Good Health : షుగర్ జబ్బంటే ఏందీ.. పెద్దోళ్ల జబ్బు అని ఎందుకు అంటారు..!

తింటే బలమొస్తది. ఆ బలంతో కాసేపు పనిచేయొచ్చు. పని చేస్తున్నమంటే తిన్నదంతా అరిగిపోతది. ఆ తర్వాత మళ్లీ ఆకలైతది. మళ్లీ తింటే మళ్లీ పనిచేయొచ్చు. తినకుంటే పని చేయలేం. ఇట్లుంటే ఆరోగ్యంగా ఉన్నట్లు. ఇగ కొంతమంది ఉంటరు. తిన్నా నీరసంగానే ఉంటరు. తినకుండా అసలే ఉండలేరు. తినడం ఆలస్యమైతే కళ్లు తిరిగి పడిపోతరు. ఇట్లెందుకయితదంటే? మనం ఏదైనా తిన్న తర్వాత అది కడుపులో జీర్ణమైతది. జీర్ణ వ్యవస్థ తిన్న ఆహారాన్ని గ్లూకోజ్ గా మార్చి రక్తంలోకి పంపిస్తది.కణాలకు గ్లూకోజ్ అందిన తర్వాత, ఇన్సులిన్ దానిని శక్తిగా మారుస్తది. ఏ పనిచేయాలన్నా ఆ పనికి తగినంత శక్తి ఇట్లనే అందుతది. 

షుగరు జబ్బంటే ఏంది?

పని చేయనప్పుడు కూడా శరీరానికి శక్తి కావాలి. ఎందుకంటే శరీరంలోని అన్ని అవయవాల్లో పాత కణాలు పోతూ, కొత్త కణాలు తయారవుతుంటాయి. కొత్తవి తయారు కావడానికి, కణాల్లో జీవ క్రియలు నిరంతరం జరగడానికి కొంత శక్తి కావాలి. ఆ శక్తి అన్ని అవయవాలకూ అందుతున్నంత సేపూ మనం హుషారుగ ఉంటం. జోరుగ పనిచేస్తం.ఈ జీవక్రియ (మెటబాలిజం)లో ఏదైనా తేడా కొట్టిందో.. కణాల్లో శక్తి పుట్టదు. కండరాల్లో సత్తువ ఉండదు. అప్పుడు నీరసమొస్తది. ఎంత తిన్నా ఆ నీరసం పోదు. రక్తంలో గ్లూకోజ్ ఉంటది. కానీ, అది శక్తిగా మారక నీరసంగా ఉంటరు. కాళ్లూ చేతులు వణుకుతయి. ఆలస్యమైతే కళ్లు తిరిగి పడిపోతరు. దీనినే షుగరు (డయాబెటిస్) జబ్బంటరు. ఈ ఇబ్బంది ఎక్కువ రోజులు ఉందంటే చాలా ఇబ్బందులొస్తయ్.

చక్కెరొచ్చి ఎందుకు పడిపోతం?

కణాలకు కావాల్సినంత ఇన్సులిన్ అందకపోతే చేసే పనికి కావాల్సినంత ఎనర్జీ అందదు. కడుపునిండా తిన్నా, రక్తంలో ఎంత గ్లూకోజ్ ఉన్నా అది శక్తిగా మారి ఉపయోగపడదు. కాబట్టి నీరసం వస్తది. ఇట్లెందుకు అయితదంటే? కొంత మందిలో ఇన్సులిన్ తయారు కాదు. అది పుట్టుకతోనే వస్తది. ఇంకొంత మందిలో వ్యాధి నిరోధక వ్యవస్థ అదుపుతప్పి ఇన్సులిన్ తయారు చేసే క్లోమ గ్రంథిలోని కణాలపై దాడి చేస్తది. అప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతది. ఇగ ఒబెసిటీ ఉన్నవాళ్లలో ఇన్సులిన్ ఉంటది. కానీ అది కణాల్లో గ్లూకోజ్​ ను  ఎనర్జీగా మార్చలేదు. ఇన్సులిన్ లోపం వల్ల రక్తంలో షుగర్ (గ్లూకోజ్) లెవల్ ఎక్కువైతది. ఈ స్థితినే డయాబెటిస్ అంటరు. ఇన్సులిన్ తక్కువ తయారయ్యేవాళ్లకు ఇన్సులిన్ ఇచ్చినన్ని రోజులు మంచిగనే ఉంటరు. ఒబెసిటీ ఉన్నవాళ్లు మందులు తీసుకుంటూ, వ్యాయామం చేస్తే బాగయితరు.

పెద్దోళ్ల జబ్బు

ముప్పై ఏళ్ల కింద షుగరు జబ్బు డబ్బున్నోళ్లకే ఎక్కువగా వచ్చేటిది. అందుకే దీనిని పెద్దోళ్ల జబ్బని జనం అనేటోళ్లు. డాక్టర్లు కూడా అదే మాటంటరు. కానీ, పేదోళ్లకు రాదని కాదు. డయాబెటిస్తో బాధపడేవాళ్లలో టైప్-2 డయాబెటిస్ బాధపడేవాళ్లే ఎక్కువ. ఆరోగ్యంగా ఉండేవాళ్లకు కొంత వయసొచ్చిన తర్వాత ఇది వస్తుంది. అందుకే డాక్టర్లు ఈ కారణంగా కూడా 'పెద్దోళ్ల జబ్బు' అని పిలుస్తరు. ఇన్సులిన్ లోపానికి రెండు రకాల కారణాలున్నయి. టైప్-2 డయాబెటిస్ అనేది లైఫ్ స్టైల్ కారణంగా వస్తుంది. తినే తిండి, చేసే పనుల్లో వచ్చిన మార్పుల వల్లే ఈ సమస్య వస్తున్నదట. బరువు ఎక్కువగా ఉండటం (ఊబకాయం), ఆహార సంబంధమైన లోపాలు, అసహజమైన లైఫ్ స్టైల్ కు ముఖ్యమైన కారణాలు. మరి షుగర్​ వ్యాధి రాకుండా జాగ్రత్త పడతాం.  హెల్త్​ లో ఏ మాత్రం తేడా వచ్చినా డాక్టర్​ వద్దకు వెళ్లి చెకప్​ చేయించుకొని సలహాలు.. సూచనలు తప్పక పాటించాలి. 

–వెలుగు, లైఫ్​–