కవర్ స్టోరీ..ట్యాప్.. ట్రాప్..అసలు ఫోన్ ట్యాపింగ్‌‌ అంటే ఏంటి?

ఈ మధ్య ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్‌‌‌‌ మీదే చర్చ నడుస్తోంది. అసలు ఫోన్ ట్యాపింగ్‌‌ అంటే ఏంటి? ఫోన్ ట్యాపింగ్ ఎవరు? ఎందుకు చేస్తారు? ఈ విషయంలో గవర్నమెంట్‌‌ రూల్స్‌‌ ఏం చెప్తున్నాయి? ఇతరుల మాటలను చాటుగా వినే అధికారం ప్రభుత్వ అధికారులకు ఉందా? హ్యాకింగ్, ఫోన్​ ట్యాపింగ్​ల మధ్య ఉన్న తేడా ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ వారం స్టోరీ. 

ఫోన్ ట్యాపింగ్ గురించి సింపుల్‌‌గా చెప్పాలంటే..  వేరే వాళ్లు ఫోన్‌‌లో మాట్లాడే విషయాన్ని చాటుగా వినడమే. దీన్ని వైర్ ట్యాపింగ్, టెలిఫోన్ ఇంటర్‌‌సెప్షన్ అని కూడా పిలుస్తారు. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రత్యేకమైన టెక్నాలజీ, డివైస్‌‌లను వాడాల్సి ఉంటుంది. అధికారికంగా అయితే.. ఒకరకమైన డివైజ్‌‌లు, అనధికారింగా అయితే.. మరో రకం డివైజ్​లు వాడతారు. అలాగని ఫోన్ ట్యాప్ చేయడం అంత ఈజీ కాదు. మన దేశంలో ఫోన్ ట్యాపింగ్‌‌కు సంబంధించి బోలెడన్ని రూల్స్‌‌ ఉన్నాయి. అధికారులకు కూడా ఎవరి ఫోన్లను పడితే వాళ్ల ఫోన్లను ట్యాప్ చేసే హక్కు లేదు. ఎవరి ఫోన్​ అయినా ట్యాపింగ్‌‌ చేయాలంటే ముందుగా అన్ని రకాల అఫీషియల్ పర్మిషన్స్‌‌ తీసుకోవాలి. లేదంటే వ్యక్తి గోప్యత హక్కుని హరించినట్టే.. అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్‌‌ చేశారని రుజువు అయితే ఆ పని చేసిన వాళ్లు జైలుకు వెళ్లక తప్పదు. 

ఎలా చేస్తారు? 

ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. అధికారికంగా చేయాలంటే.. సర్వీస్‌‌ ప్రొవైడర్ల సాయంతో ప్రత్యేకమైన ఎక్విప్‌‌మెంట్‌‌, సర్వర్లు వాడి ట్యాప్‌‌ చేస్తుంటారు. అదే అనధికారికంగా చేయాలంటే ఒకప్పుడు అంత ఈజీ కాదు. టెక్నాలజీని వాడి టెలిఫోన్ లైన్లు లేదా వైర్‌‌లెస్ నెట్‌‌వర్క్‌‌ల ద్వారా ప్రసారం అయ్యే సిగ్నల్స్‌‌ని అడ్డగించాలి. ఆ తర్వాత వాటిని కన్వర్ట్ చేసి వినొచ్చు. రికార్డ్‌‌ కూడా చేసుకోవచ్చు. కాకపోతే.. ఇప్పుడు డెవలప్​ అయిన టెక్నాలజీ వల్ల అది కూడా ఏమంత కష్టం కాదు. గతంలో ల్యాండ్ ఫోన్లను ట్యాప్ చేసేందుకు రకరకాల పద్ధతులు వాడేవాళ్లు. కానీ.. ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్​ ప్రపంచం. ఫోన్స్​ ఎలాగైతే టెక్నాలజీతో పాటు మారుతూ వచ్చాయో అలానే ట్యాపింగ్​ పద్ధతులు కూడా మారిపోయాయి అంటే అతిశయోక్తి కాదు.

మొబైల్‌‌ ఫోన్లలో సెకండ్ జనరేషన్ (2జీ) సిగ్నల్స్‌‌ని ట్యాప్ చేయడం చాలా ఈజీ. ‘స్కానింగ్ ఆల్ బ్యాండ్ రిసీవర్’ అనే డివైజ్ వాడి ట్యాప్ చేయొచ్చు. ఇది మామూలు రేడియో ట్రాన్స్‌‌మీటర్ తరహాలో ‘అనలాగ్ ట్రాన్స్‌‌మిషన్‌‌’ను వాడుకుంటుంది. 3జీ నెట్‌‌వర్క్‌‌ ఫోన్లను మానిటర్ చేయడం కాస్త కష్టం. ఎందుకంటే ఇవి డిజిటల్లీ ఎన్‌‌కోడెడ్, కంప్రెస్డ్ ట్రాన్స్‌‌మిషన్‌‌ ఉపయోగిస్తాయి. ఇక ఇప్పుడు అందరూ వాడుతున్న4జీ, 5జీ స్మార్ట్ ఫోన్లను ట్యాప్ చేయడం మరింత కష్టం. వీటిని ట్యాపింగ్ చేయడానికి ఎక్కువగా ‘ఐఎంఎస్ఐ క్యాచర్’ అనే పద్ధతి వాడతారు. 

అదెలా పనిచేస్తుంది? 

సాధారణంగా ఒక ఫోన్ నుంచి కాల్‌‌ మాట్లాడేటప్పుడు.. మాటలు ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ రూపంలోకి మారతాయి. అవి దగ్గర్లోని టవర్‌‌‌‌కి చేరుతాయి. అక్కడి నుంచి శాటిలైట్‌‌కి వెళ్తాయి. ఈ మధ్యలో సర్వీస్‌‌ ప్రొవైడర్‌‌‌‌ సర్వర్లలోకి కూడా వెళ్తాయి. తర్వాత శాటిలైట్ నుంచి అవతలి వ్యక్తి ఉన్న ప్రదేశంలోని టవర్‌‌‌‌కి చేరి అక్కడి నుంచి ఫోన్‌‌కు వెళ్తాయి. అధికారికంగా ట్యాపింగ్ చేస్తే.. నెట్‌‌వర్క్‌‌ ప్రొవైడర్‌‌‌‌ సర్వర్ల నుంచి కాల్ డాటాను తీసుకుంటారు. అందుకోసం నెట్‌‌వర్క్‌‌ స్టేషన్లు, సర్వర్లు వాడతారు. కానీ.. అనధికారికంగా ఫోన్ ట్యాప్‌‌ చేయాలంటే.. ఎక్కువగా ఇంటర్నేషనల్‌‌ మొబైల్ సబ్‌‌స్క్రయిబర్ ఐడెంటిటీ(ఐఎంఎస్‌‌ఐ) క్యాచర్ వాడతారు. దీన్ని టార్గెట్ మొబైల్ ఫోన్ లొకేషన్‌‌కు దగ్గర్లో పెడతారు. ఇది సర్వీస్ ప్రొవైడర్ ఏర్పాటు చేసిన నిజమైన టవర్‌‌‌‌లాగే పనిచేసే నకిలీ మొబైల్ టవర్ అన్నమాట. సాధారణంగా సెల్‌‌ఫోన్‌‌కు ఎన్ని టవర్ల నుంచి సిగ్నల్స్‌‌ అందుతున్నా.. వాటిలో స్ట్రాంగ్‌‌గా ఉండే సిగ్నల్స్‌‌ని తీసుకుంటుంది. అందుకని సెల్‌‌ఫోన్‌‌కు దగ్గరగా ఉన్న ఐఎంఎస్‌‌ఐ నుంచి ఫోన్ సిగ్నల్స్‌‌ తీసుకుంటుంది. ఇదేమో సెల్‌‌ఫోన్ టవర్‌‌‌‌ నుంచి వస్తున్న సిగ్నల్స్‌‌ తీసుకుని వాటిని ఫోన్‌‌కి అందిస్తుంది. అంటే ఫోన్‌‌ నుంచి వెళ్లే కాల్స్‌‌, మెసేజ్‌‌లు ముందుగా ఈ సిస్టమ్‌‌లోకి వచ్చి ఆ తర్వాత సెల్‌‌ఫోన్ టవర్‌‌‌‌కు చేరుతాయి. ఈ డివైజ్‌‌ సిగ్నల్స్‌‌ని డౌన్‌‌గ్రేడ్‌‌ చేసి ట్యాప్ చేస్తుంది. అయితే ఎండ్ టు ఎండ్ ఎన్‌‌క్రిప్షన్ ఉన్న కాల్స్‌‌ను, సెక్యూర్ టెలిఫోన్స్‌‌ని దీని ద్వారా ట్యాప్ చేయడం సాధ్యం కాదు. 

ట్యాపింగ్– హ్యాకింగ్ తేడా ఏంటి?

ట్యాపింగ్ గురించి అందరికీ పెద్దగా తెలియకపోయినా.. హ్యాకింగ్ అనే మాట రెగ్యులర్‌‌‌‌గా వింటూనే ఉంటారు. ఈ రెండింటీకి చాలా తేడా ఉంది. ఫోన్ ట్యాప్‌‌ చేయాలంటే ఆ ఫోన్ వాడే వ్యక్తి ప్రమేయం అవసరం లేదు. ఆ వ్యక్తి ఉన్న ఏరియాలో ట్యాపింగ్ డివైజ్‌‌లు పెడితే చాలు. దీని ద్వారా కేవలం ఫోన్‌‌కాల్స్ మాత్రమే వినొచ్చు. అదే.. హ్యాకింగ్‌‌కి వస్తే చాలా అడ్వాన్స్‌‌డ్‌‌ టెక్నాలజీ. రిమోట్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ టూల్స్‌‌(రాట్‌‌)తో హ్యాకింగ్‌‌ చేస్తారు. హ్యాకింగ్‌‌ రెండు రకాలుగా ఉంటుంది. ఫోన్‌‌లో మాల్వేర్ యాప్స్ ఇన్‌‌స్టాల్‌‌ చేసి హ్యాక్ చేయొచ్చు. అందుకోసం హ్యాకర్స్ ఫోన్లకు కొన్ని వెబ్‌‌ లింక్స్ పంపుతుంటారు. రెండోది ఫోన్ వాడే వ్యక్తి ప్రమేయం లేకుండానే హ్యాక్ చేయొచ్చు. కానీ.. ఇది అన్ని సందర్భాల్లో సాధ్యపడదు. అప్పటికే ఫోన్‌‌లో ఇన్‌‌స్టాల్‌‌ చేసిన యాప్స్‌‌లో బగ్స్‌‌ గుర్తించి వాటి ద్వారా మాల్వేర్ ఇన్‌‌స్టాల్‌‌ చేసి, హ్యాక్ చేస్తారు. ఒక ఫోన్‌‌ని హ్యాక్‌‌ చేస్తే.. ట్యాపింగ్​తో అవసరం పడదు. ఆ ఫోన్‌‌తో కాల్స్ మాట్లాడినా, ఫొటోలు తీసుకున్నా అన్నీ హ్యాకర్‌‌‌‌కు తెలిసిపోతాయి. అయితే.. హ్యాకర్ ఇన్‌‌స్టాల్‌‌ చేసిన మాల్వేర్‌‌‌‌ రకాన్ని బట్టి అది చేసే పనులు ఉంటాయి. ఫోన్‌‌లో ఉన్న డాటాని కూడా హ్యాకర్ యాక్సెస్‌‌ చేయొచ్చు. హ్యాక్ అయ్యిందంటే.. రిమోట్‌‌ యాక్సెస్‌‌ హ్యాకర్ చేతిలో ఉన్నట్టే. 

తెలుసుకోవడం కష్టమే

ఐ.ఎం.ఎస్‌‌.ఐ. క్యాచర్ లాంటివాటిని వాడి ట్యాప్ చేస్తే.. తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే.. ఫోన్‌‌తో ఎలాంటి ప్రమేయం లేకుండా కేవలం సిగ్నల్స్‌‌ ద్వారా ట్యాపింగ్‌‌ చేస్తారు. గతంలో ల్యాండ్ లైన్లను ట్యాప్ చేసి కాల్స్ వింటున్నప్పుడు ఒక రకమైన బజ్ సౌండ్ వచ్చేది. దాన్ని బట్టి ట్యాప్ అవుతోందని గుర్తించేవాళ్లు. కానీ.. మామూలు వ్యక్తులు ఆ సౌండ్స్‌‌ గుర్తించడం చాలా కష్టం. ఎక్స్‌‌పర్ట్స్‌‌ మాత్రమే గుర్తించగలరు. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో పూర్తిగా హెచ్‌‌డీ క్వాలిటీతో కాల్స్ వింటున్నాం. కాబట్టి ఆ బజ్‌‌ సౌండ్ చాలా చిన్నగా వినిపిస్తుంది. అలాంటప్పుడు దాన్ని గుర్తించడం చాలా కష్టం. ఏమాత్రం అనుమానం రాకుండా కాల్స్‌‌ రికార్డ్ చేయొచ్చు. అంతేకాదు.. ఫోన్ ట్యాప్‌‌ అవుతోందని తెలిసినా ఆధారాలతో నిరూపించడం అంత ఈజీ కాదు. 

ట్యాపింగ్‌‌ సాఫ్ట్‌‌వేర్లు

పరిచయం లేని వ్యక్తులు, నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారుల ఫోన్లు ట్యాప్‌‌ చేసేందుకు సాధారణ ట్యాపింగ్ టెక్నిక్స్ వాడతారు. కానీ.. తెలిసినవాళ్లు, ఇంట్లో వాళ్ల ఫోన్‌‌ని ట్యాప్ చేయాలంటే సర్వర్లు, క్యాచర్లు, ఎక్విప్‌‌మెంట్‌‌.. ఇవేమీ అక్కర్లేదు. ఏదో ఒక కారణం చెప్పి వాళ్ల ఫోన్‌‌ కాసేపు తీసుకుని, అందులో ట్యాపింగ్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ని ఇన్‌‌స్టాల్‌‌ చేస్తే చాలు. ఈ టెక్నాలజీకి సంబంధించిన యాప్స్ డార్క్ వెబ్‌‌లో చాలా ఉంటాయి. కొంత డబ్బు చెల్లించి వాటిని కొనుక్కోవచ్చు. ఈ యాప్స్‌‌ ఫోన్‌‌లో ఇన్‌‌స్టాల్‌‌ అయినట్టు గుర్తించడం కూడా కష్టమే. ఇవి బ్యాక్​గ్రౌండ్‌‌లో ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటాయి. ఫోన్​ కాల్ రాగానే మైక్రోఫోన్ యాక్సెస్‌‌ తీసుకుని కాల్స్‌‌ రికార్డ్ చేసి, సర్వర్‌‌‌‌లో దాచేస్తాయి. ట్యాపింగ్ చేసినవాళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని వినొచ్చు. అనవసరం అనుకుంటే సర్వర్ నుంచి డిలీట్‌‌ చేయొచ్చు. ఇది కూడా ఒక రకంగా హ్యాక్‌‌ చేసినట్టే. కాకపోతే దీనికి కాస్త లిమిటెడ్‌‌ యాక్సెస్‌‌ ఉంటుంది. 

ఇలా తెలుసుకోవచ్చు

ఫోన్‌‌ ట్యాప్‌‌ అయ్యిందని తెలుసుకోవడం కష్టమే అయినా.. సాఫ్ట్‌‌వేర్స్​ ఉపయోగించి ట్యాపింగ్‌‌ చేసినా, హ్యాకింగ్‌‌ ద్వారా రిమోట్‌‌ యాక్సెస్‌‌ తీసుకున్నా ఈజీగా తెలుసుకోవచ్చు. అదెలాగంటే.. 

సౌండ్స్‌‌

సాధారణంగా ఫోన్ ట్యాప్‌‌ అయినప్పుడు వాయిస్ కాల్స్‌‌ చేస్తున్నప్పుడు హై-పిచ్డ్ హమ్మింగ్‌‌తోపాటు ఇతర వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ ద్వారా ట్యాప్‌‌ చేసినప్పుడు పోన్‌‌లో మాల్వేర్ ఉంటుంది. కాబట్టి కాల్‌‌లో లేనప్పుడు కూడా అప్పుడప్పుడు బీప్ సౌండ్స్, క్లిక్ చేసినప్పుడు వచ్చే బజ్‌‌ సౌండ్స్ వినిపిస్తుంటాయి. అయితే.. చాలాసార్లు వాటిని గుర్తించడం కష్టమే. కానీ.. తక్కువ ఫ్రీక్వెన్సీ సౌండ్ బ్యాండ్‌‌విడ్త్ సెన్సర్‌‌ని వాడి ఇలాంటి సౌండ్స్‌‌ గుర్తించొచ్చు. సౌండ్-బ్యాండ్‌‌విడ్త్ సెన్సర్ నాయిస్ డిటెక్టర్‌‌‌‌లా పనిచేస్తుంది. 

బ్యాటరీ లైఫ్

ఫోన్‌‌ని హ్యాక్‌‌/సాఫ్ట్‌‌వేర్‌‌‌‌తో ట్యాప్‌‌ చేసినా.. గతంతో పోలిస్తే.. బ్యాటరీ లైఫ్‌‌ చాలా వరకు తగ్గుతుంది. ఫోన్‌‌ వాడుకలో లేనప్పుడు కూడా బ్యాటరీ వేడెక్కుతుంది. దానికి కారణం.. ట్యాపింగ్ సాఫ్ట్‌‌వేర్ బ్యాక్‌‌గ్రౌండ్‌‌లో రన్ అవుతుండడమే. ఎప్పుడు కాల్ వచ్చినా రికార్డ్ చేసేందుకు అలర్ట్‌‌గా ఉంటుంది. అందుకోసం నిరంతరం బ్యాటరీ పవర్‌‌‌‌ని వాడుకుంటూనే ఉంటుంది. ఇక హ్యాక్ అయితే.. మాల్వేర్ ఫోన్‌‌లోని చాలా యాప్స్‌‌ వాడుకుంటుంది. దానివల్ల కూడా బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్​ అవుతుంది. అందువల్ల వేడెక్కుతుంది. బ్యాటరీ లైఫ్‌‌ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా హ్యాక్ చేసినప్పుడు ఫోన్‌‌లోని మీడియా ఫైల్స్‌‌ని రిమోట్‌‌గా కంట్రోల్‌‌ చేస్తుంటారు. దానివల్ల కూడా బ్యాటరీ ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది.  అలాంటప్పుడు బ్యాటరీని ఎక్కువగా వాడుకుంటున్న యాప్స్ ఏవో చెక్‌‌ చేసుకోవాలి. వాటిలో తెలియని యాప్స్‌‌ అంటే.. మీ ప్రమేయం లేకుండా ఇన్‌‌స్టాల్ అయినవి కనిపిస్తే  అన్ ఇన్‌‌స్టాల్‌‌ చేయాలి.

స్లో.. షట్ డౌన్... 

స్మార్ట్‌‌ఫోన్‌‌లో ఏదైనా మాల్వేర్ ఇన్‌‌స్టాల్‌‌ అయితే.. డివైజ్​ పనితీరు తగ్గుతుంది. గతంతో పోలిస్తే.. కాస్త నెమ్మదిగా రన్ అవుతుంది. యాప్స్‌‌ ఓపెన్‌‌ చేసినప్పుడు అవి నెమ్మదిగా ఓపెన్ అవుతాయి. ఫోన్‌‌ని షట్‌‌డౌన్ చేసినప్పుడు, షట్‌‌డౌన్ కాకపోయినా, షట్‌‌డౌన్ ప్రాసెస్‌‌కి ఎక్కువ టైం తీసుకున్నా, షట్‌‌డౌన్‌‌ చేసిన తర్వాత కూడా డిస్‌‌ప్లే బ్యాక్‌‌లైట్ ఆన్‌‌లో ఉన్నా ఫోన్ హ్యాక్/ట్యాప్‌‌ అయినట్టే. కొన్నిసార్లు సిస్టమ్‌‌ అప్‌‌డేట్‌‌ వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. దేనివల్ల అలా జరుగుతుందనేది ఒకటికి రెండుసార్లు చెక్‌‌ చేసుకోవాలి. 

యాక్టివిటీ.. 

మీ ప్రమేయం లేకుండానే ఫోన్ ఆటోమెటిక్‌‌గా ఆన్ లేదా ఆఫ్ అవుతుంటుంది. పైగా కొన్నిసార్లు ఫోన్‌‌లో కొన్ని యాప్స్‌‌ ఇన్‌‌స్టాల్‌‌ అవుతుంటాయి. అన్‌‌ ఇన్‌‌స్టాల్‌‌ చేసినా మళ్లీ మళ్లీ ఇన్‌‌స్టాల్‌‌ అవుతాయి. ఫోన్‌‌ని రిమోట్‌‌గా యాక్సెస్‌‌ చేసే హ్యాకర్లు ఇలా యాప్స్‌‌ ఇన్‌‌స్టాల్ చేస్తుంటారు. మీకు తెలియని నెంబర్ల నుంచి మెసేజ్‌‌లు వస్తుంటాయి. వాటిలో విచిత్రమైన నెంబర్లు, గార్‌‌‌‌బ్లెడ్‌‌(గ్లిచ్​ టెక్స్ట్ జనరేటర్​) మెసేజ్‌‌లు ఉంటాయి. కొన్ని ట్యాపింగ్ యాప్‌‌లు కోడెడ్ ఎస్సెమ్మెస్​లు కూడా పంపిస్తుంటాయి. మాల్వేర్ లేదా ట్యాపింగ్ యాప్ ఇన్‌‌స్టాల్‌‌ అయినప్పుడు పదే పదే పాప్​–అప్‌‌ యాడ్స్ కూడా వస్తుంటాయి. అప్పుడప్పుడు మైక్రోఫోన్‌‌, కెమెరా వాటంతటవే ఆన్ అవుతుంటాయి. 

ఎలక్ట్రానిక్ డిస్టర్బింగ్‌‌

ల్యాప్‌‌టాప్, కాన్ఫరెన్స్ ఫోన్, టీవీ లాంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల దగ్గర ఉండి ఫోన్లు మాట్లాడినప్పుడు ఒకరకమైన డిస్టర్బింగ్‌‌ సౌండ్ వస్తుంటుంది. ఫోన్ మాట్లాడనప్పుడు కూడా ఇలాంటి సౌండ్‌‌ వచ్చిందంటే.. ఆ ఫోన్‌‌ ట్యాప్‌‌ అవుతుందని అర్థం. యాప్‌‌ ద్వారా కాకుండా నార్మల్‌‌ ట్యాపింగ్‌‌ చేసినప్పుడు ఇలాంటి సౌండ్స్‌‌ ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే.. చాలావరకు ట్యాపింగ్ పరికరాలు ఎఫ్‌‌.ఎం. రేడియో బ్యాండ్‌‌కు దగ్గరగా ఉన్న ఫ్రీక్వెన్సీలను వాడుకుని పనిచేస్తుంటాయి. కాబట్టి అలాంటి వాటి దగ్గరకు వెళ్తే.. కొంత డిస్టర్బెన్స్ వస్తుంటుంది. యు.హెచ్‌‌.ఎఫ్‌‌.(అల్ట్రా-హై ఫ్రీక్వెన్సీ) ఛానెల్స్‌‌ని కూడా ఉపయోగించుకుంటాయి. అది టీవీ బ్రాడ్‌‌కాస్టింగ్ ఫ్రీక్వెన్సీకి దగ్గరగా ఉంటుంది. అందుకే ఫోన్‌‌ని యాంటెన్నా ఉన్న టీవీకి దగ్గరగా తెస్తే.. కొంత డిస్టర్బింగ్‌‌ సౌండ్ వినిపిస్తుంది. 

యూసేజ్ పెరుగుతుంది

ఫోన్‌‌లో ట్యాపింగ్ యాప్ ఇన్‌‌స్టాల్‌‌ అయితే.. మొబైల్ డాటా వినియోగం చాలావరకు పెరుగుతుంది. ఎందుకంటే.. ఆ యాప్‌‌ ఎప్పటికప్పుడు కాల్స్‌‌ రికార్డ్ చేస్తుంటుంది. లేదంటే కాల్స్‌‌ని నేరుగా సర్వర్‌‌‌‌కి ఫార్వర్డ్‌‌ చేస్తుంటుంది. అందుకోసం మొబైల్‌‌ డాటాని వాడుకుంటుంది. దానివల్ల ఇదివరకటితో పోలిస్తే.. మొబైల్ డాటా ఎక్కువగా అయిపోతుంది.

వెబ్‌‌సైట్లు మారిపోతాయి

క్రెడిట్‌‌ కార్డ్స్‌‌, యుటిలిటీ బిల్స్ పేమెంట్స్ చేసేందుకు ఎక్కువగా మెయిల్‌‌లో వచ్చిన లింక్స్‌‌పై క్లిక్‌‌ చేస్తుంటారు. ఫోన్ హ్యాక్ అయితే.. అలా క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అయ్యే వెబ్‌‌సైట్లు అసలైన వెబ్‌‌సైట్లతో పోలిస్తే.. కాస్త డిఫరెంట్‌‌గా కనిపిస్తాయి. అయినా.. పట్టించుకోకుండా పేమెంట్‌‌ చేస్తే ఇక అంతే సంగతులు. ఎందుకంటే.. ఆ లింక్‌‌లపై క్లిక్ చేసినప్పుడు అసలు వెబ్‌‌సైట్‌‌కు బదులు నకిలీ వెబ్‌‌సైట్ ఓపెన్ అయ్యేలా చేస్తారు హ్యాకర్స్. ఆ సైట్‌‌లో పేమెంట్ చేస్తే.. డబ్బు మోసగాళ్ల చేతికి వెళ్తుంది. అంతేకాదు.. ఆ వెబ్‌‌సైట్‌‌లో ఇచ్చిన డెబిట్‌‌ కార్డ్‌‌, ఇంటర్నెంట్‌‌ బ్యాంకింగ్ డిటెయిల్స్ కూడా హ్యాకర్‌‌‌‌కు తెలిసిపోతాయి. 

కాకుండా ఉండాలంటే.. 

ఐ.ఎం.ఎస్‌‌.ఐ. క్యాచర్లతో చేసే ట్యాపింగ్‌‌ని ఆపడం సాధ్యం కాదు. కానీ.. ట్యాపింగ్‌‌ యాప్‌‌ల ద్వారా చేసే ట్యాపింగ్‌‌ని, హ్యాకింగ్‌‌ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఆపగలం. అవేంటంటే.. 

అప్‌‌డేట్‌‌ చేసుకోవాలి 

మొబైల్ కొన్న తర్వాత కొన్ని రోజులకు ఆ ఫోన్‌‌ తయారు చేసిన కంపెనీలు సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ అప్‌‌డేట్స్‌‌ రూపంలో సెక్యురిటీ అప్‌‌డేట్స్ ఇస్తుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు ఇన్‌‌స్టాల్‌‌ చేసుకుని ఫోన్‌‌ని అప్‌‌డేటెడ్‌‌గా ఉంచుకోవాలి. దీనివల్ల ఫోన్‌‌ ట్యాప్, స్పైయింగ్‌‌, వైరస్‌‌ లాంటి వాటిని ఎవరైనా ఇన్‌‌స్టాల్‌‌ చేయాలని చూస్తే.. ఫోన్‌‌లోని సెక్యురిటీ సిస్టమ్‌‌ అడ్డుకునేందుకు ట్రై చేస్తుంది. కాబట్టి ఎప్పుడూ లేటెస్ట్ అప్‌‌డేట్స్​, సెక్యురిటీ ప్యాచ్‌‌లు ఉండేలా చూసుకోవాలి. 

సేఫ్ కమ్యూనికేషన్ 

ఫోన్ ట్యాప్ అయ్యిందనే అనుమానం వచ్చినప్పుడు ఇన్‌‌బిల్ట్‌‌ మెసేజ్‌‌, ఫోన్ ఫీచర్లకు బదులుగా ఇతర యాప్స్‌‌ వాడడం మంచిది. ఇప్పటికే ప్లేస్టోర్‌‌‌‌, యాప్‌‌స్టోర్‌‌‌‌లో ఎండ్‌‌ టు ఎండ్‌‌ ఎన్‌‌క్రిప్షన్‌‌ అందిస్తున్న కమ్యూనికేషన్ యాప్‌‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడాలి. వీటిలో కాల్స్ మాట్లాడితే.. మాటలను రికార్డ్ చేయడం అంత ఈజీ కాదు. 

కాల్ ఫార్వర్డింగ్‌‌ చెక్ 

ఈ మధ్య ఇదో పెద్ద స్కామ్ అయిపోయింది. అందుకే కొందరు సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లుయెన్సర్లు కూడా దీనిపై అవేర్‌‌‌‌నెస్‌‌ కల్పించేందుకు వీడియోలు చేస్తున్నారు. ఫోన్‌‌లో కాల్‌‌ ఫార్వర్డింగ్‌‌ యాక్టివేట్‌‌ చేసి... కాల్స్‌‌ని వేరే నెంబర్‌‌‌‌కు ఫార్వర్డ్‌‌ అయ్యేలా చేస్తున్నారు. దీనివల్ల ఎవరి నుంచి కాల్స్‌‌ వస్తున్నాయనేది తెలుసుకుని బ్లాక్‌‌మెయిల్​ చేస్తుంటారు. అందుకే అప్పుడప్పుడు ఫోన్‌‌లో కాల్‌‌ ఫార్వర్డింగ్‌‌ ఆఫ్‌‌లో ఉందా? లేదా? అనేది చెక్‌‌ చేసుకుంటుండాలి. 

అవసరం లేని యాప్స్‌‌

ఎప్పుడో.. ఏదో ఒక అవసరానికి యాప్స్ ఇన్‌‌స్టాల్‌‌ చేసుకోవడం సహజం. ఆ తరువాత  వాటిని ఓపెన్ చేయకుండా అలాగే వదిలేస్తారు. వాటిని అప్‌‌డేట్‌‌ చేయడం కూడా మానేస్తారు. ఇలాంటి యాప్స్‌‌లో ఉండే బగ్స్‌‌ని వెతికి మరీ ఫోన్‌‌లో ట్యాపింగ్ యాప్స్‌‌  ఇన్‌‌స్టాల్‌‌ చేస్తుంటారు. అలాంటి యాప్స్‌‌ని వెంటనే అన్ ఇన్‌‌స్టాల్ చేయడం మంచిది. ముఖ్యంగా ప్లేస్టోర్‌‌‌‌, యాప్‌‌స్టోర్‌‌‌‌లో ఉండే యాప్స్ కాకుండా థర్డ్ పార్టీ యాప్ స్టోర్ల నుంచి  డౌన్‌‌లోడ్ చేసుకున్న యాప్స్‌‌ వాడకపోవడమే మేలు. 

సెక్యురిటీ సాఫ్ట్‌‌వేర్‌‌ 

ఈ మధ్య దాదాపు అన్ని కంపెనీలు ఫోన్లలో ‘సెక్యురిటీ’ యాప్‌‌ ఇన్‌‌బిల్ట్‌‌గా వస్తుంది. అవి మాల్వేర్స్‌‌, వైరస్‌‌, ట్యాపింగ్ యాప్స్‌‌ ఫోన్‌‌లో ఇన్‌‌స్టాల్‌‌ అయితే.. వెంటనే గుర్తిస్తాయి. ఒకవేళ అవి సరిగ్గా పనిచేయడం లేదు అనిపిస్తే.. మార్కెట్‌‌లో దొరికే సెక్యురిటీ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ యాప్స్‌‌ ఇన్‌‌స్టాల్‌‌ చేసుకుని ఎప్పటికప్పుడు ఫోన్‌‌ చెక్‌‌ చేసుకోవాలి. ఒకవేళ ఫోన్ హ్యాక్ అయ్యిందని అనిపిస్తే.. వెంటనే ఫోన్‌‌ ఫ్యాక్టరీ సెట్టింగ్స్​ రీసెట్ చేసుకోవాలి. 

ఒకప్పుడు... 

