ఉక్రెయిన్‌లో అమెరికా ​ఎంబసీ క్లోజ్

  • రష్యా దాడి చేస్తుందన్న సమాచారంతో ఖాళీ

కీవ్: ఉక్రెయిన్‌‌ రాజధాని కీవ్​లోని తమ రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు బుధవారం అమెరికా వెల్లడించింది. తమ ఎంబసీపై రష్యా వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టు సమాచారం అందిందని, దీంతో ముందుజాగ్రత్త చర్యగా ఎంబసీని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 20న దాడి జరిగే అవకాశం ఉందని తమకు కచ్చితమైన సమాచారం వచ్చిందని వెల్లడించింది. రష్యాలోని సుదూర ప్రాంతాలపై దాడికి అమెరికా అందజేసిన లాంగ్ ​రేంజ్​ మిసైల్స్ వినియోగించేందుకు ఉక్రెయిన్‌‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌‌ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. 

దీనికి ప్రతిస్పందనగా రష్యా అధ్యక్షుడు పుతిన్​ తమ న్యూక్లియర్​ పాలసీని సవరిస్తూ మంగళవారం సంతకం చేశారు. ఈ అంశాలు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను ఒక్కసారిగా పెంచేశాయి. ఈ పరిస్థితుల్లో కీవ్​లోని తమ ఎంబసీని మూసివేయాలని అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అందులో పనిచేసే ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. అదేవిధంగా ఎయిర్‌‌ అలర్ట్‌‌లు ప్రకటించగానే కీవ్‌‌లోని అమెరికా పౌరులందరూ షెల్టర్లలోకి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌‌ చాలాకాలంగా రష్యాపై లాంగ్ ​రేంజ్ ​మిసైల్స్ ఉపయోగించేందుకు అమెరికాను పర్మిషన్​ కోరుతోంది. ఎట్టకేలకు అనుమతి లభించడంతో 
ఉక్రెయిన్‌‌ దూకుడుగా వ్యవహరిస్తున్నది.