కవర్ స్టోరీ : ఇండియాలో కమ్ముకొస్తున్న క్యాన్సర్.!

ఇంతకుముందు క్యాన్సర్​ కేసుల్లో ప్రపంచ దేశాల్లో ఇండియాకు కూడా ఒక ప్లేస్ ఉండేది. ఇప్పుడు అది మొదటిస్థానానికి వెళ్లే ట్రాక్​లో ఉంది అనేది ఈ మధ్య జరిగిన పరిశోధనల రిపోర్ట్​. పొగ, మందు తాగే అలవాట్ల వల్ల మగవాళ్లు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువ అనేవాళ్లు ఒకప్పుడు. కానీ, ఇలాంటి అలవాట్లు లేని ఆడవాళ్లు కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారు. అందుకు కారణాలు రకరకాలు. ఏదెలా ఉన్నప్పటికీ వయో, లింగబేధం లేకుండా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయనేది వాస్తవం. ఈ మధ్య విడుదలైన ఒక రిపోర్ట్ ప్రకారం క్యాన్సర్​ కేసులు ఇలానే పెరిగితే ప్రపంచ దేశాల్లో ఇండియా మొదటిస్థానానికి వెళ్లే ఛాన్స్ ఉంది అంటున్నారు. అదే జరిగితే... వామ్మో ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా! అందుకే ముందు జాగ్రత్త మేలు అంటున్నారు డాక్టర్లు.  ఇంతకీ క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? అవి పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇటువంటి విషయాల గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారో తెలుసు కోవాలంటే ఈ స్టోరీ చదవండి.

క్యాన్సర్ ఇప్పుడొక కామన్ వ్యాధిగా మారిపోయింది. పూర్వం ‘క్యాన్సర్’ను రాచపుండు లేదా రాచకురుపు అనేవాళ్లు.​ ఒక్కమాటలో చెప్పాలంటే అప్పట్లో క్యాన్సర్​ గురించి ఎక్కువమందికి తెలియదు కూడా. టెక్నాలజీ లేని కాలంలో ఆరోగ్యకరమైన తిండి తినేవాళ్లు. చెమటోడ్చి పనిచేసేవాళ్లు. అంటే... తినే తిండి... శారీరక కష్టం... రెండూ సమానంగా ఉండేవి. కాబట్టి జబ్బుల బారిన అంత తేలికగా పడేవాళ్లు కాదు. చాలామంది వందేళ్లు బతికేవాళ్లు. మరి ఇప్పుడు ఏళ్ల తరబడి బతకడం సంగతి పక్కనపెడితే... బతికినన్నాళ్లు ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకుంటున్నారు. పూర్వం రోజుల్లో రెండు మూడు తరాలను చూసుకుని తృప్తిగా జీవితాన్ని ముగించేవాళ్లు. కానీ, ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. 

పాతికేండ్లు నిండాయో లేదో బీపీ, షుగర్​, టీబీ, ఒబెసిటీ, ఆస్తమా... ఇలా ఏదో ఒక దీర్ఘకాలిక(క్రానిక్) రోగాలు పలకరిస్తున్నాయి. వాటిని కంట్రోల్​లో ఉంచుకునేందుకు నెలల తరబడి హాస్పిటల్స్​ చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ రోగాలన్నీ ఒక ఎత్తయితే క్యాన్సర్​ జబ్బుది మరో ఎత్తు. క్యాన్సర్​ అని తెలిస్తే చాలు.. ‘ఉన్నన్నాళ్లు వాళ్లకు నచ్చినవి చేసి పెట్టండి. వాళ్ల కోరికలు తీర్చండి’ అనే మాటలతో బాధపెడుతుంటారు కొందరు. ‘‘క్యాన్సర్​ అని తెలియడం ఆలస్యం జీవితం అనే పుస్తకంలో చివరి పేజీకి వచ్చేసినట్టు  కాదు. అలాంటి ఆలోచనలేం పెట్టుకోవద్దు. క్యాన్సర్​ అనేది ఒక రోగం మాత్రమే. ఆ రోగానికి మందులు ఉన్నాయి. ట్రీట్​మెంట్ ఉంది. స్పెషలిస్ట్​ డాక్టర్లు ఉన్నారు. రోగాన్ని తగ్గించి పూర్తి ఆరోగ్యవంతుల్ని చేస్తారు’’ అని ఎంతో మంది, ఎన్ని రకాలుగా చెప్తున్నా... ఈ జబ్బు బారిన పడిన వాళ్లలో భయపడే వాళ్ల సంఖ్య తగ్గడంలేదు. 

అందుకు కారణం.. క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన జబ్బు. ఒంట్లోకి ఒకసారి వచ్చి చేరిందంటే తగ్గడం కష్టం. అసలు క్యాన్సర్​ నాకే ఎందుకు వచ్చింది? ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నా... కానీ పూర్తిగా తగ్గిపోతుందా? ట్రీట్​మెంట్ తీసుకుంటుంటే ఒకరోజు చాలా యాక్టివ్​గా, ఇంకోరోజు ఒంట్లో శక్తి లేనట్టు ఉంటోంది. ఇలా రోజుకి ఒకలా ఎందుకు అనిపిస్తుంది? శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయి? వంట్లో ఇంకెక్కడికైనా పాకిందా? అంటూ బుర్ర నిండా బోలెడు ప్రశ్నలు కమ్ముకోవడమే. ఇలాంటి ఆలోచనలతో మానసికంగా సగం డీలా పడిపోతారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తికి ట్రీట్​మెంట్ చేస్తే సరిగా స్పందించలేరు. ఇక రోగం ఎలా కంట్రోల్​కి వస్తుంది? ఇప్పుడు క్యాన్సర్​కు అడ్వాన్స్​డ్​ ట్రీట్​మెంట్స్​ ఎన్నో ఉన్నాయి. అందుకని ‘క్యాన్సర్​ బారిన ఎందుకు పడ్డానా?’ అని ఆలోచించకుండా ట్రీట్​మెంట్​ తీసుకుంటూ... మానసికంగా, శారీరకంగా హెల్దీ లైఫ్​ స్టయిల్​ ఫాలో అవ్వాలి అంటున్నారు డాక్టర్లు. 

క్యాన్సర్​ వచ్చాక మంచి ట్రీట్​మెంట్ అందుబాటులో ఉంది. అది ఓకే. కానీ క్యాన్సర్​ బారిన పడకుండా జాగ్రత్తపడితే ఇంకా బాగుంటుంది కదా! ‘‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్’’​ అంటున్నారు డాక్టర్లు. అదెలానో వివరంగా తెలుసుకుందాం. ఏ విషయంలోనైనా సమస్య ఎక్కడ మొదలైందో తెలిస్తే అక్కడే ఫుల్​ స్టాప్​ పెట్టొచ్చు. అదే సూత్రం క్యాన్సర్​ జబ్బుకి కూడా వర్తిస్తుంది. సమస్య ఎక్కడ మొదలైందో తెలిస్తే అప్పుడు దాన్ని వ్యాప్తి చెందకుండా చెక్​ పెట్టొచ్చు. మరి ఇక్కడ సమస్యలేంటి? ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి? అంటే.. వాటిలో మొదటిగా చెప్పుకోవాల్సింది వాతావరణ మార్పులు. 

వాతావరణ ప్రభావం

విపరీతమైన ఎండలు, అకాల వర్షాలు, మంచు తుపాన్​లు వంటివి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. వాతావరణంలో ఇలాంటి మార్పులు చోటుచేసుకునేందుకు ప్రధాన కారణం... పొల్యూషన్​(కాలుష్యం). దీనివల్ల లంగ్, స్కిన్ క్యాన్సర్లు పెరుగుతున్నాయి. అయితే ఈ పొల్యూషన్స్​లో చాలా రకాలున్నాయి. అది ఏ రకమైన పొల్యూషన్​ అయినా ప్రమాదకరమే. మరీ ముఖ్యంగా కాలుష్య పూరిత​ వాతావరణంలో పెరిగిన ఆకుకూరలు, కాయగూరలుఆహారంగా తినడం వల్ల డయాక్సిన్స్ అనేవి పెరుగుతున్నాయి. వాటిని ఈడీసీ(ఎండోక్రైన్ డిస్​రప్టివ్​ కెమికల్స్)లు అంటారు. అవి ఎండోక్రైన్(వినాళగ్రంథి)​ పనిని చెడగొడతాయి. ఇలా అందరిలోనూ జరగకపోవచ్చు. కానీ, ఎవరికైనా జెనెటిక్(జన్యుపరం)​గా ఉంటే వాళ్లలో వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు క్యాన్సర్​ కారకం జన్యుపరంగా ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు సరైన ఆహారం తినాలి. డైట్​ సరిగా లేకపోవడం వల్ల ఈ మధ్య కోలన్ క్యాన్సర్లు పెరుగుతున్నాయి. 

అలాగే ప్లాస్టిక్ వాడకం కూడా రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతోంది. ప్లాస్టిక్​ వాడకం మీద నియంత్రణ ఉండాలి. కానీ, అది జరగట్లేదు. వాడే వస్తువుల్లో చాలా వరకు ప్లాస్టిక్​ కలిసినవే ఉంటున్నాయి. శానిటరీ ప్యాడ్స్​లో కూడా ప్లాస్టిక్​ ఉంది. ఇలాంటి ప్యాడ్స్​ వాడడం వల్ల వెజైనా, యుటిరస్ ద్వారా రసాయనాలు ఒంట్లోకి చేరతాయి. అవి ఫైబ్రాయిడ్స్​, పీసీఒఎస్​, ఎండో మెట్రియల్ క్యాన్సర్లకు కారణం అవుతున్నాయి. ఈ మధ్య థైరాయిడ్ క్యాన్సర్లు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ప్రస్తుతం వీటన్నింటినీ అవాయిడ్ చేయలేని పరిస్థితుల్లో బతుకుతున్నాం. అందుకని ముఖ్యంగా ఆడవాళ్లు ప్లాస్టిక్​కి దూరంగా ఉండాలి. 

అలవాటు తప్పిన ఆహారం!

పూర్వం మంచి తిండి తినేవాళ్లు. ప్రకృతిలో పండినవన్నీ ఇష్టంగా తినేవాళ్లు. ఇప్పుడు చాలామందికి  తాతముత్తాతలు తిన్న ఆహార పదార్థాల పేర్లు చాలా వరకు తెలియనే తెలియవు. కనీసం వాటిని చూసి కూడా ఉండరు. ఇలాంటి పరిస్థితిలో వాటిని ఇంకేం తింటారు? అన్నం తినడానికి అలవాటు పడి శరీరంలో కార్బోహైడ్రేట్లు పెంచుతున్నారే తప్ప... తిన్న దానికి తగ్గ శారీరక శ్రమ చేయడంలేదు. ఒత్తిడి  తగ్గించుకోవడానికి స్వీట్లు, రుచి​ కోసం మసాలా​లతో వండిన బిర్యానీలు, రంగు రంగుల ఐస్ క్రీమ్స్​ తింటున్నారు. అదికూడా టైం కానీ టైంలో తింటున్నారు. 

ఇలాంటి అన్​హెల్దీ అలవాట్ల వల్ల చేజేతులా ఎవరికి వాళ్లే ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. మామూలుగా అయితే శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ సిస్టమ్)​ ఎప్పటికప్పుడు అసాధారణ కణాలను గుర్తించి అవి క్యాన్సర్​గా డెవలప్​ కాకుండా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తుంటుంది. అటోఇటో తప్పించుకుని ఒకవేళ ట్యూమర్​ (కణితి) ఏర్పడినా... దాంతో గట్టిగా ఫైట్​ చేస్తుంది కాబట్టి నో ప్రాబ్లమ్​. క్యాన్సర్​ బారిన పడిన కొందరిలో ట్యూమర్​ లోపల, దాని చుట్టుపక్కల ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి. వీటినే ట్యూమర్ ఇన్​ఫిల్​ట్రేటింగ్​ లింఫోసైట్స్ (టీఐఎల్) అంటారు. ఇలాంటి కణాలతో కూడిన కణితులు ఉన్నవాళ్లు క్యాన్సర్ నుంచి బాగా కోలుకుంటుంటారు. 

క్యాన్సర్​ బారిన పడుతున్న వాళ్లలో50 ఏండ్ల లోపు వయసు వాళ్లు ఉండడం ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. మూడు దశాబ్దాల నుంచి రొమ్ము, పెద్దపేగు, అన్నవాహిక, కిడ్నీ, కాలేయ, క్లోమ క్యాన్సర్లు వంటివి పెరిగినట్టు 2022లో చేసిన ఒక స్టడీలో తేలింది. ఆహారం, జీవన విధానం, అధిక బరువు, వాతావరణ పరిస్థితుల ప్రభావం, పేగుల్లో సూక్ష్మజీవుల తీరుతెన్నులు మారిపోవడం అందుకు కారణాలుగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హెల్దీ డైట్, ఫిజికల్ ఫిట్​నెస్, నిద్ర తగ్గిపోయాయని.. దానికి తోడు మద్యం తాగే అలవాటు పెరిగిందని సైంటిస్ట్​లు గుర్తు చేస్తున్నారు. చిన్న వయసులోనే బయటపడుతున్న14 రకాల క్యాన్సర్లలో ఎనిమిది రకాల క్యాన్సర్లు జీర్ణకోశానికి సంబంధించినవే! మనం తినే తిండి పేగుల్లోని సూక్ష్మ క్రిములకు కూడా ఆహారంగా ఉపయోగపడటమే కాకుండా సూక్ష్మక్రిముల తీరుతెన్నుల మీద​ నేరుగా ప్రభావం చూపుతుంది. కాబట్టి అది చివరికి జబ్బుల ముప్పు పెరగడానికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు ఎక్స్​పర్ట్స్​. 

ఆడవాళ్లలో ఆ మూడు

ఆడవాళ్లలో బ్రెస్ట్, సర్విక్స్, ఒవేరియన్... ఈ మూడు రకాల క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇవి ఎక్కువగా ఎందుకొస్తున్నాయంటే.. బ్రెస్ట్ క్యాన్సర్.. రావడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉంటున్నాయి. వాటిలో ఒకటి జన్యుపరంగా, రెండోది సరైన ఆహారం తినకపోవడం. పిల్లలు కలగని, ఆలస్యంగా కలిగిన వాళ్లలో కూడా ఈ క్యాన్సర్​ రిస్క్​ ఉంటోంది. ఈ కారణాలకు తోడు పొల్యూషన్ కూడా బ్రెస్ట్​ క్యాన్సర్​కు కారణం అవుతోంది. అయితే బ్రెస్ట్ క్యాన్సర్​ను గుర్తించడం చాలా ఈజీ. బ్రెస్ట్​లో లంప్స్(గడ్డలు) ఉన్నా, చనుమొనల నుంచి సెక్రేషన్స్(స్రావాలు) వచ్చినా వెంటనే కనిపెట్టొచ్చు. అలాగే క్యాన్సర్​ వచ్చిందని తెలిశాక కంగారు పడాల్సిన అవసరం లేదు. హై క్వాలిటీ ట్రీట్​మెంట్ అందుబాటులో ఉంది. అలాగే ముందుగానే గుర్తించేందుకు కొన్ని టెస్ట్​లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్​లో బీఆర్​సీ1 లేదా2 పాజిటివ్ వచ్చినవాళ్లలో తల్లి నుంచి పిల్లలకు వస్తే ప్రొఫైలాక్టిక్​ లేదా క్యాన్సర్ ప్రివెంటివ్ సర్జరీలు చేస్తారు. క్యాన్సర్​ రావడానికి కారణాలు కనుక్కుంటే వాటికి తగ్గ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. 