టెలిఫోన్ ఎక్స్ఛేంజీలు మెకానికల్‌‌గా ఉన్నప్పుడు కాల్ నుండి ఆడియో సిగ్నల్‌‌ను రూట్ చేయడానికి టెక్నీషియన్లు ఎక్స్ఛేంజీలో ట్యాప్‌‌ను ఇన్‌‌స్టాల్ చేసేవాళ్లు. ఆ తర్వాత ఎక్స్ఛేంజీలు డిజిటల్ టెక్నాలజీకి మారిపోయాయి. కాబట్టి ఎక్స్ఛేంజీతో పనిలేకుండా పోయింది. దాంతో అనధికారికంగా ట్యాపింగ్‌‌ చేయగలిగే అవకాశం దొరికింది. ఈ డిజిటల్ యుగంలో ట్యాపింగ్ చేయడం చాలా సులభం. కంప్యూటర్ ద్వారా రిమోట్‌‌గా ట్యాపింగ్​ చేసేయొచ్చు. అలా చేయగలిగే సెంట్రల్ ఆఫీస్ స్విచ్ వైర్‌‌ ట్యాపింగ్ టెక్నాలజీని అడ్వాన్స్‌‌డ్ ఇంటెలిజెంట్ నెట్‌‌వర్క్ (ఏఐఎన్‌‌)ని ఉపయోగించి తీసుకొచ్చారు. దీన్ని 1995లో వేన్ హోవే, డేల్ మాలిక్‌‌ కనుగొన్నారు. అమెరికాలో ఈ ట్యాపింగ్‌‌ టెక్నాలజీకి పేటెంట్‌‌ కూడా తీసుకున్నారు. ఈ టెక్నాలజీలో ట్యాపింగ్‌‌ చేసినట్టు కనిపెట్టడం చాలా కష్టం. ఆ తర్వాత ఫోన్ వైర్‌‌లో ట్యాప్‌‌ని ఇన్‌‌స్టాల్ చేయడం లాంటివి కూడా చేశారు. ఆ తర్వాత టెక్నాలజీ డెవలప్‌‌ అవుతూ వచ్చింది. 

పెన్ రిజిస్టర్లు 

కాల్ చేసినప్పుడు వినడమే కాకుండా.. ఎవరికి కాల్ చేశారు? ఎప్పుడు కాల్ చేశారు? ఎంతసేపు మాట్లాడారు? ఇలాంటివి దొంగతనంగా తెలుసుకోవడం కూడా ఒక రకంగా నేరమే. ఇలాంటి డాటా నెట్‌‌వర్క్ ప్రొవైడర్ దగ్గర ఆటోమెటిక్‌‌గా సేవ్ అవుతుంది. కంపెనీ బిల్లింగ్ విభాగం నుంచి ఈ వివరాల్ని తీసుకోవచ్చు. ఈ డాటాను కూడా అధికారులు నెట్‌‌వర్క్‌‌ ప్రొవైడర్‌‌‌‌ నుంచి తీసుకోవచ్చు. కాకపోతే.. దీనిపై చట్టపరమైన పరిమితులు చాలాతక్కువగా ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరికరాలను వాడి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. దీన్ని పెన్ రిజిస్టర్ ట్యాప్ అంటారు.

గ్రీస్.. ఫోన్ ట్యాపింగ్ 

ఫోన్ ట్యాపింగ్‌‌ కేసులు ప్రపంచానికి కొత్తేమీ కాదు. ఇప్పటివరకు ఇలాంటి కేసులు చాలానే నమోదయ్యాయి. 2004–2005 మధ్యలో గ్రీస్‌‌ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించింది. గ్రీస్ ప్రధాన మంత్రితో సహా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల ఫోన్లు దాదాపు100కు పైగా ట్యాప్‌‌ అయ్యాయి. అది కూడా ఏడాది పాటు ట్యాపింగ్‌‌ చేశారు. 2004 ఒలింపిక్ గేమ్స్‌‌లో సెక్యురిటీ కోసం ఒక విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ ట్యాపింగ్ చేసిందని గ్రీస్ గుర్తించింది. వొడాఫోన్ గ్రీన్ నెట్‌‌వర్క్‌‌లోని ఒక సబ్‌‌సిస్టమ్‌‌ని చట్ట విరుద్ధంగా యాక్టివేట్‌‌ చేసి ట్యాపింగ్‌‌ చేసినట్టు తెలిసింది. 

మన దగ్గర 

ఇండియాలో కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం మీద ఇప్పటివరకు ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలు ఫోన్ ట్యాపింగ్‌‌ ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. అయితే.. ఇలాంటి ఆరోపణల వల్ల ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది.1988లో కర్నాటక ముఖ్యమంత్రిగా ఉన్న రామకృష్ణ హెగ్డే ఫోన్ ట్యాపింగ్‌‌ వివాదం వల్ల తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కొంతమంది రాజకీయ నాయకులు, ఇతర పౌరుల ఫోన్‌‌లను ట్యాప్‌‌ చేయడానికి ఆయన ప్రభుత్వం అధికారం ఇచ్చిందని ఆరోపణలు రావడంతో ఈ పరిస్థితి వచ్చింది. 

విరుద్ధమే...

ఇండియాలో ఫోన్ ట్యాపింగ్‌‌ అనేది చట్ట విరుద్ధమే. కానీ.. శాంతి భద్రతల పరిరక్షణ, ఉగ్రవాద చర్యలను అడ్డుకునేందుకు అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. దీనిపై గతంలోనే చట్టాలు కూడా చేశారు. భారత టెలిగ్రాఫ్ చట్టాన్ని మొదటిసారి1885లో తీసుకొచ్చారు. తర్వాత దీన్ని 2007లో సవరించారు. ఇందులో సెక్షన్ 5(2) ప్రకారం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని ప్రభుత్వ సంస్థలకు మాత్రమే ఫోన్‌‌ని ట్యాప్‌‌ చేసే అధికారం ఉంది. అంతేకాదు.. అందుకోసం ముందుగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్రటరీ అనుమతి తీసుకోవాలి. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆ రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ పర్మిషన్​ తీసుకోవాలి. ఎమర్జెన్సీ అయితే హోంశాఖలోని జాయింట్ సెక్రటరీ స్థాయి లేదా ఆ పై స్థాయి అధికారి అనుమతితో ఫోన్ కాల్స్ ట్యాప్ చేయొచ్చు. ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ 2007లోని రూల్ 419A ప్రకారం.. ట్యాపింగ్ మొదలుపెట్టే ముందు ఆ విషయాన్ని సర్వీస్ ప్రొవైడర్‌‌కు తప్పనిసరిగా రాతపూర్వకంగా తెలియజేయాలి. అంతేకాదు.. ఈ చట్టం ప్రకారం.. ఫోన్ ట్యాప్‌‌ చేసే అధికారం రాష్ట్రాల పోలీసు అధికారులు,  సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఈడీ, రీసెర్చ్ అండ్ అనాల‌‌సిస్ వింగ్, నేషనల్‌‌ టెక్నికల్‌‌ రీసెర్చ్‌‌ ఆర్గనైజేషన్‌‌, డైరెక్టరేట్‌‌ ఆఫ్‌‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌‌, నార్కోటిక్స్‌‌ కంట్రోల్‌‌ బ్యూరో, ఇన్‌‌కం ట్యాక్స్ డిపార్ట్‌‌మెంట్‌‌కు మాత్రమే ఉంటుంది. 

