దేశం ఎదుర్కొంటున్న నీటి ఎద్దడికి పరిష్కార మార్గం..కాకతీయ చెరువుల నిర్మాణ శైలి

తీవ్ర నీటి కరువుకు ప్రధాన కారణమేమిటి? ప్రస్తుతం ఉన్న చెరువులు దురాక్రమణకు గురికావడం, తిరిగి కొత్త చెరువుల నిర్మాణం లేకపోవడం, సరైన జల నిర్వహణా పద్ధతులు పాటించక పోవడం ఈ దుస్థితికి ప్రధాన కారణాలుగా భావించొచ్చు. ఈ నేపథ్యంలో కాకతీయ రాజులు అవలంబించిన నీటి యాజమాన్య పద్ధతులు, వర్షపు నీటిని ఒడిసిపట్టుకొనడం, పెద్ద పెద్ద చెరువులు నిర్మించడం, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం చేపట్టడంతో తెలంగాణతోపాటు ఆంధ్ర తదితర ప్రాంతాల్లో కాకతీయులు గత

800 సంవత్సరాల క్రితం నిర్మించిన చెరువులన్నీ  ఇప్పటికీ నీటితో కళకళ లాడడంతో  పాటు వరుసగా మూడేండ్ల పాటు కరువు ఎదురైనా స్థానిక సాగు, తాగు నీటిని అందించే ప్రధాన వనరులుగా ఉన్నాయి. టెంపుల్, ట్యాంక్, టౌన్ విధానంలో భాగంగా కాకతీయులు ఎక్కడైతే గుడిని నిర్మించారో అక్కడ ప్రస్తుతం డ్యాంగా  పిలుచుకునే స్థాయిలో పెద్ద పెద్ద చెరువులను నిర్మించారు. 

రామప్ప చెరువు

పాలంపేట గ్రామంలో 1213లో కాకతీయ సేనాని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఈ చెరువు పక్కనే ఉన్న రామప్ప దేవాలయంతో పాటే ఈ చెరువును నిర్మించారు. ఈ చెరువు ద్వారా ప్రస్తుతం 9 వేల ఎకరాలకు పైగానే సాగునీరు అందుతుంది. 2 .913 టీఎంసీ నీటి సామర్థ్యం ఉంది. తెలంగాణలో తరచుగా ఏర్పడే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే కాకతీయులు ఎంతో దూరదృష్టితో ఈ అద్భుతమైన చెరువు నిర్మాణం చేశారు.  వరుసగా మూడేండ్లపాటు కరువు వచ్చినా పంటపొలాలకు నీరందించే విధంగా నిర్మించిన ఈ రామప్ప చెరువును అధ్యయనం చేసేందుకు ఇప్పటికీ దేశ, విదేశాల నుంచి ఎంతోమంది పరిశోధకులు, ఇంజినీర్లు, విద్యార్థులు నిరంతరం సందర్శిస్తూ ఉంటున్నారు. 

పాకాల

పాకాల చెరువు  కాకతీయుల రాజైన గణపతి దేవుడి సామంతులైన మాల్యాలు ఈ చెరువును 1213లో నిర్మించారు. కాకతీయులు నిర్మించిన చెరువులన్నిటిలో పాకాల చెరువు అత్యంత పెద్దది. కృష్ణా నదికి ఉపనది అయిన మున్నేరు వాగుపై దీనిని నిర్మించారు. 268. 80 కిలోమీటర్ల మేర పరీవాహక ప్రాంతం ఈ చెరువుకు ఉన్నది. 20 .9 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ చెరువు వ్యాపించి ఉంది. 95.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి పరిమాణ సామర్థ్యం ఉన్న ఈ చెరువుకు ఉన్న ఐదు కాలువల ద్వారా 4658 హెక్టార్ల భూమి సాగుకు, 22,410 ఎకరాలకు 12 గ్రామాల్లో  నీరందుతోంది. 

