కవర్ స్టోరీ : కొండల్లో..డేంజర్ బెల్స్

మార్చురీలకు కుప్పలు కుప్పలుగా వస్తున్న శవాలు.. వాటిలో కొన్ని గుర్తుపట్టలేకుండా మారిపోయాయి. కొన్నింటిని చలియార్ నది తనలో కలిపేసుకుంది. కొందరి శరీరభాగాలు వరదలో కొట్టుకుపోయాయి. అంబులెన్స్‌‌‌‌లు శవాలను మాత్రమే కాదు.. రెస్క్యూ సిబ్బంది వెతికి పట్టుకొచ్చిన శరీర భాగాలను కూడా మార్చురీలకు తీసుకెళ్లాయి. కొంతమంది ఆచూకీ తెలియక కుటుంబాల ఎదురుచూపులు.. 
ఆగని రోదనలు. ఒకప్పుడు ఉత్తర కేరళలోనే అందమైన ప్రదేశంగా పేరున్న వయనాడ్ జిల్లాలో కొన్ని గ్రామాల పరిస్థితి ఇది. పచ్చటి చెట్లతో కళకళలాడే ఈ ప్రాంతం.. ఇప్పుడు వరదలో కొట్టుకొచ్చిన బురద, పెద్ద పెద్ద బండరాళ్లు, శిథిలాలతో నిండిపోయింది. చెట్లు నేల కొరిగాయి. ఇండ్లు నేల మట్టమయ్యాయి. ఈ దుస్థితికి కారణమేంటి? వయనాడ్ మీద​ ప్రకృతి ఎందుకు అంత పగబట్టింది?

కేరళలోని వయనాడ్​లో కొండచరియలు విరిగిపడడం వల్ల వందల మంది ప్రాణాలు నీళ్లలో కలిసిపోయాయి. మట్టి దిబ్బల మరుగున పడిపోయాయి. ఈ ఘోరం జరగడానికి ముందు ఆ ​ ప్రాంతంలో నాలుగైదు రోజులు ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. జులై 30 నాటికి వాన జోరు పెరిగింది. అదే రోజు అర్ధరాత్రి దాటాక 2 గంటల ప్రాంతంలో కొండచరియలు పెద్ద ఎత్తున విరిగిపడ్డాయి. దాంతో వరద నీరు.. పెద్ద పెద్ద బండరాళ్లు, మట్టిని తీసుకుని ఊళ్ల మీదకి ఉప్పెనలా వచ్చిపడింది. 

ఆ ప్రళయానికి వయనాడ్​ జిల్లాలోని ఆగ్నేయ భాగంలో ఉన్న వైతిరి తాలూకాలోని మెప్పాడి సమీపంలో పరిసరాలు జలసమాధి అయ్యాయి. తెల్లవారుజామున 2 నుంచి 6 గంటల మధ్య ముండక్కై, చూరల్మల, అట్టమల, నూల్‌‌‌‌పుజా గ్రామాలు వరదలో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరయ్యాయి. ముందుగా వరద ముండక్కై, చూరల్మలకు చేరడంతో ఇక్కడే ఎక్కువ విధ్వంసం జరిగింది. చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి. కొన్ని ఇండ్లు నామ రూపాల్లేకుండా కొట్టుకుపోయాయి.

వెంటనే స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌‌‌‌మెంట్ అథారిటీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌‌‌తో సహా అనేక ఏజెన్సీలు సహాయక చర్యలు చేపట్టాయి. కానీ.. అప్పటికే కొన్ని వందల ప్రాణాలు వరదలో కలిసిపోయాయి. జిల్లాలోని 93 సహాయక శిబిరాల్లో10,000 మందికి పైగా తలదాచుకున్నారు. రక్త సంబంధీకులు, స్నేహితులను పోగొట్టుకుని బాధపడుతున్న వాళ్లకు ఏడవడానికి కన్నీళ్లు కూడా కరువే అయ్యాయి.  

రెండు రోజుల ముందు నుంచే.. 

