టిబెట్లో భూకంపం..126 మంది మృతి.. తరచూ భూకంపాలకు కారణమేంటి ?

  • మరో 200 మందికి గాయాలు
  • 27 గ్రామాలపై ప్రభావం.. వెయ్యికిపైగా కూలిన ఇండ్లు
  • శిథిలాల కింద మరికొంతమంది
  • నేపాల్ బార్డర్​లో భూకంప కేంద్రం
  • రిక్టర్ స్కేల్​పై 7.1గా తీవ్రత నమోదు
  • నిమిషాల వ్యవధిలో మూడు భూకంపాలు.. చైనా, భూటాన్, బంగ్లాదేశ్​లోనూ భూ ప్రకంపనలు
  • ఇండియాలో బెంగాల్, బిహార్, అస్సాంలోనూ కంపించిన భూమి

న్యూఢిల్లీ: నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌ – టిబెట్‌‌‌‌ సరిహద్దుల్లో పెను భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం నిమిషాల వ్యవధిలోనే మూడుసార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలంతా భయంతో బయటికి పరుగులు తీశారు. టిబెట్‌‌‌‌లో ఇప్పటి వరకు 126 మంది చనిపోయారు. సుమారు 200 మంది వరకు గాయపడినట్లు చైనా అధికారిక మీడియా ప్రకటించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. వెయ్యికి పైగా భవనాలు కూలిపోవడంతో వాటి శిథిలాల మరికొంతమంది ఉండొచ్చని టిబెట్ అధికారులు చెప్తున్నారు. రిక్టర్‌‌‌‌ స్కేల్‌‌‌‌పై భూకంప తీవ్రత అత్యధికంగా 7.1గా నమోదైంది.

చైనాలోని ఎత్తైన ప్రాంతంతో పాటు నేపాల్, టిబెట్​లో ఈ భూకంపం సంభవించింది. ఇండియాలోని బెంగాల్, బీహార్‌‌‌‌, ఢిల్లీ, అస్సాం పరిసర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. భూటాన్‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌లోని పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. టిబెట్​లో అగ్నిమాపక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాల్లో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు.

రంగంలోకి డిజాస్టర్ రెస్క్యూ బృందాలు
టిబెట్లో భూకంపానికి తీవ్రంగా ప్రభావితమైన గ్రామాల్లో చైనా ప్రెసిడెంట్ జిన్​పింగ్ ఆదేశాల మరకు 1,500 ఫైర్​ఫైటర్స్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఈమేరకు లెవల్ 2 ఎమర్జెన్సీ ప్రకటించారు. కాటన్ టెంట్లు, కాటన్ కోట్లు, ఫోల్డింగ్ బెడ్లు వంటి 22వేల డిజాస్టర్ రిలీఫ్ ఐటెమ్స్ ను ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దానికి అనుగుణంగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. రిమోట్ గ్రామాలు కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. షిగాట్సే సిటీ టిబెట్ పవిత్ర నగరాల్లో ఒకటిగా పరిగణిస్తారు. చైనాపై తిరుగుబాటుకు ముందు బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా ఇక్కడే ఉండేవారు. ఇప్పటికీ దలైలామా మద్దతుదారులు ఇక్కడే నివాసం ఉంటున్నారు.

నేపాల్పై స్వల్ప ప్రభావం
నేపాల్లోనూ భూమి కంపించింది. అయితే, అక్కడ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. భూమి కంపించిన వెంటనే ప్రజలంతా ఇండ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. కవ్రేపలాంచ్‌‌‌‌వోక్, సింధుపాలంచోక్ ధాడింగ్, సోలుఖుంబు జిల్లాల్లో భూమి కంపించింది. ఖాట్మాండులో చెట్లు, ఎలక్ట్రిక్ పోల్స్, వైర్లు కొన్ని క్షణాల పాటు కదలడం అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. భూకంప కేంద్రం టిబెట్​లో ఉండటంతో నేపాల్ లో తీవ్రత చాలా తక్కువ ఉందని అక్కడి అధికారులు వివరించారు.

తరుచూ భూకంపాలకు కారణమేంటి?
భూ ఫలకాల్లో మార్పులు సంభవించినప్పుడల్లా ఇక్కడ భూకంపాలు సంభవిస్తుంటాయి. నేపాల్, టిబెట్, భూటాన్, చైనాలోని ఎత్తైన ప్రాంతాలపై దీని ప్రభావం ఉంటుంది. ఇండియన్‌‌‌‌, యూరేషియన్‌‌‌‌ ఫలకాల మధ్య రోజూ జరుగుతున్న ఘర్షణలే.. ఈ భూకంపాలకు కారణం అవుతున్నాయి. ఈ ఫలకాల మధ్య రాపిడి కారణంగానే హిమాలయాలు ఏర్పడ్డాయి. భవిష్యత్‌‌‌‌లోనూ భూకంప ప్రమాదాలు పొంచి ఉన్నాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. తాజాగా భూకంపం కూడా నేపాల్‌‌‌‌–భూటాన్‌‌‌‌ సరిహద్దులో.. ఎవరెస్టు శిఖరానికి కొద్ది దూరంలోనే సంభవించింది. ఈ ప్రాంతాన్ని లాసా రీజియన్ అంటారు. ప్రపంచం మొత్తంలో.. తరుచూ భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో లాసా రీజియన్ ఒకటి.

ఎవరెస్ట్​కు 80 కి.మీ. దూరంలో..
ఎవరెస్ట్ శిఖరానికి 80 కిలోమీటర్ల దూరంలో.. టిబెట్​లోని టింగ్రీ కౌంటీలో 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. టింగ్రీ కౌంటీ చుట్టూ 20 కిలో మీటర్ల రేడియస్​లోని 27 గ్రామాలు భూకంపానికి ప్రభావితం అయ్యాయి. ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన టింగ్రీ కౌంటీ నేపాల్.. సరిహద్దులో ఉంటుంది. ఎవరెస్ట్ పర్వతాన్ని చూసేందుకు వచ్చేవాళ్లంతా ఇక్కడే స్టే చేస్తుంటారు. ఈ ప్రాంతంలో కొన్ని సెకండ్ల పాటు తీవ్రస్థాయిలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పర్వత ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడడంతో మౌంట్ ఎవరెస్ట్ తో పాటు టింగ్రీ కౌంటీకి వెళ్లే రోడ్లను అధికారులు తాత్కాలికంగా క్లోజ్ చేశారు.

అరగంటలో మూడుసార్లు..
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్​సీఎస్) ప్రకారం.. టిబెట్ రీజియన్​లో మొత్తం మూడుసార్లు భూమి కంపించింది. మంగళవారం పొద్దున 6.35 గంటలకు మొదట భూమి కంపించింది. రిక్టర్ స్కేల్​పై తీవ్ర 7.1గా నమోదైంది. ఆ తర్వాత 7.02 గంటలకు 4.7 తీవ్రతతో రెండోసారి కంపించింది. ఈ రెండు ప్రకంపనలకే వెయ్యికి పైగా ఇండ్లు కూలిపోయాయి. 7.07 గంటలకు 4.9 పాయింట్ల తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది.