కాళేశ్వరం బ్యాక్ వాటర్‌‌‌‌తో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

  • నష్టపరిహారం అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లా: వివేక్‌‌ వెంకటస్వామి
  • బీఆర్‌‌‌‌ఎస్‌‌ హయాంలో చెన్నూరులో అభివృద్ధి జరగలేదని ఆరోపణ
  • చెన్నూరులో రూ.62.90 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌‌‌‌తో నష్టపోయిన చెన్నూరు ప్రాంత రైతులను ఆదుకుంటామని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రైతులకు నష్టపరిహారం అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లానని, కాంగ్రెస్ ప్రజా పాలనలో ఎవ్వరూ నష్టపోకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని భేతాళవాడ, మార్కెట్ లైన్, ఖాండేలాల్ లైన్‌‌లో డీఎంఎఫ్‌‌టీ ఫండ్స్ నుంచి మంజూరైన రూ.62.90 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్​దీపక్​, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన గిల్డా, అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ, బ్యాక్ వాటర్‌‌‌‌తో నష్టపోయిన రైతుల సమస్యను పరిష్కరించాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కోరానని, పంట నష్టంపై సర్వే చేయాలని ఇప్పటికే మంచిర్యాల కలెక్టర్‌‌‌‌ను ఆయన ఆదేశించారని వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనలో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, రోడ్లు, డ్రైనేజీలు, తాగు నీటి సౌలత్‌‌లను పట్టించుకోలేదని ఆరోపించారు. త్వరలో 26 వార్డుల్లో రూ.4.16 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. బల్దియాల పరిధిలో డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం రూ.100 కోట్లు మంజూరు చేయించానన్నారు.

 చెన్నూరు మున్సిపాలిటీలో రూ.30 కోట్లు, క్యాతనపల్లిలో రూ.40 కోట్లు, మందమర్రిలో రూ.30 కోట్లతో అమృత్ స్కీం అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఎస్‌‌డీఎఫ్ ఫండ్స్ నుంచి 100 బోర్లు, డీఎంఎఫ్‌‌టీ నుంచి మరో వంద బోర్లను మంజూరు చేశామన్నారు. నీటి ఎద్దడి ఎక్కువున్న ప్రాంతాల్లో విశాక ట్రస్టు నుంచి బోర్లు వేస్తున్నామని తెలిపారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా ఎక్కడా బొట్టు నీళ్లు రాలేదని ఆయన ఆరోపించారు. చెన్నూరులో మైనార్టీ హాస్టల్, కోటపల్లిలో ఎస్సీ హాస్టల్‌‌లో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపామని, ఫండ్స్ రాగానే పనులు చేపడతామన్నారు. తాను నియోజకవర్గానికి ఏమీ చేయడం లేదంటూ బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అటవీ పర్మిషన్ల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినం..

చెన్నూరు సెగ్మెంట్​లోని నక్కలపల్లి, ఎదులబంధం, రాజా రాం గ్రామాల్లో అటవీ శాఖ అనుమతుల్లేక రోడ్లు వేయలేకపోతున్నామని వివేక్ తెలిపారు. కోటపల్లి మండలం నక్కలపల్లి బ్రిడ్జి నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరయ్యాయని, అటవీ శాఖ పర్మిషన్లు పనులు జరగడం లేదన్నారు. ఈ విషయాలను కేంద్ర మంత్రులు నితిన్‌‌ గడ్కరీ, భూపేందర్‌‌‌‌ యాదవ్‌‌ దృష్టికి తాను, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీసుకెళ్లామని చెప్పారు. సమస్య పరిష్కారానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారన్నారు. నిజామాబాద్, ​-జగదల్‌‌పూర్ నేషనల్ హైవే- 63లో బీమారం మండలం జోడువాగుల వద్ద కొత్త రోడ్డు పనుల కోసం పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఒప్పించి రూ.100 కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. పర్మినెంటు రిపేర్ల కోసం రూ.1.83 కోట్లు కూడా మంజూరయ్యాయన్నారు. 

సోమనపల్లిలో రూ.125 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్..
 

స్టూడెంట్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించినట్లు ఎమ్మెల్యే వివేక్ పేర్కొన్నారు. చెన్నూరు మండలం సోమనపల్లిలో రూ.125 కోట్లతో శుక్రవారం స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. కోటపల్లి, చెన్నూరు మండలాలకు రెండు అంబులెన్సులు మంజూరయ్యాయని, పది రోజుల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. చెన్నూరులో 100 పడకల హాస్పిటల్‌‌ను త్వరగా మంజూరు చేయాలని సీఎంను కోరానని, మందమర్రిలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు, రూ.70 కోట్లతో ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రోడ్ల నిర్మాణానికి ప్రపోజల్స్ పంపామన్నారు. చెన్నూరులో అంబేద్కర్ భవన్‌‌కు రూ.20 లక్షల నిధులు మంజూరయ్యాయని, నేతకాని భవనం కూడా నిర్మిస్తామని చెప్పారు. మందమర్రిలో లిడ్ క్యాప్ లెదర్ పార్కును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని, ఇందుకోసం ఇటీవల రూ.10 లక్షలు కేటాయించామన్నారు. శనిగకుంట చెరువు ఘటనలో అసలు దోషులను పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు.