Diwali 2023: దీపావళి పటాకులు కాల్చుతున్నారా?.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

పటాకులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. పటాకులు కాల్చేటప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా పెద్ద ప్రమాదాలు సంభవిస్తాయి. బాణసంచాలను ఇంటిలో కాల్చకూడదు. ఇంటికి దూరంగా బహిరంగ ప్రదేశాలలో కాల్చడం వలన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. పటాకులు కొన్నిసార్లు పేలకుండా ఆగిపోతాయి. వాటిని వెంటనే వెళ్లి పట్టుకోవడం లాంటివి చేయకూడదు. ముందుగా వాటిపై నీటిని పోయడం వలన ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. అల్కహాల్, శానిటైజర్‌లను వాడాక పటాకులను వెలిగించకూడదు. దీపావళి రోజు శానిటైజర్ వాడకపోవడం మంచిది. పటాకుల పైన ఇచ్చిన సలహాలు సూచనలను ఖచ్చితంగా చదివి పాటించాలి. మంటలు అంటుకునే ప్రదేశాలు, కరెంటు తీగలు, ఎండు గడ్డి, పూరి గుడిసెలు ఉన్న ప్రదేశాలలో పటాకులు కాల్చకూడదు. పటాకులను కాల్చి రోడ్డు మీద పడేయడంతో దారి వెంట వెళ్లే వారికి ప్రమాదం కలగవచ్చు.రాకెట్లు, సుతిల్ బాంబులు, చిచ్చు బుడ్లు బోలెడు ఆనందాన్ని ఇస్తాయి. కానీ, అవి కాల్చేటప్పుడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం వెంటే వస్తుంది.అందుకే పిల్లలు, పెద్దలు పటాకులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

  • పటాకులు కాల్చేటప్పుడు కాటన్ డ్రెస్ లనే వేసుకోవాలి.
  • గడ్డివాములు, పశువుల పాకలు, గుడిసెలు, పెట్రోల్ బంక్ లకి దూరంగా పటాకులు కాల్చాలి.
  • మధ్యలో ఆగిపోయిన వాటిని తిరిగి వెలిగించే ప్రయత్నాలు చేయకూడదు. అవి చేతిలోకి తీసుకోగానే పేలే ప్రమాదం ఉంది. పటాకులు కాల్చేటప్పుడు ముందు  నీళ్ల బకెట్ పక్కన పెట్టుకోవాలి.
  • చెప్పులు వేసుకునే బాంబులు కాల్చాలి..
  •  బాంబులు కాల్చేటప్పుడు, కాల్చిన తర్వాత చేతులను నోట్లో, ముక్కుల్లో పెట్టుకోవద్దు..
  • బట్టలపై నిప్పురవ్వలు పడితే అవి రాజుకోకుండా వెంటనే ఒంటి పై దుప్పటి కప్పాలి. లేదా నేలపై అటు ఇటు బోర్లాడాలి..
  • అగ్గిపుల్లలకి బదులు కొవ్వొత్తులు, అగరబత్తులతో పటాకులు వెలిగించాలి..
  • సర్టిఫైడ్ షాపుల నుంచే పటాకులు కొనాలి. గ్యాస్ స్టవ్, కిరోసిన్ పొయ్యిల దగ్గర వాటిని పెట్టకూడదు.
  • జేబుల్లో పటాకులు పెట్టుకుని తిరగొద్దు.