గత నెలలో కేంద్ర కేబినెట్ 'ఒక దేశం - ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికలు)పై మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించింది. ఇటీవల ప్రధాని మోదీ సైతం పదే పదే జమిలి ఎన్నికల గురించి ప్రస్తావిస్తున్నారు. చూస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ వడివడిగా జమిలి ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నట్లు కనపడుతున్నది. ఈ ప్రతిపాదనను ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. భారతదేశం భిన్న సంస్కృతులు, భాషలు, జాతుల సమాహారం. భిన్నత్వంలో ఏకత్వంతో ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన ఈ దేశం పరిఢవిల్లుతోంది.అద్భుతమైన ముత్యాలహారానికి దారం ఎలా ఆయువుపట్టో దేశానికి సమాఖ్య విధానం అంతే. ముందుచూపుతోనే మన రాజ్యాంగ నిర్మాతలు సమాఖ్య స్ఫూర్తికి భంగం కలగకుండా రాజ్యాంగాన్ని రచించారు.అయితే, బీజేపీ మాత్రం ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే భాష, ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటూ భిన్నత్వాన్ని చెదరగొట్టి, బహుళత్వానికి విఘాతం కలిగిస్తోంది.2016లో ఒకే దేశం, ఒకే పన్ను ఒకే విధానమని చెప్పి జీఎస్టీ రూపంలో ఎలా నిధులు వసూలు చేస్తున్నారో గమనించాలి.
పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్టీని వర్తింపచేయకుండా కేంద్ర, రాష్ట్ర సుంకాలు పన్నుల రూపంలో ఎలా ప్రజలపైన భారం మోపుతున్నారో గమనించాలి. కాగా, ప్రతిపక్షపాలిత రాష్ట్రాలకు జీఎస్టీ నిధుల విడుదలకు మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ ఇరకాటంలో పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైనది. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై విధివిధానాలు రూపొందించడానికి సర్మారియా కమిషన్ నియమించబడి కేంద్ర పరిధిలో, రాష్ట్రాల పరిధిలో విధులు, హక్కులు విభజింపబడినవి. కానీ, ఆ సిఫారసులను నేటి పాలకులు అమలు చేయడం లేదు.
జమిలి ఎన్నికలు సాధ్యమా?
ఒకే దేశం ఒకే ఎన్నికలు (జమిలి ఎన్నికలు)కు రామ్ నాథ్ కోవింద్ కమిటీ వేశారు. అంటే, కసరత్తు ప్రారంభమైంది. 1952లో సాధారణ ఎన్నికలు జరిగాయి. 1967 వరకు లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు జరిగాయి. 1970లో లోక్‌సభ రద్దు అయ్యింది. చాలా రాష్ట్రాల ప్రభుత్వాలను భర్తరఫ్ చేయడం జరిగింది. సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడంతో జమిలి ఎన్నికలు గతంలోనే గతి తప్పాయి.
జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాలి. ఆర్టికల్ 356, 324, 172(1) ఆర్టికల్ 83(2), 88 సవరణలు చేయాలి. ఆర్టికల్ 172(1)క్రమం అసెంబ్లీ కాలవ్యవధి ఐదు సంవత్సరాలు, ఆర్టికల్ 324 ప్రకారం పార్లమెంట్, శాసనసభ ఎన్నికలు కేంద్ర ఎన్నికల పర్యవేక్షణలో జరుగుతాయి. సమయానుసారం నిబంధనలకు లోబడి ఎన్నికలు జరుగుతాయి.
ఒకేసారి జరగాలంటే తగు కారణాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 83(2) లోక్‌సభ ఎన్నికలు ఐదు సంవత్సరాలకు ఒకసారి తగు కారణాలు లేకుండా రద్దుకు వీలులేదు. రాష్ట్రాలలో స్థానిక అంశాలు పక్కకు పోతాయి. ఏ కారణం చేతనైన గడువు కంటే ముందే రద్దు అయితే అప్పుడు పరిస్థితి ఎమిటి? ఒకే దేశం- ఒకే ఎన్నిక అనేది సమాఖ్య నిర్మాణాన్ని బలహీనపర్చడమే. సంకీర్ణ ప్రభుత్వాలు ఏకారణం చేతనైనాపడిపోతే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. అటువంటి సమయంలో ఏమి చేయాలనే విషయంపై చర్చ జరగాలి.
జమిలి ఎన్నికలు సువిశాలమైన దేశంలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎలా జరుగుతాయి. అన్ని రాజకీయ పార్టీల అంగీకారం విధిగా తీసుకోవాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మేలు జరుగుతున్నా ఇతర ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలకు గొడ్డలిపెట్టు లాంటిది.
బీజేపీ ద్వంద్వ నీతి
మొదట్లో సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభతోపాటు దాదాపు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. రానురాను స్థానిక పరిస్థితులు, రాజకీయాల కారణంగా, ఆయా రాష్ట్రాల శాసనసభలకు, లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలతో సంబంధం లేకుండా విడివిడిగా జరుగుతున్నాయి.
ప్రస్తుతం లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం) శాసనసభలకు మాత్రమే సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక అంటున్న బీజేపీ తన స్వప్రయోజనాల కోసం మాత్రం ఒకేసారి ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల షెడ్యూళ్లను మాత్రమే తమకు అనుకూలంగా మార్చుకుంటూ పోతుంది.
ఉదాహరణకు ఇటీవల శాసనసభ ఎన్నికలు జరిగిన హర్యానాతోపాటే ఎన్నికలు జరగాల్సిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలను ముందుకు జరిపింది. ఒకేసారి మూడు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే ఒక రాష్ట్రంలోని అంశాల ప్రభావం మరో రాష్ట్రం, ముఖ్యంగా మహారాష్ట్రపై పడుతుందనే ఉద్దేశ్యంతో అలా చేశారు. గత నెలలో హర్యానాతో కాకుండా ఆ ఎన్నికలు పూర్తయ్యాక, నవంబర్‌లో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి.
ఎన్నికల షెడ్యూలు ఖరారు చేసేది ఎన్నికల కమిషన్ అయినప్పటికీ, ఇలాంటి మార్పుల వెనుక అధికార బీజేపీ ఉందనేది జగమెరిగిన సత్యం. గతంలో కూడా కొన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూళ్లను ఇతర రాష్ట్రాల ఎన్నికలతో కాకుండా మార్చారు. ఇది ద్వంద్వ నీతి కాదా?
జమిలి ఒక ఎత్తుగడ
అడుగులన్నీ జమిలి ఎన్నికల వైపు పడుతున్నట్లు స్పష్టమవుతోంది. అందులో భాగంగానే జనాభా లెక్కల సేకరణ, అది పూర్తవగానే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన , ఆ వెంటనే మహిళా రిజర్వేషన్ అమలు, తరువాత జమిలి ఎన్నికలు నిర్వహించాలని అధికార బీజేపీ భావిస్తున్నట్టుంది. ఇదంతా రెండు, మూడేండ్లు పట్టొచ్చు. తాము బలంగా లేని రాష్ట్రాలలో చొరబడేందుకు జమిలి ఎన్నికలు ఒక ఎత్తుగడ.
దక్షిణాదిలో కర్నాటక మినహా ఎక్కడా బీజేపీకి అధికారం దక్కలేదు. అలాగే పలుచోట్ల ప్రాంతీయ పార్టీల హవా ఉంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బొటాబొటి సీట్లతో, ఇతర మిత్రపక్షాల సహాయంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వానికి ప్రభుత్వ వ్యతిరేక పవనాలు సుస్పష్టంగా కనపడుతున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు జమిలి ఎన్నికలు అనే గిమ్మిక్కు చేస్తున్నారు. దాని ద్వారా ప్రజల దృష్టి మళ్లించి దేశం కోసమనే నినాదంతో జాతీయవాదం పేరుతో మరోసారి ఎన్నికల్లో గెలవచ్చనే ఆలోచన వారికున్నట్లు అవగతమవుతోంది.
జమిలితో నియంతృత్వ, ఏకపక్ష పాలనకు నాంది పలుకాలనుకుంటోంది. దీన్ని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య, ప్రగతిశీల, ప్రజాతంత్ర శక్తులు ఒక వేదిక మీద రావాలి. ప్రస్తుతమున్న రాజ్యాంగ పరిధిలోనే ఎన్నికలు స్వేచ్చగా ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా జరిగేవిధంగా చర్యలు చేపట్టడానికి ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలి.
- చాడ వెంకటరెడ్డి,సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు-