మూడవ ప్రపంచ యుద్ధం వస్తే..

కొన్ని దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధాలు, కొన్ని దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధాలు..  పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేండ్ల నుంచి జరుగుతున్న ఈ ప్రాంతీయ యుద్ధాలు కాస్తా మూడో ప్రపంచ యుద్ధంగా మారితే.. ప్రపంచంలో శక్తిమంతమైన రష్యా, అమెరికా, చైనా లాంటి దేశాలు ఆ యుద్ధంలో పాల్గొంటే.. అప్పుడు ప్రపంచం పరిస్థితి ఏంటి? ప్రజలు ఎటువంటి విపరీతమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? అసలు అలాంటి భీకర యుద్ధం జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? 


ప్రపంచ యుద్ధం అంటే ఆషామాషీ విషయం కాదు. ఆ విధ్వంసాన్ని భరించడం అంత ఈజీ కాదు. మొదటి ప్రపంచ యుద్ధంలో నాలుగు కోట్ల మంది పౌరులు, సైనికులు చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు ఆరు కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం వల్ల వచ్చిన అనారోగ్యం, కరువు వల్ల ఎంతోమంది ఇబ్బందిపడ్డారు. ఈ రెండు యుద్ధాల తర్వాత ప్రపంచం టెక్నాలజీలో చాలా డెవలప్‌‌‌‌ అయ్యింది. ముఖ్యంగా చాలా దేశాలు కొత్త కొత్త ఆయుధాలు సమకూర్చుకున్నాయి. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. ఆ ఆయుధాలన్నీ వాడితే.. ప్రపంచ మనుగడకు ముప్పు తప్పదు.

*   *   *

అణుయుద్ధంగా మారితే?

ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. అది కచ్చితంగా అణుయుద్ధంగానే మారుతుంది. అంటే ప్రపంచమంతా హిరోషిమా, నాగసాకికి పట్టిన గతే పడుతుంది. ప్రకృతి కోలుకోలేని దెబ్బ తింటుంది. అసలు జీవి మనుగడే సాధ్యం కాకపోవచ్చు. ఇక ప్రాణ నష్టాన్ని అంచనా కూడా వేయలేం. ఎందుకంటే పెద్ద దేశాల యుద్ధ సామర్థ్యం మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలతో పోలిస్తే చాలా ఎక్కువ. చాలా దేశాల దగ్గర కావాల్సినంత అణుశక్తి ఉంది. 

విధ్వంసమే

అణ్వాయుధాలు మనుషులు కనిపెట్టిన అత్యంత శక్తివంతమైన, విధ్వంసక ఆయుధాలు. ఇవి అంతులేని శక్తిని విడుదల చేస్తాయి. దాంతో భారీ పేలుళ్లు జరగడంతోపాటు రేడియేషన్‌‌‌‌ ఏర్పడుతుంది. అమెరికా1945లో జపాన్‌‌‌‌ మీద ఈ అణ్వాయుధాలను రెండుసార్లు ప్రయోగించింది. ఆ తరువాత మళ్లీ ఏ దేశమూ ప్రయోగించే ధైర్యం చేయలేదు. కానీ.. అప్పటినుండి కొన్ని దేశాలు వందల సార్లు పరీక్షించాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం తొమ్మిది దేశాల దగ్గరే అణ్వాయుధాలు ఉన్నాయి. 

యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా వీటిలో కొన్ని దేశాలు అధికారికంగా అణు ఆయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (న్యూక్లియర్‌‌‌‌‌‌‌‌ నాన్‌‌‌‌ ప్రొలిఫరేషన్‌‌‌‌ ట్రీటీ(ఎన్‌‌‌‌పీటీ)) ద్వారా అణ్వాయుధ దేశాలుగా గుర్తింపు పొందాయి. ఎన్‌‌‌‌పీటీ అనేది అణ్వాయుధాల వ్యాప్తిని నిరోధించడానికి, అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు వాడేలా ప్రోత్సహించడానికి చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం. అయితే, కొన్ని దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు.