ఆధ్యాత్మికం: నేను అంటే ఎవరు.. శ్రీకృష్ణుడు ఎలా వర్ణించాడో తెలుసా...

నా భావం పొందటానికి "నన్ను ఆశ్రయించి నన్ను గురించిన జ్ఞానాన్ని చింతన చేస్తూ. నా కోసం తపస్సు చేస్తే రాగం... భయం... క్రోధం వంటివి నేను అనే మాటకి ప్రతికూలంగా ఉండే లక్షణాలు వాటంతట అవే పోతాయి. అప్పుడు ఆ సాధకుడు, లేక భక్తుడు" నా" తో  నిండి..."నా" యందే నిలిచి ఉంటాడు..

 కృష్ణుడు చెప్పిన ఈ మాట అర్ధం కావాలంటే "నేను"అంటే ఏమిటో తెలియాలి. సంస్కృతంలో  "ఆత్మన్" అనే మాటకి సమానార్ధమైన తెలుగుపదం "నేను" లేదా "తాను" ఆత్మన్ అంటే సర్వజీవులలో ప్రాణస్వరూపంగా ఉండే పరమాత్మ అంశ. పరమాత్మ ఒక పెద్ద వెలుగు ముద్ద అయితే....  జీవాత్మలు దాని నుండి వెలువడిన చిన్నచిన్న వెలుగు రవ్వలు...  ఇవి తిరిగి ఆ పెద్ద వెలుగులో లయం (కలిసి) అయిపోతాయి .  కాని నశించవు. ఎట్లాగంటే, నీళ్ళలో తేలుతున్న మంచుముక్క నీటి కంటే వేరుగా కనిపిస్తుంది. కానీ... కరిగిపోయాకనీళ్ళలో కలిసిపోతుంది. కరిగి లయం కావాలంటే “నేను” అంటే ఏమిటో తెలుసుకోవాలి.   నిజానికి ప్రతి మనిషికి ఉన్న అసలు పేరు "నేను" ఎవరు ఏ పేరుతో ఏ చుట్టరికంతో పిలిచినా ప్రతివారు తమని తాము "నేను" అనే చెప్పుకుంటారు. ఎందుకంటే ..

ప్రతిజీవి పరమాత్మ ప్రతిరూపమే కదా! 

మనకు తెలియకుండానే అప్రయత్నంగా అజ్ఞానంమాటల్లో వ్యక్తమవుతుంటుంది. అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న ఈ జ్ఞానాన్ని గుర్తించటమే చేయవలసిన సాధన. భగవద్గీతలో ఎక్కడెక్కడ "నేను"అని ఉన్నడో అక్కడక్కడ కృష్ణుడు అనే అర్థం తీసుకోకుండా చదువుతున్న లేదా వింటున్న ప్రతివారు సమర్పించటమే అందరిలోను అత్యస్వరూపంగా ఉన్నది పరమాత్మయే అనే దృష్టితో చూడటం మొదలు పెట్టినప్పుడు ఎవరిపైనా రాగం లేదా ద్వేషం ఉండదు. భయపడటానికి క్రోధం పెంచుకోవటానికి పరాయి వారెవరు లేరు కదా! ఈ రకమైన భావన కలగటానికి తగిన సమర్ధత, తపస్సు వల్ల మాత్రమే కలుగుతుంది.

 తపస్సు అంటే శరీరానికి, మనస్సుకి, మాటకి క్రమశిక్షణ నివ్వటం. 

ఈ మూడు విధాలైన తపస్సుల గురించి తరువాత వివరంగా ...  తపస్సుల వల్ల జ్ఞానం కలుగుతుంది ఇక్కడ "జ్ఞానం" అంటే బాహ్యమైన ఆకారాలు, పేరు మొదలైన వాటి మీద మనను నిలవక లోపల ఉన్న అస్తిత్వంలో మనసు లీనమై "నేను"గా ఉంటుంది. ఆ స్థితిలో చేసే పనుల వల్ల కర్మబంధం లేక జీవితం పవిత్రంగా సాగుతుంది. అందరిలో ఉన్న "నేను"ని చూడటమంటే అందరూ ఒకే విధంగా చూడలేదు కదా. ..

