ఆధ్యాత్మికం : ఙ్ఞానం అంటే ఏంటీ.. శ్రీకృష్ణుడు చెప్పిన సారాంశం ఏంటీ.. జ్ణానం కంటే గొప్పది లేదా..?

అన్ని యఙ్ఞాలలోనూ కాల యఙ్ఞమే ఉత్తమమైనది అని చెప్పిన శ్రీకృష్ణుడు   అది ఏ విధంగా ఉంటుంది, దాని ఫలితమేమిటి? అనే విషయాలను ప్రతిపాదిస్తున్నాడు. సర్వకర్మలు జ్ఞానమునందే పరిసమాప్తమౌతున్నాయి అంటే అదెట్లా కుదురుతుంది అనే సందేహం రావటం సహజం. ఫలితాన్ని ఆశించకుండా ఏ పని చేసినా కలిగేది జ్ఞానమే. పని చేయటమే ప్రధానం. అన్ని పనులకి ఫలితాలు అనుకున్నట్లు రావాలనే నియమం ఏమీ లేదు కదా. 

మనం ఎట్లా ఉండాలని మన తల్లిదండ్రులు, భగవంతుడు అనుకున్నారో. ..అట్లా ఉన్నామా? లేదే. .. మానవుడు తాను తలచినట్టు లేడని సృష్టించటం మానలేదే.. బ్రహ్మకి సృష్టి చెయ్యటమే పని. తన శక్తినంతా వినియోగించి చేస్తున్నాడు. అదే పరమార్థం. బ్రహ్మని చూసి కదా...  యజ్ఞాల వంటి వాటిని చెయ్యటం, అభ్యాసం చేయటం జరిగింది. ఫలితాన్ని ఆశించటం విషయంలో కూడా ఆయనే ఆదర్శం. సరిగా చెయ్యగలిగామా లేదా? అన్న దాని వరకే మన ప్రమేయం. తరువాత మనది కాదు. ఇది కర్మలను యజ్ఞార్థం చెయ్యటం అలవాటైతే అనుభవంలోకి వస్తుంది. 

ఉదాహరణకి ఏదైనా ఒక పని ప్రారంభించారనుకుందాం. ఏదో చిన్న అపశకునం వంటిది కనపడింది మధ్యలో, అది తన సొంతపని అయితే గిజగిజలాడతారు. బాధ పడతారు. ఏవేవో పరిహారాలు అంటూ పరుగులు పెడతారు. అదే ఆఫీస్ పని అయితే అంతగా పట్టించుకోరు. చూసీ చూడనట్టు వదిలేస్తారు. అదేవిధంగా కష్టపడి పనిచేసి సరైన ఫలితం రానప్పుడు మా శక్తివంచన లేకుండా చేశాం. ఫలితం రాకపోతే మేమేం చేస్తాం? అని ఊరుకుంటారు. అంతే గాని, దిగులు పడటం వంటివి ఉండవు. స్వంత పనుల్ని కూడా ఆ విధంగా నిర్లిప్తంగా చెయ్యటమన్నది అభ్యాసం చెయ్యాలి. సాధ్యమా? అంటే, సాధ్యమేనని కృష్ణుడు నిరూపించాడు.

యాదవులందరు విహారయాత్రకి వెళ్ళి అక్కడ పరిహాసాలాడుకుంటూ వాదనలోకి దిగి, తగాదా పడి, ఒకరినొకరు చంపుకుంటుంటే నిర్లిప్తంగా తెరమీద బొమ్మల్ని చూసినట్టుగా చూస్తూ ఉండిపోయాడు. తానేమీ చెయ్యలేనప్పుడు బాధపడి ఉపయోగం ఏమిటి? అన్న జ్ఞానం ఉంటే బాధ ఉండదు..

జ్ఞానాన్ని గురువుకి శరణాగతి చేసి, సేవ చేసి, తెలుసుకోవాలనే సద్భుద్ధితో ప్రశ్నించి కాని పొందవచ్చు. తత్త్వవేత్తలైన వారు తామే వచ్చి జ్ఞానబోధ చేస్తారు. ఈ జ్ఞానం లభించే మార్గం.. చేసే పనిని సమర్పణ బుద్ధితో శరణాగతి పూర్వకంగా చేయటమే. అన్నీ సమర్పణ బుద్ధితో చేయటం ఎట్లా? ఎవరిని చూసినా. ..మాట్లాడినా, వాళ్ళ చేష్టలలో, మాటలలో జ్ఞానస్వరూపుడనైన నన్ను చూడటం అలవాటు చేసుకోవాలి. ప్రణిపాతం అంటే దైవం దగ్గరనో, దైవసమానులుగా భావించే వారి దగ్గరనో సాష్టాంగ పడటం మాత్రమే కాదు. సర్వజీవులలో నేను అనే ప్రజ్ఞగా ఉన్న దైవానికి తనని సమర్పణ చేసుకోవటం.

