ఆధ్యాత్మికం : దేవుడి మొక్కు అంటే ఏంటీ.. ఈ మొక్కులు మేలు చేస్తాయా.. తీర్చకపోతే ఏమౌతుంది..!

మొక్కులు తీర్చుకోకపోతే దేవుడికి కోపం వస్తుందా..? కక్ష సాధిస్తాడా..? పగ పెంచుకుంటాడా..? మరోసారి కష్టం వచ్చింది తీర్చమంటే పట్టించుకోడా? భగవంతుడు కూడా మనుషుల్లాగే ప్రవర్తిస్తాడా? అసూయ, ద్వేషం, మాట తప్పడం లాంటివి దేవుడికీ వర్తిస్తాయా..!? 'అలా అయితే దేవుడెలా అవుతాడ'ని కొందరు అంటారు. 'మొక్కు తీర్చుకోకపోవడం దోషం' అని మరికొందరు అంటారు.

జీవితం అన్నాక కష్టాలు సుఖాలు వస్తూ, పోతూ ఉంటాయి. బాధ ఎక్కువైనప్పుడు, పరిస్థితి చేయి దాటి పోతున్నప్పుడు మానసిక ధైర్యం కోసం దేవుడి మీద భారం వేస్తుంటారు భక్తులు. 'ఈ గండం గట్టెక్కిచ్చు స్వామీ మీకు అది చేయిస్తాం. ఇది చేయిస్తాం. నిలువు దోపిడీ ఇస్తాం. ఆభరణాలు చేయిస్తాం' అని మరో ఆలోచన లేకుండా మొక్కుకుంటారు. ఆ సమయంలో కష్టం తప్ప మరే విషయం గురించి ఆలోచించరు. అనారోగ్యంతో బాధపడుతున్నా, పెళ్లి కాకపోయినా, ఎక్కువ కాలం పిల్లలు పుట్టక పోయినా, సమ యానికి డబ్బులు అందకపోయినా... దేవుడి మీద భారం వేస్తుంటారు. ఆ టైంలో మానసికంగా కుంగిపోయి ఉంటారు. పైగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అనుకున్నపని కావాలని తొందర్లో ఉంటారు. గుడికి వెళ్లి మొక్కుకునేవాళ్లు కొందరైతే, ఇళ్లలోనే ఉండి దేవుడికి తమ కష్టం గురించి చెప్పుకునే వాళ్లు ఇంకొందరు.

మొక్కులు మేలు చేస్తాయి

ఆపదల నుంచి గట్టెక్కించమని దేవుడిని కోరుకుంటే, దేవుడు తప్పక తీరుస్తాడు' అని భక్తులు నమ్ముతారు. కష్టాల్ని భరించలేని స్థితిలో
దేవుడిపై భారం వేయడం వల్ల మనసుకు ఓ రకమైన భరోసా లభిస్తుంది. దేవుడిని మానవ తీత బంధంలా భక్తులు భావిస్తారు కాబట్టి శరీ రంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మానసికంగా ధైర్యంగా ఉంటారు. దాంతో సరైన నిర్ణయాలు తీసుకోడానికి మనసు సిద్ధం అవుతుంది. 

ఒత్తిడి నుంచి కొంతవరకు బయట పడగలుగుతారు. ప్రశాంతత లభిస్తుంది. దాంతో సమస్యల గురించి లోతుగా ఆలోచించి, ఎవరికి వాళ్లే పరిష్కరించు కోగలుగుతారు. తోటి మనుషులు ఏ సాయం చే యకపోయినా, దేవుడు మంచి చేస్తాడు. సాయం అందిస్తాడు అనే సమ్మకం మనిషిని కచ్చితంగా ముందుకే నడిపిస్తుంది. తమకు కష్టం, సుఖం అన్ని కలిగించేది దేవుడేనని నమ్ముతారు కాబట్టి, తప్పని సరిగా మేలు చేస్తాడన్న భరోసా భక్తులను ముందుకు నడిపిస్తుంది.

తీరకపోతే...!?

