ప్రతి ఒక్కరికీ సెల్ఫ్ అవేర్నెస్ (స్వీయ అవగాహన) ఎంతైనా అవసరం. అంటే... ఎవరి గురించి వాళ్లకి ఒక అవగాహన అనేది ఉండాలి. అప్పుడే జీవితంలో చాలా విషయాల్లో బెటర్‌గా ఉండగలుగుతారు. చాలాసార్లు ఈ సెల్ఫ్ అవేర్నెస్ వల్లే పాజిటివ్‌గా, కాన్ఫిడెంట్‌గా ముందుకు సాగగలుగుతారు.
సెల్ఫ్ అవేర్నెస్ అనేది లైఫ్‌లో చాలా చోట్ల కీలకమైన క్వాలిటీ. ఆలోచనలు, ఫీలింగ్స్.. అవి ఎదుటివాళ్ల మీద ఎలా ప్రభావం చూపిస్తున్నాయి? వాటికి ఎంత విలువ ఇవ్వొచ్చు? వంటివి చాలా లోతుగా అర్థం చేసుకోగలగాలి. అలా అర్థం చేసుకోవాలంటే.. సెల్ఫ్ అవేర్నెస్ అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఎమోషన్స్, ఆలోచనలు, నమ్మకాలు..జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? అనేది తెలుసుకోవడమే ఇది. ‘‘ఇవన్నీ తెలుసుకుంటే.. బలం, బలహీనతలు తెలుస్తాయి. వాటితోపాటు జీవితంలో ఎదిగేందుకు ఏవి అవసరమో తెలుస్తుంది.
తీసుకునే నిర్ణయాల వెనక కారణాలు. వాటి వల్ల ఎలాంటి మార్పు వచ్చింది? అనే విషయాలపై అవగాహన వస్తుంది’’ అన్నారు రేచల్ గోల్డ్బర్గ్ చెప్పారు. ఈమె మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ థెరపిస్ట్, ‘రేచల్ గోల్డ్బర్గ్ థెరపీ’ ఫౌండర్. సెల్ఫ్ అవేర్నెస్ అనేది అందరికీ ఉండదు. అందుకని ఎవరికి వాళ్లు ఆ అవేర్నెస్ తెచ్చుకోవాలి. అందుకు ఎవరితో వాళ్లు మాట్లాడుకోవాలి. మాట్లాడేక్రమంలో ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. అవేంటంటే..
ఇప్పుడు నేనెలా ఫీల్ అవుతున్నా?
ఈ ప్రశ్న వేసుకోవడం చాలా అవసరం. ఒక నిర్దిష్టమైన సమయంలో ఏం జరుగుతుందో? ఆలోచించడం వల్ల సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది.
నేను ఇలా ఆలోచించడానికి గల కారణమేంటి?
కొంత టైం తీసుకుని ఆలోచించడం వల్ల కారణమేంటో తెలుస్తుంది. దాంతో ఎమోషన్స్, ప్రతిస్పందనలతో మరింత దగ్గరితనం వస్తుంది.
ఇతరులకు నేను ఎందుకు నచ్చుతాను?
ఈ ప్రశ్న వేసుకోవడం వల్ల ఎవరికి వాళ్లకు వాళ్లలోని బలమైన క్వాలిటీస్ ఏంటో తెలుస్తాయి. అలాగే ఇతరుల విషయంలో పాజిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ చూపించాలో తెలుస్తుంది.
బలాలేంటి? బలహీనతలేంటి?
బలాబలాలు, పరిమితులు తెలుసుకున్నప్పుడు వాటినెలా బ్యాలెన్స్ చేయాలో అర్థం అవుతుంది. అప్పుడు ఆ రెండింటినీ గౌరవించడం మొదలవుతుంది. దాంతో వ్యక్తిగత వృద్ధి అనేది రోజులతోపాటు, వయసుతోపాటు డెవలప్మెంట్ అవుతుంటుంది.
నిరుత్సాహపరిచేదేంటి? ఉత్తేజపరిచేదేంటి?