ఎవరు ఎట్లా చూస్తే అట్లా వారికి "నేను' ప్రసన్నమవుతానని కృష్ణుడు. అర్జునుడితో చెప్పాడు. ఎవరిని ఎట్లా భావించినా, వారు అవతలి వారిలో ఉన్న "నన్నే" భావిస్తున్నారు. కనుకనా మార్గంలోనే సాగుతున్నట్టే. "నన్ను" ఉపాసించేదారులు ఎన్నో ఉన్నాయి.. కొంతమంది తమ పనులు సిద్ధించాలని వేరు వేరు... దేవతలని ఉపాసిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఆయా దేవతల రూపాల్లో “నన్నే" ఉపాసిస్తున్నారు.

సృష్టిలో సమస్తమైన జీవుల్లో జీవాత్మరూపంగా ఉన్న పరమాత్మని గుర్తించమని శిష్యుడైన అర్జునుడికిఉపదేశించాడు జగద్గురువు. ఇదే నిజమైన వైష్ణవం.అంటే అణువణువునా సర్వవ్యాపి అయిన విష్ణువునిదర్శించి లయం కావటమే...

 తను అనే అర్దం చేసుకుంటే భగవద్గీత అసలు అర్దం  ఆచరణయోగ్యంగా దర్శనమిస్తుంది. లేకపోతే చదవటమే. కానీ, జీవితానికి అన్వయం చేసుకుని ప్రయోజనంపొందటం అనేది ఉండదు.


"నేను" అనే భావం పొందటానికి ఆశ్రయించవలసింది "నేను"నే "నేను"కి సంబంధించిన జ్ఞానాన్ని పొంది. దానిని గురించే తపస్సు చేయాల్సి ఉంది. తపస్సు అంటే తీవ్రమైన తపన అనుకున్నది పొంచే వరకు విహ్వలతతో గిలగిలలాడి పోవటం ప్రయోగశాలల్లో అహోరాత్రులు నిద్రాహారాలు మరచిపోయి పరిశోధనల్లో మునిగి పోయిన శాస్త్రవేత్తల కృషి తపస్సే.  

 ప్రపంచం, పరిసరాలు తెలియకుండా చదరంగం మొదలైన ఆటల్లో మునిగిపోయిన వారెదే  తపస్సే. అదేవిధంగా "నేను" గురించి తెలుసుకుని దానిని పొందాలని చేసే సాధనే తపస్సు నేను గురించిన జ్ఞానమే "అత్మజ్ఞానం"-.ఈ జ్ఞాన సముపార్జన తపస్సులాగా చేస్తుంటే రాగం, భయం, క్రోధం చల్లగా జారుకుంటాయి. రాగం అంటే వ్యక్తులు లేక పదార్ధాల ప్రత్యేక స్వభావాలు, పేర్లు. అకారాల పట్ల కోరిక గాఢంగా ఉండటం. అకారణంగా విపరీతమైన ఇష్టం. దీనికి రెండో పార్శ్యం... ద్వేషం. ఈ రెండూకూడా అడుగడుగున అడ్డు తగిలే ప్రతి బంధకాలు, మరొకటి భయం. కావలసినది దొరక దేమో. ఉన్నది పోతుందేమో అన్న భావనే భయానికి కారణం అంటే కోరిక, లోభం అనేవే భయ హేతువులు. భయం ఉన్నవారు ఏదీచేయలేరు. ఈ చేతకానితనం వల్ల కోపం వస్తుంది. ఆ కోపం దీర్ఘకాలికంగా నిలిచి ఉంటే క్రోధంగా పరిణమిస్తుంది. కోపం రావటం మానవ సహజం. వెంటనే మరచిపోవటం ఉత్తముల లక్షణం. దానిని పెంచి పోషించినప్పుడు క్రోధం అవుతుంది. క్రోధం శారీరక మానసిక ఆరోగ్యాలని హరిస్తుంది. దేని మీద దృష్టి కేంద్రీకరించటం కుదరదు.

రాగం, భయం, క్రోధం ఎట్లా పోతాయి? అందరిలో ఉన్న "నేను" ని ఆశ్రయించటం. "నా" లోనూ ఇతరుల్లోనూ ఉన్న "నన్ను" (నేనుని) నిరంతరం స్మరిస్తూ ఉండటంవల్ల "నా" యందు ఉండి. "నా" స్థితిలో స్థిరంగా ఉండటం జరుగుతుంది. అంటే స్వంత అభిప్రాయాలని, ఇతరులు గురించి తను ఏర్పరచుకున్న అభిప్రాయాలని అందరిలోనూ అంతర్యామిగా ఉన్న "నేను"కి  వర్తిస్తుంది.