లక్నవరం

కాకతీయులు నిర్మించిన మరో అద్భుతమైన చెరువు లక్నవరం. మొత్తం 69.23 కిలోమీటర్ల వ్యాసంలో వ్యాపించిన ఈ చెరువు సహజ  సిద్ధంగా ఉన్న అనేక గుట్టల నడుమ నిర్మించారు. 264 .96 చదరపు కిలోమీటర్ల మేర పరీవాహక ప్రాంతం ఉన్న ఈ చెరువుకు కేవలం 609.9 మీటర్ల వ్యాసంలో మాత్రమే చెరువు కట్ట ఉండడం విశేషం. ఈ చెరువు పూర్తి  

నీటి సామర్థ్యం  2.135 టీఎంసీలు.  ప్రస్తుతం ఈ చెరువు ద్వారా పన్నెండు వేల ఎకరాలకు పైగా సాగు నీరందుతోంది. ప్రకృతి రమణీయతకు పేరుగాంచిన ఈ లక్నవరం చెరువు పెద్ద ఎత్తున దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. మత్తడి పడే దృశ్యాన్ని స్వయంగా చూస్తే గానీ ఆ అనుభూతిని వర్ణించలేము. 

కాకతీయులు పాటించిన చెరువుల నిర్మాణంలో శాస్త్రీయత 

కాకతీయులు నిర్మించిన చెరువుల నిర్మాణాల్లో అద్భుతమైన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, ఎంతటి భారీ వరద చెరువుల్లోకి వచ్చినా ఆ వరద ఉధృతి చెరువు కట్టలపై లేకుండా మళ్లించడం, భౌగోళికంగా  సహజసిద్ధంగా ఉన్న గుట్టలను ఎంచుకొని వాటి నడుమ అతి తక్కువ పొడవులో ఆనకట్టలు నిర్మించి పెద్ద చెరువులను నిర్మించడం, ఇప్పటికీ ఏ ఒక్క చెరువుకూడా స్వల్పంగా కూడా దెబ్బతినక పోవడం ఇప్పటి ఇంజినీరింగ్ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

తూముల నిర్మాణాలకు పాలక రాళ్లు పేర్చి, వాటి మధ్య సేసం, బెల్లం మొదలగు పదార్థాల ద్వారా రాతికి రాతికి మధ్య సందులను పూడ్చి నీరు ఏమాత్రం వృథా కాకుండా అరికట్టారు. ఇప్పటి మాదిరిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో దాదాపు 50 , 60 అడుగుల ఎత్తు చెరువు కట్టలను రాతిరోలర్లు, ఏనుగులు, గుర్రాలు, దున్నపోతులతో తొక్కించి పటిష్టపర్చారు. ఇక, కాకతీయుల నీటి నిర్వహణ విధానంపై ఇప్పటికీ ఎంతో మంది పాశ్చాత్య శాస్త్ర వేత్తలు కూడా అధ్యయనం చేస్తూనే ఉన్నారు.

దాదాపు ఏడెనిమిది వందల సంవత్సరాల క్రితం కాకతీయులు నిర్మించిన చెరువులు ఏమాత్రం చెక్కుచెదరక ఇప్పటికీ వేలాది ఎకరాలకు సాగునీరందిస్తున్నాయి. కాకతీయుల సాంకేతిక నిపుణత, నాణ్యత, అభివృద్ధి, అంకిత భావం, ప్రజాక్షేమం.. వీటన్నింటినీ  నేటి ఇంజినీర్లు ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చేసినప్పుడే మనం కాకతీయుల నిజమైన వారసులమవుతాం.

ఘనపురం, బయ్యారం చెరువులు

ప్రస్తుతం జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో ఉన్న ఘనపురం చెరువు 100 .36 చదరపు కిలోమీటర్ల  క్యాచ్మెంట్  ఏరియా కలిగి అధికారిక  లెక్కల ప్రకారం 4 వేల ఎకరాలకు సాగు నీరందిస్తోంది. ప్రస్తుతం ఈ చెరువు ద్వారా ఏడు వేల ఎకరాలకు సాగునీరందుతోంది. మొత్తం 41 .84 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ ఉన్న ఈ ఘనపుర్ చెరువుకు మత్తడి (అలుగు పారే విధానం )

ఇతర చెరువులకు భిన్నంగా చెరువుకట్ట మధ్యలో ఉంటుంది చెరువు నిండి అలుగు పారితే మధ్యలో ఉండే కట్ట మత్తడి ద్వారా నీరు కిందకు దూకే దృశ్యం అంత్యంత మనోహరంగా ఉంటుంది. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని సోదరి మైలాంబ తన తల్లి  బయ్యాలదేవి (బయ్యమాంబ) పేరుమీదుగా బయ్యారం పెద్ద చెరువును 12వ శతాబ్దంలో నిర్మించారు. 

- కన్నెకంటి వెంకటరమణ,  జాయింట్ డైరెక్టర్, సమాచార, పౌర సంబంధాల శాఖ