పరిప్రశ్న చేసి జ్ఞానాన్ని పొందవచ్చు. కాలక్షేపానికో, గొప్పకో, పరీక్షించటానికో కాక, నిజంగా తెలుసుకోవాలనే తపనతో అడగటాన్నే పరిప్రశ్న అంటారు. అడిగిన తీరును అనుసరించి సమాధానం ఉంటుంది. వాల్మీకి నారదుణ్ణి పరిప్రశ్నయే చేశాడు. జనుల అదృష్టం పండి రామకథామృతమ్ జాలువారింది. జ్ఞానం పొందాలనుకుంటే తన మిడిమిడి జ్ఞానం ప్రదర్శించటం కాక పరిప్రశ్న చెయ్యాలి..


సేవాభావంతో కర్మలు చేయవలసి ఉంది. ఇది బానిసత్వం కాదు. సర్వాంతర్యామిని సమస్తంలోను దర్శించటం వల్ల అందరు భగవత్ (నా) స్వరూపాలే అన్న భావనతో చేసినప్పుడు జ్ఞానం అప్రయత్నంగా సిద్ధించినట్టే కదా. ఈ మూడింటిని అభ్యాసం చేస్తూ ఉంటే ఉపదేశం చేసేవారు తమంతట తామే వచ్చి జ్ఞానబోధ చేస్తారు అంటాడు కృష్ణుడు..

గురువే శిష్యుడికి అర్హత కలిగినప్పుడు వస్తాడు. గురువుకి శిష్యుడి అర్హత తెలుస్తుంది కాని, శిష్యుడికి గురువు సరైన వాడా? కాదా? అనేది ఎట్లా తెలుస్తుంది. తెలిస్తే గురువు కన్నా శిష్యుడే గొప్ప అవుతాడు కదా. శిష్యుడు చెయ్యవలసినదల్లా పెద్దలకు ప్రణిపాతముచేసి, సేవ చేసి, పరిప్రశ్నించి అవన్నీ  నాకు చేసినట్టు భావించటం. బోధ చేసే గురువులు తత్త్వవేత్తలు. తత్వం అంటే భగవత్ తత్త్వం. జ్ఞానం అంటే అదే. నిజానికి అదొక్కటే. తనకి తెలిస్తేనే కదా ఇంకొకరికి చెప్పటానికి వీలయ్యేది. వారు తెలుసుకోవటం మాత్రమే కాదు. అనుభూతి పొందిన వారు కూడా అయి ఉంటారు.

అందరు నా స్వరూపాలే అని తెలుసుకోవటం వల్ల ఇతరులెవరి పట్ల మోహబుద్ధి, ఈర్ష్యాసూయలు కలగవు. తన కన్నా వేరు అని భావించినప్పుడు కదా.. ఇష్టమో, అయిష్టమో కలగటం. భేదబుద్ధి లేకపోవటం వల్ల సర్వజీవులని తనుగానే దర్శించటానికి వీలవుతుంది. సర్వ జీవులని, తనని కూడా నా (కృష్ణుడి) యందు. దర్శించగలడు.

'మస్తం భగవన్మయం" అనే దృష్టితో పని చేసుకుంటూ పోతే పాపభీతి ఉండవలసిన పని లేదు. తన కన్నా భిన్నమైనది మరొకటి ఉంటే కదా పాపభావన, ఈ జ్ఞానం కర్మ అనే సముద్రం దాటే తెప్ప... ఈ  తెప్ప చిన్నది అయినా పెద్ద సముద్రాన్ని దాటించగలదు. అదే విధంగా ఈ జ్ఞానం చిన్నదే అయినా సముద్రమంత చాలా పెద్దది అయిన పాపాన్ని దాటించగలదు. మంట తన కన్నా ఎంతో పెద్దదైన కట్టెను దహనం చెయ్యటం లేదా? ఎన్ని కట్టెలైనా మంటలో కాలిపోయినట్టు.. జ్ఞానం అనే అగ్నిలో సర్వకర్మలు భస్మం అవుతాయి....

–వెలుగు, లైఫ్​–