మా నేలను ఆక్రమిస్తే చూస్తూ ఊకుంటమా?

  • బంగ్లాదేశ్ రాజకీయ నాయకులపై మమతా బెనర్జీ ఫైర్

కోల్‌‌కతా: విదేశీ శక్తులు మా దేశంలోని ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు వస్తే మేం లాలీపాప్​లు తింటూ కూర్చుంటామని అనుకుంటున్నారా అంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు.  బెంగాల్, బిహార్, ఒడిశాపై తమకు చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని బంగ్లాదేశ్ కు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్​పీ) నేతలు ఇటీవల ఒక మీటింగ్​లో చేసిన వ్యాఖ్యలపై ఆమె ఫైర్ అయ్యారు. 

సోమవారం బెంగాల్ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ బంగ్లాదేశ్​లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలని బంగ్లాదేశ్ నాయకులకు సూచించారు. ‘మీరు రాజకీయం చేయాలనుకుంటే.. చివరకు అది మీ కుటుంబాలు, స్నేహితులు, ప్రజలకు హాని చేస్తుందనే సంగతి గుర్తుంచుకోవాలి’ అని హెచ్చరించారు.

దాడుల్ని  హిందూ, ముస్లింలు ఖండించారు

‘‘బంగ్లాదేశ్‌‌లో మైనారిటీలపై అకృత్యాలు జరిగినప్పుడు రాష్ట్రంలోని హిందువులు, ముస్లింలు ఖండించారు. దాడులకు పాల్పడే వారికి మతం ఉండదు. వారు సంఘవిద్రోహ శక్తులు. రాష్ట్రంలో హిందువులు నిరసనలు తెలుపుతున్నప్పుడు, ఇమామ్‌‌లు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అకృత్యాలను ఖండించారు. 

అందుకు నేను కృతజ్ఞురాలిని” అని మమత అన్నారు. బెంగాల్ లో మంటపెట్టేలా నకిలీ వీడియోల సర్క్యులేషన్‌‌ జరుగుతున్నదని.. ఇందుకు ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీదే బాధ్యత అని ఆరోపించారు. అలాంటి తప్పుడు సమాచారం నుంచి దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీడియా సంయమనం పాటించాలన్నారు. 

అయితే, ఇది ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ కాదని.. నకిలీ వీడియోలు సర్క్యులేట్​ చేసే వారిని నిషేధిస్తం, అరెస్టు చేస్తమని హెచ్చరించారు. బంగ్లాదేశ్ పౌరులు సరిహద్దులు దాటి బెంగాల్‌‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారనే అంశపై మాట్లడబోనని మమత చెప్పారు. ఈ విషయాన్ని సరిహద్దు భద్రతా దళం(బీఎస్​పీ) పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.