ఒవేరియన్ క్యాన్సర్.. ఇన్​ఫెర్టిలిటీ వల్ల వస్తుంది. ప్రెగ్నెన్సీ లేటుగా రావడం, ప్రెగ్నెన్సీ కోసం చేసే ట్రీట్​మెంట్​ వల్ల ఓవరీస్​ స్టిమ్యులేట్ అవుతాయి. దానివల్ల కూడా ఒవేరియన్​ క్యాన్సర్​ బారిన పడే అవకాశం ఉంది. వీటిని మాత్రం డాక్టర్లే కనుక్కోగలరు. టీనేజర్స్ విషయానికి వస్తే క్యాన్సర్ సెల్స్  అగ్రెసివ్​గా ఉంటాయి. కాబట్టి వెంటనే విపరీతంగా పెరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వెంటనే ట్రీట్​మెంట్ తీసుకోవాలి. 

సర్వైకల్ క్యాన్సర్​.. ఇది హ్యూమన్​ పాపిలోమా వైరస్ (హెచ్​పీవీ) ఇన్​ఫెక్షన్ వల్ల వస్తుంది. సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే హెచ్​పీవీ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వీనల్, వెజైనల్, తల, మెడ వంటి భాగాల్లో వచ్చే క్యాన్సర్లను కొన్నింటిని నివారించొచ్చు. సర్వైకల్ క్యాన్సర్ కనిపెట్టడానికి రెగ్యులర్​గా పాప్​స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ టెస్ట్​లో క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయంటే... ప్రి – క్యాన్సర్ స్టేజ్​లోనే కనిపెట్టొచ్చు. అంతేకాదు.. డయాబెటిస్​, ఒబెసిటీ ఉన్నవాళ్లు ఈ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. అలా చేయించుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు. డయాబెటిస్​, ఒబెసిటీ ఉన్న వాళ్లలో పీసీఓఎస్ ఉంటే వాళ్లలో ఎండోమెట్రిక్ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ. 

ఈ మూడు క్యాన్సర్లతో పాటు యుటిరైన్ క్యాన్సర్లు కూడా వస్తున్నాయి. ఒబెసిటీ, హైపర్ టెన్షన్, డయాబెటిస్​ మూడు ఉన్నవాళ్లకు యుటిరైన్ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో కూడా ఎండోమెట్రియల్​ క్యాన్సర్ ఛాన్స్​ పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో పరీక్షల్లో క్యాన్సర్లు త్వరగా గుర్తించగలుగుతున్నారు. కాబట్టి ఈ క్యాన్సర్​ కేసుల లెక్క బయటకు తెలుస్తోంది. అలాగే అందుకు తగ్గట్టు అడ్వాన్స్​డ్​ ట్రీట్​మెంట్ అందుతోంది. దాంతో జీవిత కాలం కూడా పెరుగుతోంది. 

మగవాళ్లలో...  లంగ్ క్యాన్సర్

లంగ్ క్యాన్సర్, టీబీ లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. దగ్గు, జ్వరం, కళ్లె (కఫం) లో రక్తం పడటం, బరువు తగ్గటం, ఆయాసం వంటివి కనిపిస్తాయి. దీంతో క్యాన్సర్​ను గుర్తించేసరికి ఆలస్యం అవుతుంది. లంగ్ క్యాన్సర్​ ఉంటే మొదటి స్టేజ్​లో పొడి దగ్గు వస్తుంది. మూడు వారాలు దాటినా దగ్గు తగ్గకపోతే ఆలస్యం చేయకుండా డాక్టర్​ని కలవాలి. ఈ విషయంలో పొగ తాగే అలవాటు ఉన్నవాళ్లు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. కొందరికి తొలిదశలో దగ్గు ఉండదు. దగ్గు, ఆయాసం వచ్చేసరికి జబ్బు ముదిరిపోతుంది. కొందరిలో దగ్గుతోపాటు కళ్లె పడొచ్చు. కళ్లెలో రక్తం చారలు కనిపిస్తాయి. అంటే అప్పటికే జబ్బు ముదిరిపోయినట్టు. దగ్గుతోపాటు రోజంతా జ్వరం. అకస్మాత్తుగా బరువు తగ్గడం... అంటే ఒకటి నుంచి రెండు నెలల్లో మూడు కిలోల వరకు తగ్గడం. గాలి గొట్టాలు మూసుకుపోయి, ఊపిరితిత్తుల చివరి భాగం సగం లేదా పూర్తిగా దెబ్బతినడం వల్ల ఆయాసం వస్తుంది. దాదాపు 60 శాతం మందిలో ఛాతి నొప్పి, అసౌకర్యం ఉంటాయి. కొందరిలో బొంగురు గొంతు ఒక్కటే కనిపిస్తుంది. దగ్గినప్పుడు శబ్దం రాదు. లంగ్​ క్యాన్సర్ నాలుగో దశకి వచ్చిందంటే క్యాన్సర్​ ఇతర భాగాలకు వ్యాపించి.... ఆ భాగాల్లో కూడా లక్షణాలు కనిపిస్తాయి. 

కారణాలు

  •     సిగరెట్, చుట్ట, బీడీ తాగడం. గుట్కా, జర్దా వంటివి తినడం, నమలటం వల్ల అవి శ్వాసనాళం లేదా రక్తం ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటాయి. ఆ తరువాత నెమ్మదిగా జన్యువుల పనితీరును దెబ్బతీసి ట్యూమర్స్​కు దారితీస్తాయి.
  •     కాలుష్యం వల్ల 3 –5 శాతం ఎఫెక్ట్ అవుతున్నారు. కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగలతో 2 –3 శాతం క్యాన్సర్​ బారిన పడుతున్నారు. 
  •     దాదాపు 2 శాతం వరకు జన్యువులు కారణం అవుతున్నాయి.
  •     పొగాకు మానేయాలి. పొల్యూషన్​కి దూరంగా ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఫుడ్ తినాలి. ఎక్సర్​సైజ్ చేయాలి. ప్రి –స్క్రీనింగ్ చేయించుకోవాలి. అన్నింటికీ మించి అవేర్​నెస్ అనేది చాలా ముఖ్యం.

ప్రొస్టేట్ క్యాన్సర్

ప్రపంచవ్యాప్తంగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు పెరిగిపోతున్నాయి. 2020 నుంచి 2040 మధ్య కాలంలో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ వల్ల చనిపోయే వాళ్ల సంఖ్య కూడా 85 శాతం పెరగవచ్చని ఒక స్టడీ అంచనా వేసింది. అల్ప, మధ్య ఆదాయ దేశాలపై ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ భారం ఎక్కువగా ఉంటుందని చెప్పింది ఆ స్టడీ. జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. వాళ్లల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.50 ఏళ్లు దాటిన పురుషులకు ఈ క్యాన్సర్‌ రిస్క్‌ ఎక్కువ. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని, ముందస్తు చర్యలు చేపట్టాలని లాన్సెట్‌ పరిశోధకులు సూచించారు. 

ప్రొస్టేట్​ క్యాన్సర్​ను త్వరగా గుర్తించడం, ప్రజల్లో అవగాహన పెంచడం అవసరం. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలపై పేద, మధ్య ఆదాయ దేశాల్లోని వాళ్లకి సరైన అవగాహన ఉండదని వాళ్లు చెప్తున్నారు. అలాగే, ఈ క్యాన్సర్‌ వెన్నుకు పాకడం వల్ల ఎముకల్లో నొప్పి వంటి వాటిని సరిగా కనిపెట్టలేరు. పేద దేశాల్లో చికిత్సకు అవకాశాలను పెంచాలి. ప్రస్తుతం ఏటా14 లక్షల మంది ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బారిన పడుతున్నారని, 2020లో దీని కారణంగా 3.75 లక్షల మంది మరణించారని చెప్పారు. 2040 నాటికి ఏటా నమోదయ్యే కేసుల సంఖ్య 29 లక్షలకు, మరణాల సంఖ్య ఏడు లక్షలకు పెరగవచ్చనేది వాళ్ల అంచనా.

అది మామూలే..

మగవాళ్లలో 50 ఏండ్లు దాటిన తర్వాత ప్రొస్టేట్ గ్రంథి ఉబ్బటం మామూలే. చాలామంది అది క్యాన్సర్​ అనుకొని భయపడుతుంటారు. కానీ, అది నిజం కాదు. అయితే, ప్రొస్టేట్ గ్రంథి ఉబ్బటానికి కచ్చితమైన కారణాలు తెలియదు. మూత్రాశయానికి కిందివైపు మూత్రనాళం చుట్టూ లింక్​ అయ్యి ఉండే ఇది పెరుగుతూ వస్తుంది. అందువల్ల మూత్రాశయం, మూత్రనాళం మీద ఒత్తిడి పడుతుంది. దాంతో మూత్రం ధార సన్నబడటం, తరచూ విసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకుండా ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్​ని సంప్రదించాలి. కొన్ని టెస్ట్​ల ద్వారా సమస్యను గుర్తించి ఏం చేయాలో చెప్తారు. ట్రీట్​మెంట్ తీసుకోకపోయినా కొన్ని సింపుల్ ట్రిక్స్‌ తో ఇబ్బంది నుంచి బయటపడొచ్చు అంటున్నారు ఎక్స్​పర్ట్స్. 

  •     పడుకోవడానికి దాదాపు రెండు గంటల ముందు నీళ్లు లేదా ద్రవాలు తీసుకోకూడదు.
  •     బయటకు వెళ్లినప్పుడు, ప్రయాణానికి ముందు ద్రవాలు మితంగా తీసుకోవాలి.
  •     యూరిన్ వస్తున్నట్టు అనిపిస్తే వెంటనే వెళ్లాలి.
  •     యూరినేషన్ సమయాలను డిసైడ్ చేసుకోవాలి. మూత్రం వస్తున్నట్టు అనిపించకపోయినా ఆ టైంకి బాత్​రూమ్​కి వెళ్లాలి. కాస్త టైం పట్టినా పర్వాలేదు. మూత్రాశయం పూర్తిగా ఖాళీ చేయాలి. 
  •     జలుబు, ముక్కు దిబ్బడ, అలర్జీ తగ్గడానికి వాడే యాంటీ హిస్టమైన్ల వంటి మందుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి మూత్రం ధార మరింత సన్నబడేలా చేయొచ్చు. మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకుండా అడ్డుపడొచ్చు. 
  •     ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే చక్కెర మోతాదు తగ్గించాలి. కొవ్వు తక్కువగా ఉన్న మాంసం తినాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. అవిసె గింజలు వేగించి, సోంఫు కలిపి తీసుకుంటే యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అందుతాయి. రోజుకి రెండుసార్లు గ్రీన్​ టీ తాగాలి. విటమిన్ – డి ఉండాలి. క్యాన్డ్​, కలర్డ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, బార్బెక్యూలు ఎంత తక్కువగా తింటే అంత మంచిది. అసలు తినకపోతే ఇంకా మంచిది.

 - డాక్టర్ మంజుల అనగాని
క్లినికల్ డైరెక్టర్ &
 హెచ్​ఓడీ 
అరెటె హాస్పిటల్స్ 
హైదరాబాద్