ఈ దుర్ఘటన జరగడానికి రెండు రోజుల ముందు ఈ ప్రాంతంలో కుండపోత వర్షాలు కురిశాయి. కేవలం 48 గంటల్లో 572 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రుతుపవనాలు బలంగా వీయడంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని సైంటిస్ట్​లు అప్పటికే హెచ్చరించారు. కానీ.. కొండచరియలు విరిగిపడతాయని ఊహించలేకపోయారు. అయితే.. ఈ సంఘటనకు ఊహించని వాతావరణ పరిస్థితులే కాదు.. మనుషులు చేసిన తప్పులు కూడా కారణమే అంటున్నారు ఎక్స్​పర్ట్స్‌‌‌‌. కొండల్ని ప్లాటింగ్​ చేయడం, చెట్లు నరికి సాగు చేయడం, టూరిజం డెవలప్​ కావడంతో ఎక్కువ బిల్డింగ్స్​, హోటల్స్​, రెస్టారెంట్లు కట్టడం లాంటివి కూడా ఈ పరిస్థితులకు కారణాలు అంటున్నారు. 

వాతావరణంలో మార్పు

వయనాడ్​లో నాలుగ్గంటల్లోనే మూడు కొండచరియలు విరిగిపడ్డాయి. అందుకు కారణం వాతావరణ మార్పులే అంటున్నారు చాలామంది. కొన్నేండ్లుగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల కేరళ ప్రతికూలతలను ఎదుర్కొంటోంది. 2015లో తీవ్ర కరువు, 2017లో ఓఖీ తుపాన్, 2018లో వరదలు.. ఆ తర్వాతి సంవత్సరాల్లో కూడా వరదలతో పాటు కొండచరియలు విరిగిపడ్డాయి. అంతెందుకు 2019లో ఇదే వయనాడ్​ జిల్లాలోని పుత్తుమలలో కొండచరియలు విరిగిపడ్డాయి. 2020లో ఇడుక్కి జిల్లాలోని కనన్ దేవన్ హిల్స్‌‌‌‌లో కొండచరియలు జారిపడి 65 మంది చనిపోయారు.

చనిపోయిన వాళ్లలో ఎక్కువగా టీ తోటల్లో పనిచేసే కార్మికులే ఉన్నారు. 2022లో వాతావరణంలో మార్పుల వల్ల జరిగిన ప్రమాదాల్లో కేరళలోనే 32 మంది చనిపోయారని భారత వాతావరణ శాఖ ఇచ్చిన నివేదికలో తెలిపింది. 2022 జూలైలో భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్​ ఎర్త్​ సైన్సెస్​) లోక్‌‌‌‌సభకు ఒక రిపోర్ట్​ ఇచ్చింది. అందులో దేశంలో 2015 నుంచి 2022 మధ్య ఏడేండ్లలో 3,782 కొండచరియలు విరిగిపడ్డాయని చెప్పింది. అందులో 2,239 (దాదాపు 59.2 శాతం) కేరళలోనే జరిగినట్టు ఆ నివేదిక సారాంశం. దీనికంతటికీ కారణం.. అక్కడి వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకున్న మార్పులే అని సైంటిస్ట్​లు చెప్పారు. ఇప్పుడు కూడా భారీ వర్షాల వల్లే వయనాడ్‌‌‌‌లో కొండచరియలు విరిగిపడ్డాయి అంటున్నారు.

కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అడ్వాన్స్‌‌‌‌డ్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రాడార్ రీసెర్చ్ సెంటర్​ ఉంది. దాని డైరెక్టర్ ఎస్ అభిలాష్ ఈ ప్రమాదం గురించి మాట్లాడుతూ ‘‘ప్రమాదానికి ముందు వారం రోజులకు పైగా రుతుపవనాలు చాలా చురుకుగా కొంకణ్ ప్రాంతాన్ని ఎఫెక్ట్​ చేశాయి. అరేబియా సముద్ర తీరంలో లోతైన మేసోస్కేల్ క్లౌడ్ వ్యవస్థ ఏర్పడింది. అందువల్లే వయనాడ్, కోళికోడ్, మలప్పురం, కన్నూర్‌‌‌‌లలో భారీ వర్షాలు కురిశాయి. ఆగ్నేయ అరేబియా సముద్రం వేడెక్కుతున్నదని మా రీసెర్చ్​లో తేలింది. విపరీతమైన వర్షపాతానికి అది కూడా ఒక కారణమే”అన్నారు. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం కూడా ఉంది. దాని వల్ల మరిన్ని కొండచరియలు విరిగిపడొచ్చు. 

కేరళలో దాదాపు17,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ల్యాండ్​ స్లైడ్స్​ జరిగే ప్రమాదం ఉందని ఇస్రో చెప్పింది. అత్యధికంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న 30 జిల్లాల్లో 10 కేరళలోనే  ఉన్నాయని వాటిలో వయనాడ్ పదమూడో స్థానంలో ఉందని తేలింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కొండచరియలు విరిగిపడిన ప్రదేశానికి సంబంధించిన హై-–రెజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు రెండింటిని విడుదల చేసింది. వాటి ఆధారంగా 86,000 చదరపు మీటర్ల(86 కిలోమీటర్ల) భూమి వాలు వైపుకు కొట్టుకుపోయినట్టు తెలిపింది.

పెళుసుగా ఉండే భూభాగం

కొండచరియలు విరిగిపడటానికి మరొక పెద్ద కారణం అక్కడి భూభాగం. “ఇక్కడ ఉన్న భూభాగంలో రెండు విలక్షణమైన పొరలు ఉన్నాయి. పైన కనిపించే మట్టి పొర లోపల ఉండే గట్టి రాళ్ల మీద ఉంటుంది. వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు నేల తేమతో నిండిపోతుంది. తర్వాత నీళ్లు రాతి పొర వరకు చేరుకుంటాయి. దాంతో మట్టిని రాళ్లతో బంధించే ఫోర్స్​ బలహీనపడుతుంది. దాంతో నేల లోపల చిన్న చిన్న కదలికలు మొదలవుతాయి. ఆ తర్వాత ల్యాండ్ స్లైడ్స్​కి దారి తీస్తుంది. ఇప్పుడు కూడా ఇలాంటి ప్రమాదమే జరిగిందనేది ప్రాథమిక అంచనా” అన్నారు కేఎస్​ సజిన్‌‌‌‌కుమార్. ఈయన కేరళ యూనివర్సిటీలో జియాలజీ డిపార్ట్​మెంట్​లో అసిస్టెంట్ ప్రొఫెసర్​.

పైపింగ్​

కొండచరియలు విరిగిపడడానికి ‘సాయిల్ పైపింగ్’ కూడా ఒక కారణం అంటున్నారు ఎక్స్​పర్ట్స్​. సెంటర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ డెవలప్‌‌‌‌మెంట్ అండ్ మేనేజ్‌‌‌‌మెంట్ (సిడబ్ల్యుఆర్‌‌‌‌డిఎమ్)లోని సీనియర్ సైంటిస్ట్​ అరుణ్​ దీని గురించి వివరిస్తూ ‘‘పెద్ద పెద్ద వృక్షాలను నరికివేసినప్పుడు వాటి వేర్లు భూమిలోనే ఉండిపోతాయి. తేమ శాతం ఎక్కువగా ఉండే భూమిలో అవి కొన్నాళ్లకు కుళ్ళిపోతాయి. దాంతో అక్కడ గ్యాప్స్​ ఏర్పడతాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు ఆ గ్యాప్స్​లోకి నీరు చేరుతుంది. గ్యాప్స్​ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పైనుంచి గట్టిగానే కనిపించినప్పటికీ లోపల చిన్న చిన్న నీటి మడుగుల్లాంటివి ఉంటాయి. అవి నేలను వాలుగా ఉన్న వైపు జారిపోయేలా చేస్తాయి. అలాంటప్పుడు కొండచరియలు విరిగిపడుతుంటాయి.

ఇలాంటి ప్రాంతాలను గుర్తించినప్పుడు పరీవాహక లోయ ప్రాంతాల్లో (22.5 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే) ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అక్కడ లోతైన వేర్లు ఉండే చెట్లను పెంచాలి.  ముఖ్యంగా వెదురు లాంటి చెట్లను పెంచితే.. నేల కింద ఉన్న రాళ్లను పట్టుకుని మట్టిని జారిపోకుండా ఆపుతాయి. దాంతో ఇలాంటి ప్రమాదాలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కేరళలోని అనేక ప్రాంతాలు ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో కొండచరియలు విరిగిపడడానికి ఈ సాయిల్​ పైపింగ్ ప్రధాన కారణంగా చెప్తుంటారు. 