మూడేండ్లు జైలు 

ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 26 (బి) ప్రకారం ఎవరైనా అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్‌‌కి పాల్పడితే.. మూడేండ్ల జైలు శిక్ష పడుతుంది. ఫోన్‌‌లో మాట్లాడుతున్నప్పుడు చాటుగా వినడమంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత హక్కును ఉల్లంఘించడమే. అనధికారంగా ట్యాపింగ్ చేస్తే.. బాధిత వ్యక్తి పోలీస్‌‌ స్టేషన్‌‌లో కేసు పెట్టొచ్చు. మానవ హక్కుల కమిషన్‌‌ను కూడా ఆశ్రయించవచ్చు. అయితే.. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌కు సంబంధించి కేంద్రం ప్రతి నెలా సగటున తొమ్మిది వేల ఆర్డర్లు జారీ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లు కూడా చేరిస్తే.. ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఈ చట్టం కింద పర్మిషన్‌‌ తీసుకున్న తర్వాత ఒకరి ఫోన్‌‌ని 60 రోజులు మాత్రమే ట్యాప్ చేయాలి. ఆ తర్వాత మళ్లీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా గరిష్టంగా 180 రోజులు మాత్రమే ట్యాపింగ్‌‌ చేసే అధికారం ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఏర్పడితే అధికారం ఉన్న ప్రభుత్వ ఏజెన్సీలు ఎటువంటి పర్మిషన్ లేకుండా 72 గంటల వరకు ఫోన్‌‌ను ట్యాప్ చేయొచ్చు. అంతకు మించి చేయాలంటే పర్మిషన్ తప్పనిసరి. కానీ.. పర్మిషన్ ఇవ్వకపోతే.. అప్పటివరకు ట్యాప్ చేసిన సంభాషణ రికార్డులను 48 గంటల్లోగా నాశనం చేయాలి.

వెబ్‌‌ ట్యాపింగ్‌‌

యూజర్ల ఐపీ అడ్రస్‌‌లోకి లాగిన్ అయి వాళ్ల బ్రౌజింగ్ వివరాలను తెలుసుకోవడాన్ని కూడా ‘వెబ్‌‌ ట్యాపింగ్’ అనే అంటారు. అంటే మనం ఆన్‌‌లైన్‌‌లో ఏ వెబ్ సైట్ చూస్తున్నాం? ఏ యాప్ ఎక్కువ ఉపయోగిస్తున్నాం? లాంటి మొత్తం వివరాలు ట్యాపింగ్ చేసినవాళ్లు తెలుసుకోవచ్చు. ఇలాంటి ట్యాపింగ్ కూడా ఇప్పుడు బాగానే పెరిగింది. 

ఎలా పుట్టింది? 

‘ఫోన్ ట్యాపింగ్’ ఈ మధ్య మొదలైంది కాదు.. ఫోన్ కనిపెట్టిన కొన్నేండ్లకే ట్యాపింగ్‌‌ కూడా కనిపెట్టారు. అలెగ్జాండర్ గ్రాహంబెల్ టెలిఫోన్‌‌ను1876లో కనిపెడితే..1890 నుంచే టెలిఫోన్ వైర్ ట్యాపింగ్ మొదలైంది. అమెరికాలో రాయ్ ఓల్మ్‌‌స్టెడ్ అనే క్రిమినల్‌‌ను పట్టుకునేందుకు అధికారులు అతని ఇంట్లో ఉన్న ల్యాండ్‌‌ఫోన్‌‌ని ట్యాప్‌‌ చేశారు. ట్యాపింగ్‌‌ వల్ల దొరికిన ఆధారాలతోనే అతడిని నేరస్తుడిగా నిర్ధారించింది కోర్టు. కానీ.. అధికారులు తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించారని కోర్టులో కేసు వేశాడు రాయ్ ఓల్మ్‌‌స్టెడ్. కానీ.. అప్పట్లో కోర్టు అతని వాదనను కొట్టి పారేసింది. ఆ తర్వాత1928లో అమెరికా కోర్టు దీనిపై చట్టం తెచ్చింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం టైంలో ట్యాపింగ్‌‌ జరిగింది. అందుకే దాన్ని అడ్డుకోవడానికి నాజీలు ప్రత్యేకమైన పద్ధతులు వాడారు. ఫోన్ లైన్లలో వోల్టేజీని ఎప్పటికప్పుడు మానిటర్ చేసేవాళ్లు. వోల్టేజీలో మార్పులు కనిపిస్తే వెంటనే అలర్ట్ అయ్యేవాళ్లు. ఇదొక్కటే కాదు.. అమెరికాలో ఇలాంటి కేసులు ఆ తర్వాత కూడా చాలానే నమోదు అయ్యాయి.