ప్రతి గింజా కొంటాం ..రైతులెవరూ ఆందోళన చెందొద్దు : మంత్రి తుమ్మల

  • సంక్రాంతి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తం
  • కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చాక రైతు భరోసా ఇస్తామని వెల్లడి
  • సింపతీ వస్తుందని అరెస్ట్ కోసం కేటీఆర్ పాకులాట: మంత్రి శ్రీధర్ బాబు
  • గిరిజన రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొద్దని హితవు

హైదరాబాద్, వెలుగు: రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజా కొంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు భరోసా ఇచ్చారు. వరి సాగులో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. కేబినెట్​సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చాక రైతు భరోసా ఇస్తామని తెలిపారు. రైతులను అడ్డంపెట్టుకుని అపోజిషన్ పార్టీలు కుట్రలు చేయొద్దని సూచించారు. సెక్రటేరియెట్​లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కోటీ 53 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో సన్న రకాల సాగు 25 లక్షల నుంచి 40 లక్షల ఎకరాలకు పెరిగింది. సన్నాలకు బోనస్ ఇస్తామని ప్రకటించడమే దీనికి కారణం. రాష్ట్ర వ్యాప్తంగా 7,411 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినం. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. మళ్లీ పవర్​లోకి వచ్చేందుకు రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నది.

రైతుల సంక్షేమం కోసం మా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నది. బోనస్ కారణంగా వానాకాలం సీజన్​లో దొడ్డు రకం వరి సాగు 41 లక్షల ఎకరాల నుంచి 21లక్షల ఎకరాలకు పడిపోయింది”అని మంత్రి తుమ్మల తెలిపారు. ఇతర దేశాలకు సన్నాలను ఎగుమతి చేసే అవకాశం ఉందన్నారు. రైతులను బీఆర్ఎస్ రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నదని మండిపడ్డారు. 

రేషన్ కార్డుదారులకు 17 లక్షల టన్నుల సన్న బియ్యం

సంక్రాంతి నుంచి రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని తెలిపారు. ‘‘సంక్రాంతి నుంచి రేషన్ కార్డుదారులతో పాటు అంగన్​వాడీ సెంటర్లు, అన్ని ప్రభుత్వ హాస్టళ్లకు సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యం పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే.. బోనస్ ప్రకటించినం. రాష్ట్ర వ్యాప్తంగా 90లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. సుమారు 17 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరం అవుతాయి. గవర్నమెంట్ స్కూళ్లు, అంగన్​వాడీ సెంటర్లలో మధ్యాహ్న భోజనం, గురుకులాలు, హాస్టళ్లలో మొత్తం కలిపి ఏటా 24లక్షల టన్నులకు పైగా సన్న బియ్యం కావాలి. ప్రభుత్వమే సన్న రకం వడ్లు సేకరించి మిల్లింగ్ చేయిస్తది.

సంక్రాంతి నుంచి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నం’’అని మంత్రి తుమ్మల ప్రకటించారు. ‘‘బీఆర్ఎస్​లో ఆధిపత్య పోరు ఉండొచ్చు.. రాష్ట్రంలో రెండో స్థానం కోసం బీజేపీతో పోటీ ఉండొచ్చు.. అంతేగానీ.. మీ ఆధిపత్య పోరు కోసం రైతులను వాడుకోవద్దు. కేంద్రం ఇచ్చిన గైడ్​లైన్స్ ప్రకారమే మేము ధాన్యం కొనాలి. రైతుల మీద ప్రేమ ఉంటే కేంద్రం పెట్టిన 17శాతం తేమ నిబంధనను మార్పించండి”అని బీజేపీ నేతలకు మంత్రి తుమ్మల సూచించారు.

రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలు అవసరం: శ్రీధర్ బాబు

పరిశ్రమల ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుంటే.. అధికారులపై బీఆర్ఎస్ లీడర్లు హత్యాయత్నం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. సింపతీ పొందేందుకు కేటీఆర్ అరెస్ట్ కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. లగచర్ల ఘటనపై ఉన్నత స్థాయి అధికారితో విచారణ సాగిస్తున్నామని తెలిపారు. ‘‘అమాయక గిరిజన రైతులను అడ్డం పెట్టుకుని కేటీఆర్ దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నడు. బీఆర్ఎస్ పాలనలో గిరిజనుల భూములు బలవంతంగా లాక్కున్నరు. ప్రజాభిప్రాయానికి సీఎం రేవంత్ విలువ ఇచ్చి.. కలెక్టర్​ను పంపిస్తే.. బీఆర్ఎస్ ముసుగు వేసుకున్న కొందరు దాడికి యత్నించారు.

రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు అవసరం. అప్పుడే నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతది’’అని శ్రీధర్ బాబు తెలిపారు. సన్నాలు పండించిన ప్రతి రైతుకూ బోనస్ ఇస్తామన్నారు. ఎవరూ ఆందోళనచెందొద్దని తెలిపారు. ‘‘ధాన్యం సేకరించిన వారంలోనే రూ.500 బోనస్ వేస్తం. కలెక్టర్, గ్రూప్ వన్ అధికారిని చంపే ప్రయత్నం జరిగింది. ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర జరుగుతున్నది. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయి’’అని శ్రీధర్ బాబు మండిపడ్డారు.