కాలుష్యం తప్పదా?

కొన్నేళ్లుగా భూమి వేడెక్కుతోంది. ఎండాకాలంలో వానలు కురుస్తున్నాయి. వానాకాలంలో తట్టుకోలేనంత ఎండలు కాస్తున్నాయి. మహాసముద్రాల్లో మంచు కరిగిపోతోంది. భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. ఇలా వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. అందుకే ప్రపంచ దేశాలు, సంస్థలు వాతావరణాన్ని కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మరి 2024లో వాతావరణ పరిస్థితి ఎలా ఉండబోతోంది? 

ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు అంటుంటారు పెద్దలు. కానీ.. ఆ ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర ఎన్విరాన్‌‌‌‌‌‌మెంట్‌‌దే. అందుకే మంచి వాతావరణమే మనం ముందు తరాలకు ఇచ్చే వెలకట్టలేని ఆస్తి అంటున్నారు పర్యావరణవేత్తలు. అందుకే పర్యావరణాన్ని కాపాడేందుకు దశాబ్దాలుగా ప్రభుత్వాలు కొత్త విధానాలను తీసుకొస్తూనే ఉన్నాయి. ఆ విధానాల వల్ల కొంత మార్పు కనిపిస్తోంది. అయినా.. కొన్నేండ్ల నుంచి వరదలు, కరువు, అడవులు కాలిపోవడం లాంటివి చూస్తూనే ఉన్నాం. 2024లో ఇలాంటి సమస్యలు మరిన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు.

ఫాజిల్‌‌ ఫ్యుయెల్స్‌‌

పెట్రోలియం, నేచురల్‌‌ గ్యాస్‌‌, బొగ్గు.. ఇలాంటి వాటిని మనం అవసరం ఉన్నదానికంటే ఎక్కువగా వాడితే భవిష్యత్తుకు ప్రమాదం తప్పదు అంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. ఎందుకంటే.. వీటిని మండించడం వల్ల వాతావరణం చాలా కలుషితం అవుతోంది. దాదాపు 75 శాతం వాతావరణ మార్పులు వీటి వల్లే వస్తున్నాయి. గ్రీన్‌‌హౌస్ గ్యాస్‌‌ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. 

2024లో కూడా ఇదే ప్రధాన సమస్యగా మారనుంది. అమెరికా లాంటి అభివృ​ద్ధి చెందిన దేశాలు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నాయి. వనరులను అవసరానికి మించి వాడకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. గ్యాస్, బొగ్గుని ఉపయోగించి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్‌‌ చేయడం తగ్గించాలి. విండ్‌‌, హైడ్రో పవర్‌‌‌‌ని ఎక్కువగా ప్రొడ్యూస్‌‌ చేయాలి. 

హిమానీ నదాలు 

టిబెటన్ పీఠభూమి, దాని చుట్టుపక్కల ఉన్న పర్వత ప్రాంతాలు సుమారు 2 బిలియన్ల మంది జీవితాల్లో భాగంగా ఉన్నాయి. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రీసెర్చర్లు చేసిన స్టడీలో హిమాలయాల్లోని మంచు త్వరగా కరుగుతోందని తేలింది. దాంతో భూమి కోతకు గురవుతుంది. వాతారవణంలో మార్పులు వస్తున్నాయి. మంచు కరగడం వల్ల నదుల్లో నీటిశాతం పెరుగుతుంది. హిమాలయ పర్వతాల్ని ఆనుకుని అనేక నదులు పుట్టుకొస్తున్నాయి. వీటిని ప్రోగ్లేషల్ లేక్స్ అంటారు. 2000–2020 మధ్య ఇలాంటి నదులు 47 శాతం పెరిగాయి. వాటిలో నీళ్లు పెరిగితే మంచిదే. కానీ, మంచు కరగడమే  పెద్ద సమస్యగా మారింది. 2024లో కూడా ఈ సమస్య కొనసాగుతుందని ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంటున్నారు. 

ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌ పొల్యూషన్‌‌ 

పెట్రోల్‌‌ వాడకం తగ్గించేందుకు చాలా దేశాలు ఎలక్ట్రిక్‌‌ వెహికల్స్‌‌ వాడాలని చెప్తున్నాయి. కానీ.. ప్రస్తుతం కాలుష్యాన్ని తగ్గించినా భవిష్యత్తులో పర్యావరణ విపత్తులకు కారణం అవుతుందని రీసెర్చర్లు చెప్తున్నారు. ఎలక్ట్రిక్‌‌ వెహికల్స్‌‌లో వాడే బ్యాటరీలు తయారు చేయడానికి ఎక్కువగా లిథియం వాడతారు. బ్యాటరీలకు డిమాండ్‌‌ పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా లిథియం మైనింగ్ విపరీతంగా పెరిగింది. 

భూమి నుంచి ఇలాంటి ఖనిజాలను తవ్వడం వల్ల నేల క్షీణత, నీటి కొరత, జీవవైవిధ్య నష్టం, పర్యావరణ వ్యవస్థ పనితీరు దెబ్బతినడం, గ్లోబల్ వార్మింగ్‌‌ తప్పవు అంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. లిథియంని ఎక్స్‌‌ట్రాక్ట్‌‌ చేసే పద్ధతిలో పెద్ద మొత్తంలో నీళ్లు వాడతారు. చిలీలోని అటాకామా సాల్ట్ ఫ్లాట్స్‌‌లో లిథియం తయారీకి రోజుకు సుమారు 21 మిలియన్ లీటర్ల నీటిని వాడుతున్నారు. 

ఒక టన్ను లిథియం ఉత్పత్తి చేయడానికి దాదాపు 2.2 మిలియన్ లీటర్ల నీరు అవసరం. 2024లో ఈ బ్యాటరీల అవసరం మరింత పెరుగుతుంది. కాబట్టి నీటివాడకం కూడా పెరిగే అవకాశం ఉంది.  పైగా కొన్ని రకాల ఎలక్ట్రిక్‌‌ వెహికిల్స్‌‌ ఎక్కువ బరువు ఉండడం వల్ల టైర్లు ఎక్కువగా అరుగుతుంటాయి. దీనివల్ల  గాలి నాణ్యత తగ్గుతుంది. ఇంపీరియల్ కాలేజ్ లండన్ నివేదిక ప్రకారం.. టైర్ వేర్ పార్టికల్స్ నుండి విష రసాయనాలు విడుదలవుతాయి. అందులో పాలీరోమాటిక్ హైడ్రోకార్బన్‌‌లు, బెంజోథియాజోల్స్, జింక్, సీసం లాంటి హానికరమైన పదార్థాలు ఉంటాయి. 

గ్యాస్ ఫ్లేరింగ్‌‌

పెట్రోలియంని వెలికితీసే ప్రక్రియలో గ్యాస్ ఫ్లేరింగ్ చేస్తుంటారు. దీనివల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. 2024లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ గ్యాస్ ఫ్లేరింగ్‌‌ వల్ల కార్బన్ డయాక్సైడ్, మీథేన్, బ్లాక్ కార్బన్, కార్సినోజెనిక్ లాంటివి విడుదల అవుతాయి. అందుకే నార్వే వంటి కొన్ని దేశాలు గ్యాస్ ఫ్లేరింగ్‌‌ను తగ్గించాయి. కానీ..  గల్ఫ్ దేశాల్లో గ్యాస్‌‌ ఫ్లేరింగ్‌‌ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఇరాక్, ఇరాన్, కువైట్‌‌లలో ఇవి చాలా ఎక్కువ. ఈ కాలుష్యం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. 

మన దేశంలో 

మన దేశం విషయానికి వస్తే.. ఈ మధ్య గాలి కాలుష్యం బాగా పెరిగింది. ప్రపంచంలో అత్యధిక గాలి కాలుష్యం ఉన్న నగరాల్లో మన దేశ నగరాలు కూడా ఉన్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్‌‌ని తీసుకొచ్చింది. దీని పరిధిలోకి వచ్చే నగరాల్లో పర్టిక్యులేట్ మ్యాటర్‌‌‌‌ని 2026 నాటికి 40% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024 పూర్తయ్యేనాటికి 20 నుండి 30% తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయినా.. 2024లో గాలి కాలుష్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పవని ఎక్స్‌‌పర్ట్స్ అంటున్నారు.