్రంలో ఈ పద్ధతి అమలు చేయాలని రాష్ట్రఎన్నికల సంఘానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇటీవల విజ్ఞప్తి చేసింది.

రాష్ట్రంలో గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక చోట్ల బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని, దీనివల్ల ప్రజలు ఓటు హక్కు కోల్పోయారన్నారు ఫోరం అధ్యక్షుడు పద్మనాభరెడ్డి. అందుకే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను కల్పిత అభ్యర్థిగా గుర్తించాలని కోరారు.  పీపుల్స్‌‌‌‌ యూనియన్‌‌‌‌ ఫర్‌‌‌‌ సివిల్‌‌‌‌ లిబర్టీస్‌‌‌‌ (PUCL) వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈవీఎంలలో నోటా (Non Of The Above) ఆప్షన్‌‌‌‌ కల్పించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చకపోతే..

ఈ ‘నోటా’ ను నొక్కే సదుపాయం ఉంది. అయితే, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే చట్టపరంగా ఎలాంటి పరిణామాలు ఉండవు.   చాలా మంది అవినీతిపరులు, కేసులు ఎదుర్కొంటున్న వారు రాజకీయాల్లోకి వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో నోటాకు ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. ఆ నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్‌‌‌‌ నిర్వహించాలి.

అలాగే ఓటర్లు తిరస్కరించిన అభ్యర్థులు మళ్లీ 5 ఏళ్లు ఆ నియోజకవర్గంలో జరిగే అన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధనలు మారిస్తే ప్రజాస్వామ్యం బలపడ్తుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు  నచ్చక కూడా చాలామంది ఓటేయడం లేదన్న వాదన వినిపిస్తోంది. నోటాకు ప్రాధాన్యం కల్పిస్తే ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది.

- కూర సంతోష్,
సీనియర్ జర్నలిస్ట్