Good News : ఏ ప్లాస్టిక్ వస్తువు అయినా.. ఒక్క రోజులోనే కరిగిపోతుంది.. ప్లాస్టిక్ లేని దీవి ఇదే..!

ప్లాస్టిక్ చేసే హాని అంతా ఇంతా కాదని అందరికీ తెలుసు. 'ఈ ప్లాస్టిక్‌ను ఎలా అంతం చేయాలా' అని ప్రపంచం మొత్తం ఆలోచిస్తుంటే... సింగపూర్ మాత్రం ఒకే ఒక్క రోజులో ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. ఆ దేశంలో ఎక్కడ చూసినా కేవలం ఒక్కటంటే ఒక్కరోజుకి మించి ప్లాస్టిక్ వస్తువులు నిలవవు. ఈ రోజు పారేసిన ప్లాస్టిక్ వస్తువు రేపటి లోపు డీకంపోజ్ అవుతోంది. అది కూడా పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా.. అదెలా సాధ్యంఅనుకుంటున్నారా?

మనం వాడి పారేసే క్యారీ బ్యాగులు, వాటర్ బాటిళ్లు భూమిలో కరిగిపోవడానికి దాదాపు 500సంవత్సరాలు పడుతుంది. ఏ ప్లాస్టిక్ వస్తువైనా అంతే... శాశ్వతంగా నిర్వీర్యం అవ్వాలంటే వందల ఏళ్ల సమయం పడుతుంది. ఇప్పుడు చాలా దేశాలను పీడిస్తున్న సమస్య ఇదే. అందుకే ప్లాస్టిక్, ప్రత్యామ్నాయంగా.. ప్లాస్టిక్ వ్యర్థాలతో ఉపయోగపడే వస్తువులు చేయడం, ప్లాస్టిక్ కి బదులు నేచురల్ ప్రొడక్ట్స్ వాడడం లాంటివి చేస్తుంటారు. కానీ ఎంత ప్రయత్నించినా ప్లాస్టిక్ వాడకం మాత్రం అనుకున్న స్థాయిలో తగ్గట్లేదు..

గట్టిగా అనుకుంది

అయితే సింగపూర్ మాత్రం ఈ విషయాన్ని కాస్త గట్టిగా పట్టించుకుంది. ఇక్కడ నివసించడానికే సరిపడా ప్లేస్ లేదు. ఇంకా చెత్తకు ప్లేస్ ఇవ్వడం ఎందుకు
అనుకున్నారేమో! ఎంత ప్లాస్టిక్ వాడితే అంత ప్లాస్టిక్ని కేవలం ఒకే ఒక్కరోజులో పూర్తిగా డీకంపోజ్ చేయడం మొదలు పెట్టారు. పైగా దానితో విద్యుత్తు కూడా ఉత్పత్తి చేస్తున్నారక్కడ.

శాస్త్రీయంగా తగలబెట్టి...

ప్లాస్టిక్ని ఒక్కరోజులో నిర్వీర్యం చేయడం ఎలా సాధ్యం అని చాలామందికి ఆశ్చర్యం కలగొచ్చు. అయితే దానికోసం సింగపూర్ ప్రభుత్వంచాలానే కష్టపడుతోంది. దేశంలో ప్రతి మూల నుంచి పెద్ద మొత్తంలో చెత్తను సేకరిస్తారు. చెత్తని సేకరించే ఈ పని చాలా పద్ధతిగా జరుగుతుంది.ఎక్కడికక్కడే తడిపొడి చెత్తనీ, ప్లాస్టిక్ వ్యర్థాల్నీ, రీసైకిల్ చేయడానికి అవకాశమున్న వాటినీ వేరుగా సేకరిస్తారు. 

పునర్వినియోగానికి పనికిరాని చెత్తనంతా విడిగా తీసుకెళ్లి ఒక చోట తగలబెడతారు.తగలబెట్టడమంటే మనలాగా అగ్గిపుల్ల గీసి మంటపెట్టడం కాదు, శాస్త్రీయంగా ఇన్సినరేషన్ ప్లాంట్లలో సుమారు వెయ్యి డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో తగలబెట్టడం అన్నమాట. అంత ఉష్ణోగ్రతతో మండిస్తే కానీ ప్లాస్టిక్ కరగదు. ఈ ప్లాంట్ రోజుకు ఇరవై నాలుగు గంటల చొప్పున సంవత్సరం పొడవునా పని చేస్తూనే ఉంటుంది.

