తపస్సు అంటే ఏమిటి.. ఇది చేస్తే ఫలితం ఎలా ఉంటుంది? 


తపస్సు... ఈ పదాన్ని పెద్దలు  ఆధ్యాత్మిక కథలు చెప్పేటప్పడు చాలా సార్లు చెపుతారు.  ఇక రుషులు... మహర్షులు ఏదైనా సాధించాలంటే తపస్సు చేసేవారని పురాణాలు గ్రంథాలు చెబుతున్నాయి.  అందుకే  ఏ పని చేసినా ఒక తపస్సులాగా చేయాలి. దానికోసం ప్రతిక్షణం తపించినప్పుడే విజయం  వరిస్తుంది.  అసలు తపస్సు అంటే ఏంటి? తపస్సు ఇచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . . 

ఏదైనా ఒక కార్యాన్ని సాధించడానికి అమితమైన ఆసక్తిని చూపించడమే తపన. కార్యసాధన కోసం అనుక్షణం తపించడం లేదా ఆరాటపడటమే తపస్సు. మరి ఆరాటపడినంత మాత్రాన అనుకున్నది అవుతుందా? నిజంగా ఆరాటపడితే ఫలితం కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మన సంకల్పానికి ఉన్నంత శక్తి ఈ సృష్టిలో దేనికీ లేదు. మనసులో గట్టిగా అనుకుని ప్రయత్నం మొదలుపెడితే చాలు... అది ఎంత పెద్ద లక్ష్యమైనా సాధిస్తారు. 

ఆయుధాన్ని వాడకుండా, మూలకు పడేస్తే అది తుప్పుపట్టి, పనికి రాకుండా పోతుంది. ఎప్పటికప్పుడు వాడుతుంటే పదునుదేలి పనితనాన్ని చూపిస్తుంది. ఇదే మనకూ వర్తిస్తుంది. మరి మనసు చంచలమైంది కదా? అది కుదురుగా ఉండకుండా ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తుంది కదా? అంటే నిజమే... కానీ, ఆలోచించటం వేరు... ఆరాటపడటం వేరు. ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తే.. అది ఆరాటపడుతున్నట్టు కాదు... చంచలమైన మనసుని నియంత్రించి, దానికి ఒక కరెక్ట్ గోల్ సెట్ చేసి.. మనసును అటువైపు మళ్లించడాన్నే ఆరాటం అంటారు.

ఫలితం ఎలా ఉంటుంది? 

తపస్సు ఫలితం ఎలా ఉంటుంది? అంటే అది సాధకుడి కోరికని బట్టి ఉంటుంది. తపస్సు చేసి పొందిన వరాన్ని భస్మాసురుడిలా చెడుకు ఉపయోగించి రాక్షసుడిగా మిగలొచ్చు. మంచికి ఉపయోగించి దేవుళ్లుగా మారొచ్చు. మీ ఆరాటం మంచిదైతే... మంచి ఫలితం. చెడు అయితే చెడు ఫలితం ఉంటుంది. కాబట్టి, సాధకుడు మంచిని ఆశించి తపస్సు చేస్తే మహాత్ముడిగా మిగిలిపోతాడు. అదే నిజమైన తపస్సు.

ఆధారం ఉందా?

 ఆధారం లేకుండా ఏ విషయాన్ని మన రుషులు చెప్పలేదు. దీనికి ప్రకృతి పరమైన ఆధారం కూడా ఉంది. అందమైన సీతాకోక చిలుకని చూడగానే అందరికీ ముట్టుకోవాలనిపిస్తుంది. కానీ, అది అంత అందంగా మారడానికి ముందు తపస్సు చేస్తుంది. తోటలోకి గొంగళి పురుగు వస్తే.. దాని వెంట్రుకల్ని, వికృత రూపాన్ని చూసి ఇబ్బంది పడతారు. అప్పుడు అది రాళ్లు రప్పల్లో.. ముళ్ల కంపల్లో ఉండి ఆకులు తింటూ కాలం గడుపుతుంది. అలా కొంతకాలం తర్వాత దానికి జీవితంపై విరక్తి పుడుతుంది. ఆహార, విహారాలు ఆపేసి.. ఎవరికీ కనిపించని ప్రదేశానికి వెళుతుంది. చుట్టూ ఓ గూడు కట్టుకుని కొంతకాలానికి అది సీతాకోకలా మారి బయటకు వస్తుంది. తర్వాత ఆకులూ, అలములు తినదు. పూవుల్లో మకరందాన్నే తాగుతుంది. అప్పుడు ఛీ కొట్టిన వాళ్లే దాని అందాన్ని కీర్తిస్తారు. అదీ తపస్సు ఇచ్చే ప్రతిఫలం.. సో ఏ పని మొదలు పెట్టినా.. దాని ప్రతిఫలం పొందేవరకు తపస్సులాగా ఆ పనిని సాధించేదిశగా అడుగులు వేయండి. .  .