కులగణన జరిగితే.. రాజ్యాంగపరంగా వివిధ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో తగిన రిజర్వేషన్లు అడుగుతారు. వెనుకబడిన కులాల్లో కూడా వివిధ వర్గాలు, కులాల మధ్య తమ తమ వాటా కోసం కొంత తర్జనభర్జన జరిగే అవకాశం ఉంది. ఈ అంశం మరోసారి రాజకీయ పార్టీలకు, కులాలకు మధ్య చర్చనీయాంశంగా మారుతుంది. కులగణన కులాలకు ఎంత ప్రయోజనం కలిగిస్తుందో తెలియదు. కానీ.. దాని ప్రభావం రాజకీయ పార్టీల గెలుపోటములను నిర్ణయించే అంశంగా మారనుంది. కాబట్టి దీన్ని రాజకీయ అంశంగా కాకుండా ఒక సామాజిక వర్గం న్యాయమైన హక్కుగా భావించినప్పుడు సమస్య సులభంగా పరిష్కారం అయ్యేందుకు వీలవుతుంది. అందుకోసం ప్రజలంతా సహకరించాలి. తప్పుదారి పట్టకుండా ఉద్యమించాలి. సమయం ఎంత పట్టినా అంతిమంగా పరిష్కారం కోసం కృషి చేయడం, పోరాటం చేయడం ఆ సామాజిక వర్గాల కనీస బాధ్యత అని గుర్తించాలి.
ఎవరికి అవసరం
కులగణన చేయాలని ఎక్కువగా బీసీలే పోరాడుతున్నారు. దానికి కారణం ఏంటంటే... అసలు మండల్ కమిషన్‌కు ముందు దేశంలో బీసీలకు రిజర్వేషన్ లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ఏండ్లకు1990లో మండల్ కమిషన్ నివేదికతో రిజర్వేషన్ కల్పించారు. ఈ కమిషన్ దేశవ్యాప్తంగా ఉన్న 3,743 కులాలను బీసీలుగా తేల్చింది. దేశ జనాభాలో దాదాపు 52 శాతం బీసీలు ఉన్నట్టు ఆనాటి లెక్కలు చెప్తున్నాయి. కానీ.. వాళ్లకు అందులో సగం అంటే... 27 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ లిస్టులో దేశవ్యాప్తంగా 2,479 కులాలు ఉన్నాయి.
రాష్ట్రాల స్థాయిలో ఈ రిజర్వేషన్లు తీసుకునే కులాలు 3,150 ఉన్నాయి. ఈ రిజర్వేషన్లు కల్పించినప్పటి నుంచి ఇప్పటివరకు రిజర్వేషన్ల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది. బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. సగం మాత్రమే రిజర్వేషన్ ఉండడం వల్ల బీసీలు తమ జనాభాలో సగం వంతు మాత్రమే రిజర్వేషన్లు అందుకుంటున్నారు. అందుకే కులగణన చేయాలని, రిజర్వేషన్లలో మార్పులు తీసుకురావాలని బీసీలు కోరుతున్నారు. అలాంటి మార్పులు తీసుకొస్తే.. రాజకీయ రిజర్వేషన్ విషయంలో అసలు సమస్య మొదలవుతుంది. బీసీ జనాభా ఎంతో తెలిస్తే.. దానికి తగ్గట్టు చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. అలా జరగకూడదనే కులగణన చేయడంలేదని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
లెక్కలు తీయడం కష్టమా?
ఏ టెక్నాలజీ, సరైన ప్రభుత్వం, అధికార యంత్రాంగం లేని టైం1881లోనే కులగణన జరిగింది. అలాంటిది ఇప్పుడు పటిష్టమైన ప్రభుత్వాలు, అధికారులు, టెక్నాలజీ సపోర్ట్‌గా ఉండగా ఇప్పుడు కులగణన చేయడం అంత పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుటికే బీహార్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కులగణన చేశారు. కానీ.. వాటికి ఆ ప్రభుత్వాలు పెట్టిన పేర్లే వేరు. రాష్ట్రాలకు తగిన అధికారం లేకపోవడం వల్ల సర్వే పేరుతో కులగణన చేస్తున్నారు. కాకపోతే.. వీటిలో తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాలు ఆ డాటాను బయటపెట్టలేదు. అయితే.. ఈ గణనలో కులం ఒక్కటే కాకుండా ఆ కుటుంబాల సమగ్ర పరిస్థితి కనుక్కోవాలి. అప్పుడే వాళ్లు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? వాళ్ల కోసం ప్రభుత్వాలు ఏం చేయాలి? అనేది తెలుస్తుంది.