ఎలాంటి హాని లేకుండా..

ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే... కేవలం ప్లాస్టికిని మండించడమే కాదు. అప్పుడు ఉత్పత్తి అయ్యే హీట్ ఎనర్జీతో ఎలక్ట్రిసిటీని కూడా ఉత్పత్తి చేస్తున్నారు. అంటే చెత్తనుంచి విద్యుత్తు తీయడం అన్న మాట. సింగపూర్ లోని వేల ఇళ్లకు ఈ ప్లాంట్ నుంచే విద్యుత్ వెళ్తుంది. ఈ ఇన్సినరేషన్ ప్లాంట్ల వల్ల రెండు లాభాలున్నాయి. ఒక పక్క విద్యుత్తు తయారవుతుంది, మరో పక్క కాలుష్యం వెలువడకుండా ఉంటుంది. ప్లాస్టిక్ను తగలబెడితే దాన్నుంచి విషపూరితమైన వాయువులు వెలువడుతాయి. అవి పర్యావరణానికి చాలా హానికరం. అందుకే ఈ ప్లాంట్ లో అత్యున్నత టెక్నాలజీతో తయారు చేయబడిన ఫిల్టర్లు వాడి విషవాయువులు విడుదల కాకుండా జాగ్రత్త పడుతున్నారు.

కృత్రిమ దీవి

  • ఇలా చెత్తంతా తగలబడిపోయాక దాన్నుంచి తయారయ్యే బూడిదను ట్రక్కుల్లో తీసుకెళ్లి టగ్ బోట్లలో నింపుతారు. 
  • అబోట్లు బూడిదను ఒక దీవిలో వదిలేస్తాయి. అలా రోజుకు కొన్ని వందల టన్నుల చెత్త ఆ దీవికి చేరుతోంది. చెత్తే కదా అని తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్లు పడేయరు. చెత్తని ఒక పద్ధతి ప్రకారం ఆ దీవుల తీరంలో సముద్రపు ఒడ్డున పరుస్తారు. దానిమీద మళ్లీ మంచి మట్టి పరుస్తారు. 
  • ఇలా రెండు దశాబ్దాలుగా చేస్తున్నందు వల్ల అక్కడ కొత్తగా ఓ దీవి ఏర్పడింది. దానిపై మొక్కలు పెంచి చక్కని పార్కులు అభివృద్ధి చేశారు. నీటిమట్టానికి తగినట్లుగా ఇంటర్టైడల్ ప్రాంతాన్ని సముద్రపుగడ్డితో నింపారు. 
  • అందులో రకరకాల వన్యప్రాణులూ సహజంగా జీవిస్తున్నాయి. ఇప్పుడు అదంతా మామూలు అడవిలా కన్పిస్తుందే తప్ప బూడిద కుప్పగానో, చెత్తకుప్పగానో కాదు. చెత్తతో తయారైన నేల అని చెప్పినా నమ్మలేం. వాసన కానీ, కాలుష్యం కానీ ఉండదు. సముద్రంలో జీవులకు దీనివల్ల ఎలాంటి హానీ కలగలేదు.

ప్రపంచానికే ఆదర్శం

ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని భూతంలా భయపెడుతున్న ప్లాస్టిక్ సమస్యను సమర్ధంగా ఎదుర్కొంటూ సింగపూర్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. సింగపూర్ లో ఏ ప్లాస్టిక్ వస్తువైనా ఒక్కరోజుకి మించి ఉండదు. చెత్త కుండీలో పడేసిన రెండో రోజుకి అదిగాలిలో కలిసిపోతుంది. దీంతో పార్కుల్లోకానీ బీచుల్లో కానీ ఎక్కడా వ్యర్థాలనేవికన్పించకుండా దేశమంతా క్లీన్ గా ఉంటోంది.