కొందరు భక్తులు ఆపద వచ్చినప్పుడు భగవంతుడికి మొక్కుకుంటారు. కానీ తీరా ఆ కష్టం నుంచి బయటపడగానే మర్చిపోతారు. కొందరైతే 'చూద్దాంలే..! తీర్చుకుందాంలే!' అని తార్చారం చేస్తుంటారు. సమయం లేకపోవటం, డబ్బులు సమకూరక పోవడం వల్ల కూడా మొక్కు తీర్చడం ఆలస్యం కావచ్చు. కొందరైతే మొక్కుకోసం దాచిన డబ్బును వేరే అవసరాలకు కూడా వాడే స్తుంటారు. మరికొందరు బంధువులు, స్నేహితులు మొక్కుకున్న గుడికి లేదా దేవుడి దగ్గరకు వెళ్తుంటే, 'మా పేరు మీద హుండీలో వెయ్యి' అని చెప్పి పంపిస్తుంటారు. తీరా వాళ్లు అవసరమైతే కొంత వాడుకుని, మిగిలిన సొమ్ము హుండీలో వేస్తుంటారు. మొక్కు అనేది కూడా ఒక ప్రతిజ్ఞ లాంటిదే. అది తీర్చకపోతే నిరంతరం మనసును వేధిస్తూనే ఉంటుంది. మానసికంగా తెగ ఇబ్బంది పెడుతుంది.  దాంతో మరోసారి కష్టం వచ్చినప్పుడు దేవుడిని మొక్కుకోడానికి వెనకాడతారు. మొక్కు చెల్లించడం అంటే భగవంతుడి మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే. భక్తిశ్రద్ధలను చూపించడం లాంటిదే.

దేవుడు... భక్తులు

భగవంతుడు ఏమీ చేయకపోయినా భక్తులు మాత్రం ఫలానా సమయంలో అనుకున్న మొక్కు తీర్చకపోవడం వల్లే మళ్లీ కష్టం వచ్చిందని అను కుంటారు. మొక్కుకోసం దాచి పెట్టిన డబ్బు ఖర్చు పెట్టాం కాబట్టే ఇలా అయిందని ఆలోచిస్తా రు. కానీ నిజంగా దేవుడు మొక్కు చెల్లించలేదని కష్టాలు పెడతాడా? అంటే అది భక్తుల ఆలోచన మాత్రమే. దేవుడు శిక్షించడం. పగ తీర్చుకోవడం వంటివి భక్తుల నమ్మకం నుంచి పుట్టినవే. మొక్కు అనేది విశ్వాసంతో కూడుకున్నది. భగవంతుడికి. ...భక్తుడికి ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉండేది. నీకు అది చేశాను. ..కాబట్టి నాకు ఇది ఎందుకు ఇవ్వలేదుఅని కష్టాలు పెట్టడానికి దేవుడు బాకీలు వసూలు చేసే వ్యాపారి కాదు. అలాగని కష్టాల్లో ఉన్నప్పుడు తీర్చలేనివి, శక్తికి మించినవి, ఇతరులకు సంబంధించిన మొక్కులు కోరుకోవడం మంచిది కాదు. దేవుడు ఎవర్నీఏమీ అడగడు.

ALSO READ : కష్టాలు వెండాడుతున్నాయా... అయితే ఈ స్తోత్రాన్ని రోజూ చదవండి..

భక్తులే ఇస్తాం, చేస్తాం అని చెప్పి, తీరా ఇవ్వలేదని, చేయలేకపోతున్నామని తమలో తాము మానసికంగా బాధపడతారు. కాబట్టి భగవంతుడిపై ఉన్న విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులు పోగొట్టుకోకూడదని చెప్తారు ఆధ్యాత్మిక వేత్తలు. మొక్కు కూడా ఇచ్చినమాట నిలబెట్టుకోవడం వంటిది. మనిషి సత్ప్రవర్తనను నిర్ణయించే  ఒక గీటురాయి లాంటిదే. . . 

-వెలుగు, లైఫ్-