మయోనీస్ దేనితో తయారు చేస్తారు..ఎందుకు బ్యాన్.?

ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనీస్​ను  రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్​ చేసింది. ఈ మేరకు అక్టోబర్ 30 సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. పచ్చి కోడిగుడ్లతో తయారు చేస్తున్న మయోనీస్​ను ఏడాదిపాటు నిషేధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్‌‌‌‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో ఫుడ్ సేఫ్టీపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో నియమించిన టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ కమిటీల పనితీరుపై మంత్రి ఆరా తీశారు.  హైదరాబాద్‌‌‌‌లోని నందినగర్‌‌‌‌‌‌‌‌లో మోమోస్ తిని ఓ మహిళ మృతిచెందిగా, పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. 235 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్‌‌‌‌, గోడౌన్స్‌‌‌‌లో తనిఖీలు చేశామని, 170 సంస్థలకు నోటీసులు ఇచ్చామని మంత్రికి జీహెచ్‌‌‌‌ఎంసీ టాస్క్‌‌‌‌ఫోర్స్ అధికారులు వివరించారు. జిల్లాలోనూ విరివిగా తనిఖీలు చేయాలని మంత్రి సూచించారు. ఇందుకోసం రెండు టాస్క్‌‌‌‌ఫోర్స్ కమిటీలను నియమించాలన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

ఫుడ్​ సేఫ్టీపై పదేండ్లుగా నిర్లక్ష్యం

రాష్ట్రంలో గత పదేండ్లలో హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, హాస్టళ్ల సంఖ్య భారీగా పెరిగిందని, ఇందుకు తగ్గట్టుగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ బలోపేతం కాలేదని మంత్రికి అధికారులు వివరించారు‌‌‌‌. , కొత్త పోస్టులు మంజూరు కాలేదని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో ముడిపడి ఉన్న డ్రగ్‌‌‌‌ సేఫ్టీ, ఫుడ్‌‌‌‌ సేఫ్టీ విషయంలో రాజీ పడేది లేదని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. ఫుడ్‌‌‌‌ సేఫ్టీలో ముందున్న రాష్ట్రాలు, దేశాల్లో అవలంబిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. అవసరమైన కొత్త పోస్టులను మంజూరు చేసి, భర్తీ చేస్తామని చెప్పారు. కొత్తగా 3 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌‌‌‌ను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తెలిపారు. 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్‌‌‌‌ ల్యాబ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఏడాదికి సుమారు 24 వేల శాంపిల్స్ టెస్ట్ చేసేలా ల్యాబులను బలోపేతం చేయాలని అధికారులను  ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌‌‌‌మెంట్ మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని అన్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లలో డ్రగ్ అథారిటీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆఫీసులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని తెలిపారు.  ఫుడ్, డ్రగ్స్‌‌‌‌కు సంబంధించిన ఫిర్యాదులు ఎవరికి,  ఎక్కడ చేయాలో ప్రజలకు తెలిసేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆహారం కల్తీ చేయాలంటేనే భయపడేలా చర్యలు ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌‌‌‌‌‌‌‌ కర్ణన్, డైరెక్టర్ శివలీల, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్లు మూర్తి రాజు, అమృత, ధర్మేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

ఏడాదిపాటు అమలు

వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తినే మయోనీస్​ను క్వాలిటీలేని,  పచ్చి ఎగ్స్‌‌‌‌తో తయారు చేస్తున్నారని, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతున్నదని మంత్రి దామోదరకు అధికారులు వివరించారు. మయోనీస్​ క్వాలిటీ, అది తిన్న తర్వాత కలిగిన దుష్పరిణామాలపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. కేరళలో ఈ తరహా మయోనీస్​ తయారీని అక్కడి ప్రభుత్వం నిషేధించిందని, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మన రాష్ట్రంలోనూ బ్యాన్​ చేయాలని మంత్రిని అధికారులు  కోరారు. ఈ అంశంపై పలువురు డాక్టర్లు, ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి.. మయోనీస్​పై నిషేధం విధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌‌‌‌‌‌‌‌ కర్ణన్‌‌‌‌కు సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. 2025 అక్టోబర్ చివరి వరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.