ఆర్డర్లు కల్పించాలని నేతకార్మికుల రాస్తారోకో   

గంగాధర, వెలుగు: వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇప్పించి పవర్‌‌లూమ్స్‌ వస్త్ర పరిశ్రమను కాపాడాలని నేత కార్మికులు డిమాండ్‌ చేశారు. మంగళవారం కరీంనగర్​–జగిత్యాల రోడ్డుపై గంగాధర మండలం కురిక్యాల వద్ద గర్శకుర్తి గ్రామ పవర్ లూమ్స్ కార్మికులు రాస్తారోకో చేపట్టారు. గ్రామంలో అధిక సంఖ్యలో ఉన్న పవర్ లూమ్స్​పై బట్టలు తయారు చేయడానికి ప్రభుత్వపరంగా ఎలాంటి ఆర్డర్లు రావడం లేదని, దీంతో 8 నెలలుగా యజమానులు, ఆసాములు, కార్మికులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పదేళ్ల కింద గ్రామంలో నేతన్నల ఆత్మహత్యలు,  ఆకలిచావులు పునరావృతం కాకముందే గర్శకుర్తి వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాలన్నారు. నేత కార్మికుల రాస్తారోకోకు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ మద్దతు తెలిపారు. రాస్తారోకోలో పవర్ లూమ్స్ కార్మిక సంఘం అధ్యక్షుడు గడ్డం నారాయణ, గ్రామ వస్తోత్పత్తి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అలువాల విఠోభ, ప్రధాన కార్యదర్శి అన్నల్ధాస్‌ శ్రీనివాస్, లచ్చయ్య, లక్ష్మీరాజం, వివిధ గ్రామాలకు చెందిన పవర్ లూమ్స్ యజమానులు, కార్మికులు  తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని ధర్నా

సిరిసిల్ల టౌన్, వెలుగు: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో  నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వస్త్ర  పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ లీడర్లు రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జేఏసీ లీడర్లు  మాట్లాడుతూ 8 నెలలుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.  ఇప్పటికే 10 మంది పవర్లూమ్  కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

 సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సెస్ అధికారులు విద్యుత్ బిల్లులు చెల్లించాలని వేధిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ కక్షలో భాగంగా నేతన్నలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. జేఏసీ లీడర్లు మూశం రమేశ్‌, తాటిపాముల దామోదర్, పంతం రవి, ఆడపు భాస్కర్, రవీందర్, చేరాల అశోక్, నారాయణ, అశోక్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.