బందీలను వదలకుంటే.. భీకర దాడులు చేస్తం.. హమాస్కు ట్రంప్ వార్నింగ్

  • హమాస్​కు మరోసారి హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్

వాషింగ్టన్: బందీలను విడుదల చేయకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హమాస్ ను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు.

తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే నాటికి బందీలను విడుదల చేయకపోతే, పశ్చిమాసియాలో భీకర దాడులు చేస్తామని హమాస్ కు ఆయన హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం ఫ్లోరిడాలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా హమాస్ తో జరుగుతున్న చర్చల పురోగతిపై మీడియా ప్రశ్నించగా ఆయన స్పందించారు. 

‘‘అసలు చాలాకాలం క్రితమే బందీలను హమాస్ విడుదల చేయాల్సింది. కానీ చేయలేదు. వాళ్ల దగ్గర ఇజ్రాయెల్, అమెరికా, ఇతర దేశాల వాళ్లు బందీలుగా ఉన్నారు. వాళ్లను విడిపించాలని నన్ను వేడుకుంటున్నారు. 

నా దగ్గరికి బందీల తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తున్నారు. ఇప్పటికే కొంతమంది బందీలను హమాస్ చంపేసింది. ఇక వాళ్లు ఎంతమాత్రం బందీలు కాదు. నేను చర్చలకు ఆటంకం కలిగించాలని అనుకోవడం లేదు. 

కానీ నేను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే నాటికి (ఈ నెల 20) బందీలను విడుదల చేయకపోతే, పశ్చిమాసియాలో భీకరమైన దాడులు చేస్తాం” అని ట్రంప్​ హెచ్చరించారు. కాగా, హమాస్ దగ్గర దాదాపు 100 మంది బందీలు ఉన్నారు. 

బందీల విడుదలకు హమాస్​తో జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయని మిడిల్ ఈస్ట్​లోని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవెన్ చార్లెస్ విట్కాఫ్ తెలిపారు. ‘‘చర్చల్లో పురోగతి ఉన్నది. నేను రేపు మళ్లీ దోహాకు వెళ్తున్నాను. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే నాటికి మంచి వార్త వింటామని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు.

కెనడాను కలిపేసుకున్న ట్రంప్! 

అమెరికాలో కెనడా విలీన ప్రతిపాదనను ట్రంప్ మరోసారి తెరపైకి తెచ్చారు. ఈసారి ఏకంగా అమెరికాలో కెనడా భాగమైనట్టుగా ఉన్న మ్యాప్​ను తన సోషల్ మీడియా ప్లాట్​ఫాంలో పోస్టు చేశారు. 

దానికి ‘ఓ కెనడా!’ అంటూ క్యాప్షన్ పెట్టారు. కాగా, అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని కెనడాకు ట్రంప్ సూచించారు.  కెనడాను అమెరికాలో కలుపుకునేందుకు ‘ఎకనామిక్ ఫోర్స్’ను వినియోగిస్తానని చెప్పారు.