శక్తి స్థాయిల కారణంగా మార్పులు జరిగే పరిస్థితుల గురించి ఆలోచించాలి. ఇది సెల్ఫ్ అవేర్నెస్కి తోడ్పడుతుంది. భవిష్యత్తు ఎలా ఉండాలనేది ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది
నాకు ఇప్పుడు ఏది అవసరం?
ఈ ప్రశ్న పరిస్థితులను బట్టి ఉంటుంది. కోపం, చిరాకు వంటి ఎమోషన్స్‌లో వాటినుంచి బయటపడేందుకు వేసుకునే ప్రశ్న ఇది.
నేనేం చేస్తున్నా? ఎందుకు చేస్తున్నా?
కొన్నిసార్లు అలవాట్లకు మించి కొన్ని పనులు చేస్తుంటారు. కానీ, అవి నిజంగా ఎందుకు చేస్తున్నారనే అంశంపై స్పష్టత ఉండదు.
నన్ను మోటివేట్ చేసే విషయం ఏంటి?
ఈ ప్రశ్న వేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే నిత్యజీవితంలో ఎన్నో సందర్భాలు చూస్తుంటాం. చాలాసార్లు నిరాశ, నిస్పృహలు చుట్టుముడతాయి. కాబట్టి వాటి నుంచి బయటపడాలంటే ఈ ప్రశ్న వేసుకోవాలి.
రిలేషన్ షిప్.. ఒక సముద్రం
రిలేషన్షిప్స్లో జగడాలు తరచూ వస్తుంటాయి. కొన్నిసార్లు భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. క్షమాపణ చెప్పుకోలేకపోవడం, తప్పులు జరగడం, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేకపోవడం వంటివి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకోవడం అవసరం. గతంలో ఎన్నో సాధించి ఉంటారు. ఇంకా ఏదైనా సాధించే సామర్థ్యాలు ఉంటాయి. వాటిని గుర్తు చేసుకోవాలి.
నిరంతర ప్రక్రియ
సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఒక గంటలోనో, రోజులోనే జరిగేది కాదు. నిరంతరం కొనసాగే ప్రక్రియ. అది ఎప్పుడూ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. సవాళ్లు ఎదురైనప్పుడు వాటినుంచి ఎలా మోటివేట్ అయ్యారనేది గుర్తుచేసుకోవాలి. శక్తిసామర్థ్యాలు గుర్తెరగాలి. వ్యక్తిగతంగా పాటించే విలువల్ని లోతుగా అర్థం చేసుకోవాలి. ఎవర్ని వాళ్లు ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి. స్మార్ట్‌గా ఎదగాలంటే ఏం చేయాలి. సహనంగా ఎలా ఉండాలి... అనే విషయాలు తెలుసుకుంటూ జీవితాన్ని లీడ్ చేయాలి.
ఉపయోగం ఉంది కనుకే...
సెల్ఫ్ అవేర్నెస్ వల్ల ఎవరి గురించి వాళ్లకు తెలుస్తుంది. సెల్ఫ్ డిస్కవరీ ద్వారా కలిగిన సెల్ఫ్ అవేర్నెస్ వ్యక్తిగత ఎదుగుదలకి సాయం చేస్తుంది. ఎవర్ని వాళ్లు ఎక్కడ మెరుగుపర్చుకోవాలో తెలుసుకునేందుకు టైం ఇచ్చుకోవాలి. అలాగే స్ట్రెస్ ఎలా మేనేజ్ చేయాలి? యాంగ్జయిటీతో ఎలా డీల్ చేయాలి? అనేది నేర్చుకోవాలి. ‘‘సెల్ఫ్ అవేర్నెస్ లేకపోతే ఎవరి మీద వాళ్లకు శ్రద్ధ తగ్గుతుంది. అదే... సెల్ఫ్ అవేర్నెస్ ఉంటే హెల్త్, ఫిట్నెస్ మెరుగుపడుతుంది’’ అని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
ఒకవేళ సెల్ఫ్ అవేర్నెస్ మరీ ఎక్కువయితే కనుక ఎమోషన్స్, ఫీలింగ్స్‌ని ఇతరులతో పంచుకోవాలి. దానివల్ల రకరకాల పరిస్థితుల్లో కలిగే రియాక్షన్స్ మేనేజ్ చేసే సామర్థ్యం వస్తుంది.