ఏది జర్నలిజం? ఎవరు జర్నలిస్టు?

‘ప్రస్తుతం అసలు జర్నలిస్టు ఎవరో.. కొసరు జర్నలిస్టు ఎవరో తెలియడంలేదు. ఎవరుపడితే వాళ్లు జర్నలిస్టులుగా చెలామణి అవుతున్నారు. ఏదిపడితే అది మాట్లాడుతున్నారు.ఒకరు యూ ట్యూబ్.. ఇంకొకరు ఆ ట్యూబ్ అంటరు. ఎవరిది ఏ ట్యూబో తెలియడం లేదు. మీడియా రంగంలో పెరుగుతున్న ఇలాంటి విపరీత పెడ ధోరణుల వల్ల నిజమైన జర్నలిస్టులకు గౌరవం దక్కడంలేదు. ఈ పరిస్థితి మారాలి. దీనికి ఫుల్  స్టాప్ పడాలి.

 జర్నలిస్టుకు డెఫినెషన్ ఏందో చెప్పండి. ప్రభుత్వం ఎవరిని జర్నలిస్టుగా గుర్తించాలో డిసైడ్ చేయండి. జర్నలిస్టు ఎథికల్ లైన్ ఏంది? అతడు ఏ హద్దును దాటకూడదు. ఒకవేళ దాటితే జరిగే పరిస్థితులపై ఎట్ల స్పందించాలి.. వీటన్నింటిపై ఆలోచన చేసి ఒక పరిష్కార  మార్గం చూపించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై, ప్రభుత్వంపై ఉంది’ అని ఈనెల 8న  హైదరాబాద్  రవీంద్రభారతిలో  జేఎన్  జే  సొసైటీ జర్నలిస్టులకు ఇండ్ల జాగా అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. నిజమైన, నిఖార్సయిన జర్నలిస్టులెవరో  తేల్చాలంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి  చర్చకు లేవనెత్తడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు.  ఏది జర్నలిజం..? ఎవరు జర్నలిస్టు..?  జర్నలిజం భాష ఏంటి..?  జర్నలిస్టు బాధ్యత ఏంటి..?  వృత్తి అర్హతలేంటి? అనే ప్రశ్నలను జర్నలిస్టు లోకం కూడా వేసుకుని వాటికి సమాధానాలు వెతకాల్సిన సందర్భం, సమయం కూడా ఇదే!

 ‘ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్ల కదలిక’ అన్నారు.. ప్రజాకవి కాళోజీ నారాయణరావు.  సామాజిక స్పృహ కలిగిన బాధ్యత జర్నలిస్టుకు ఉండాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పే వృత్తి ధర్మం పాటించాలి.  సమాజంలో  కోట్ల మందిని కదిలించి  చైతన్యం చేసే సాధనం జర్నలిజం.  ప్రజాస్వామ్య వ్యవస్థ  నాలుగు మూలస్తంభాల్లో  ఫోర్త్ ఎస్టేట్ కూడా.   ప్రస్తుతం  ప్రజల్లో జర్నలిస్టులపై  భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మాస్ మీడియా అయిన ప్రింట్(న్యూస్ పేపర్లు, మ్యాగజైన్స్),  ఎలక్ట్రానిక్ (న్యూస్ చానల్స్)  మీడియాల్లో పనిచేసేవాళ్లు జర్నలిస్టులా? లేక  యూట్యూబ్, వెబ్ సైట్,  ఈ– -పేపర్ పెట్టుకునేవాళ్లు జర్నలిస్టులా? అనే ప్రశ్నలు కూడా ప్రజల నుంచి  వినిపిస్తున్నాయి. 

రోజురోజుకూ టెక్నాలజీ  పెరుగుతుండగా.. సోషల్ మీడియా ప్రభావం, పరిధి విస్తరిస్తోంది.  దీంతో  ప్రజల్లోనూ వాటి వాడకం పెరుగుతోంది. ఇదే అదనుగా చేసుకుని కొందరు జర్నలిస్టు అవతారం ఎత్తుతున్నారు. జర్నలిజం వ్యవస్థలోకి చొరబడుతున్నారు. జర్నలిస్టుగా చెలామణి అవుతున్నారు.  నేడు మెయిన్ స్ట్రీమ్ మీడియా వర్సెస్ సోషల్ మీడియా జర్నలిస్టులుగా పరిస్థితులు మారిపోయాయి. ఇంతకూ  జర్నలిస్టు లెవరు.?  ఎవరిని జర్నలిస్టులుగా  గుర్తించాలి?  అనే సందేహాలు ప్రజల్లోనే కాదు. జర్నలిస్టు ప్రపంచంలోనూ నెలకొన్నాయి.  

జర్నలిస్టుగా అవతారమెత్తి..  వ్యవస్థలోకి చొరబడి..ప్రస్తుతం  సోషల్ మీడియాను అడ్డాగా  చేసుకుని కొందరు జర్నలిస్టులుగా చెలామణి అవుతున్నారు. జర్నలిజంలోని  నైతిక విలువలు, ప్రమాణాలు పాటించకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు.  అక్రమాలకు, బెదిరింపులకు పాల్పడుతున్నారు.  ఇలాంటి వాళ్లతోనే  జర్నలిస్టు  అంటేనే  ప్రజలు అసహ్యించుకునే దుస్థితి నెలకొంది.  అర్హత లేని కొందరు మిడిమిడి జ్ఞానంతో  జర్నలిస్టులుగా పుట్టు కొస్తుండడమే ఇందుకు కారణం.  ఏది రాసినా..  ఏం మాట్లాడినా అదే జర్నలిజం అనే ఇష్టానుసార ధోరణి  పెరిగిపోతోంది.  జర్నలిస్టు ముసుగులో  యూట్యూబ్,  ఈ–పేపర్ల పేరిట పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు.

 అసలు జర్నలిజం అంటే ఏందో..?  జర్నలిస్టు అర్హతలేంటో? కనీస పరిజ్ఞానం ఉండదు. తెలియదు. వ్యవస్థలోకి చొరబడి బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తూ జర్నలిజం నైతిక విలువలకు పాతర వేస్తున్నారు.  వ్యవస్థను  భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నేడు జర్నలిజంలో ఓనమాలు కూడా తెలియని కొందరు జర్నలిస్టులుగా హల్ చల్ చేస్తున్నది తెలిసిన వాస్తవమే!   

ఒకసారి ‘ జస్టిస్​ కట్జూ’ వ్యాఖ్యలను పరిశీలిస్తే..

‘నేటి కాలంలో జర్నలిస్టులకు కనీస అర్హత లేక పోవడం వార్తల సేకరణ(రిపోర్టింగ్) నాణ్యతపై  ప్రభావం చూపుతోంది’ అని  కొన్నేండ్ల కిందట ఆనాటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ ) చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ వ్యాఖ్యానించారు.  ‘న్యాయవాద వృత్తిలోకి వెళ్లాలంటే లా డిగ్రీ చదవాలి. బార్ కౌన్సిల్​లో  రిజిస్టర్ చేసుకోవాలి. డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చదవాలి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అసోసియేషన్(ఐఎంఏ) నమోదు చేసుకోవాలి. టీచర్ కావాలంటే ఉపాధ్యాయ శిక్షణలో డిగ్రీ పొందాలి. 

ఇలాంటి వృత్తిపరమైన అర్హతలు కలిగిన రంగాలకు ఉన్నట్టే జర్నలిస్టులకు కూడా అర్హతలు ఉండాలి. జర్నలిస్టు వృత్తిలోకి సరైన అర్హత లేనివారు  అసంపూర్ణ, మిడిమిడి జ్ఞానంతో వస్తున్నారు.  అలా  వచ్చినవారు జర్నలిజం నైతిక విలువలు, ఉన్నత ప్రమాణాలు పాటించడం లేదు’.. అని కట్జూ అభిప్రాయపడ్డారు.  జర్నలిస్టు వృత్తిలోకి వచ్చేవారికి  డిగ్రీ అర్హత ఉండాలని, ఇందుకు స్టడీ చేసి సిఫార్సులు ఇచ్చేందుకు ఓ కమిటీని  కూడా ఏర్పాటు చేశారు.   ఆయన పదవీకాలం పూర్తవడంతో ఆ కమిటీ కూడా చెల్లుబాటు కాకుండాపోయింది.  దేశంలో పత్రికా స్వేచ్ఛను  పరిరక్షించడం,  మీడియా ప్రమాణాలను మెరుగుపరచడం  ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ( పీసీఐ) లక్ష్యంగా ఉంటుంది. కానీ, ఇది కొన్నాళ్లుగా నిర్వీర్యమై మసకబారుతోంది.    

హద్దుమీరి ప్రవర్తిస్తే నియంత్రణ చర్యలు ఉండాలి

ప్రస్తుతం రాష్ట్రంలో జర్నలిస్టు వృత్తిని సంస్కరించాల్సిన  అవసరం ఎంతైనా ఉంది.  జర్నలిస్టులమంటూ హద్దుమీరి ప్రవర్తిస్తే.. ప్రభుత్వం కూడా నియంత్రణ చర్యలు తీసుకునేలా వ్యవస్థను  ప్రక్షాళించాలి.  మాస్ మీడియా సంస్థలు చట్ట పరిధిలో ఉంటాయి.  వాటిలోని జర్నలిస్టులు  సామాజిక బాధ్యతతో సంస్థకు చెడ్డపేరు రాకుండా వ్యవహరిస్తుంటారు. ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చే వార్తలు, కథనాలను కూడా కొన్నిసార్లు కోర్టులు సుమోటోగా తీసుకుం టాయి. చట్ట పరిధిలో  ఏర్పాటైన సంస్థలు కావడంతో వార్తల నాణ్యత  ప్రమాణాల్లో వందశాతం విశ్వసనీయతను కలిగి ఉంటాయని కూడా పరిగణనలోకి తీసుకుంటుంటాయి. 

ఇక సోషల్ మీడియాలో జర్నలిజం పేరిట వచ్చేది ఏది వాస్తవమో.. అవాస్తవమో చెప్పడం కష్టం.  మంచికంటే చెడే ఎక్కువ .. కేవలం రోత మాటలు, బూతు పదాల విష సంస్కృతి ,  హద్దు మీరి ప్రవర్తించడంలో  కేరాఫ్​గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ)  దేశ పౌరులు తమ ఆలోచనలు,  అభిప్రాయాలను  స్వేచ్ఛగా  వ్యక్తీకరించే హక్కును కల్పించింది.  అయితే,  దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్ర భద్రత, ప్రవర్తన,  నైతికత, కోర్టు ధిక్కారణ,  పరువు నష్టం, నేరానికి ప్రేరేపించడం వంటి వాటికి పాల్పడితే నియంత్రించే పరిమితులు ప్రభుత్వాలకు ఉంటాయని నిర్దేశించింది.  

జర్నలిస్టుల సంక్షేమం, భద్రత కూడా ముఖ్యం

 రాష్ట్రంలో పాత్రికేయ వృత్తిలో నైతిక విలువలు, ప్రమాణాలు పాటించేలా.. పెంపొందించే, పర్యవేక్షణ చేసే బాధ్యత తెలంగాణ ప్రెస్ అకాడమీది.   జర్నలిస్టు వృత్తి పలుచనకాకుండా  తగు కచ్చితమైన మార్గదర్శకాలను, విధి విధానాలను  రూపొందించి అమల్లోకి తేవాలి.  స్పష్టమైన అర్హతలు గుర్తించి.. వృత్తిలోకి వచ్చాక హద్దు దాటకుండా పరిధిని నిర్ణయించాలి. 

జర్నలిస్టుల సంక్షేమంలో భాగంగా సామాజిక భద్రత, వేతనాలు, హక్కుల రక్షణకు ప్రభుత్వాల చట్ట పరిధిలోని అంశాల అమలుకు  పూనుకోవాలి.  సెంట్రల్  వర్కింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్ 1955,  మజీతియా వేజ్ బోర్డు సిఫార్సులను పరిగణ నలోకి తీసుకోవాలి.  అక్రిడిటేషన్  అర్హతలను కచ్చితంగా నిర్ణయించాల్సిన  బాధ్యత కూడా ఉంది. ఇప్పటికైనా  నిజమైన జర్నలిస్టులు ఎవరనేది తేల్చాలి.  ఆ  బాధ్యత కూడా మీడియా అకాడమీదే. 

- వేల్పుల సురేష్,సీనియర్ జర్నలిస్ట్​