గతంలో వయనాడ్‌‌‌‌లోని పుత్తుమలలో కొండచరియలు విరిగి భారీ నష్టం జరిగింది. దానికి సాయిల్​ పైపింగ్ కారణమని ఎక్స్​పర్ట్స్​ తేల్చారు. ఇప్పుడు కొండచరియలు విరిగిన మెప్పాడి కూడా పుత్తుమలకు కొంత దూరంలోనే ఉంది. అందుకే దీనికి కూడా సాయిల్​ పైపింగ్​ కారణమై ఉండొచ్చని ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నారు. 

అడవులు మాయం

కేరళలోని చాలా ప్రాంతం ఆకుపచ్చ తివాచీ పరిచినట్టు ఉంటుంది. అందులోనూ వయనాడ్​లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. కానీ.. కొన్నాళ్లుగా వయనాడ్​ ఆ పచ్చదనం  కోల్పోతోంది. అక్కడ అడవులను విపరీతంగా నరికేయడం వల్ల కూడా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఎక్స్​పర్ట్స్​ అన్నారు. కేరళ క్రమంగా అటవీ విస్తీర్ణాన్ని కోల్పోతోంది. 2022 స్టడీ ప్రకారం.. 1950  నుంచి 2018 మధ్య వయనాడ్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం కనుమరుగైంది. 
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌‌‌‌మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం..

1950ల వరకు వయనాడ్​ మొత్తం విస్తీర్ణంలో 85 శాతం అటవీ ప్రాంతమే ఉండేది. క్వారీయింగ్, నిర్మాణాల కోసం, కొండలను చదును చేయడం, పెద్ద పెద్ద రహదారుల నిర్మాణం కోసం అడవులను నరికేయడం లాంటివి చేస్తున్నారు. పైగా.. కొండ ప్రాంతాల్లో చెట్లు నరికేసి మోనో-క్రాప్ ఫార్మింగ్ మొదలుపెట్టారు.
కొన్ని ప్రాంతాల్లో వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రోడ్లు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పట్టించుకోవడం లేదు. పాత రోజుల్లో కురిసిన వర్షపాతం, తీవ్రతను ఆధారంగా చేసుకుని కల్వర్టులు నిర్మిస్తున్నారు. కానీ.. ఇప్పుడు వర్షపాతం విపరీతంగా పెరిగింది. కాబట్టి కొత్త లెక్కలను తీసుకుని వాటికి అనుగుణంగా నిర్మాణాలు చేయాలి. 

 కేరళకు చెందిన డిజాస్టర్​ రిస్క్​ఎక్స్​పర్ట్ డాక్టర్​ శ్రీకర్​ మాట్లాడుతూ ‘‘కేరళలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న నిర్మాణాలన్నీ ఎక్కడైతే కట్టకూడదో అక్కడే కడుతున్నారు. అందుకే సైంటిఫిక్​గా లేని ఆ కన్​స్ట్రక్షన్​ మెకానిజమ్స్ ఇలాంటి వినాశకర పరిస్థితులకు దారితీస్తున్నాయి. కనీసం నదులు ప్రవహించడానికి కూడా స్థలం లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి. దానివల్ల ఫ్లాష్​ ఫ్లడ్స్​ వస్తున్నాయి” అని చెప్పారు. 

టోపోగ్రఫీ అలాంటిది 

కేరళలోనే ఎందుకు ఎక్కువ కొండచరియలు విరిగిపడుతున్నాయి అంటే... కేరళ టోపోగ్రఫీ అలా ఉంది. కేరళ రాష్ట్ర ప్రణాళికా మండలి నివేదిక  ప్రకారం.. అక్కడ 50 శాతం కంటే ఎక్కువ భూభాగం 20 డిగ్రీలు వాలుగా​ ఉంది. పైగా మట్టి కూడా వదులుగా ఉంటుంది. దానివల్ల నేల కోతకు గురికావడం, కొండచరియలు విరిగిపడడం లాంటివి సాధారణంగానే జరుగుతుంటాయి. అందుకే ఇలాంటి సున్నితమైన​ ప్రాంతాల్లో పర్యావరణానికి హాని చేసే ఎలాంటి పనులు చేయకూడదు. 

మన దగ్గర 

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ముఖ్యంగా జనవరిలో చైనాలోని యునాన్​, మేలో న్యూ గినియాలోని పాపువాలో ఇలాంటి విపత్తులను చూడాల్సి వచ్చింది. జులైలో ఇండోనేషియాలోని సులవేసి ద్వీపాన్ని వరదలు ముంచెత్తాయి. ఇప్పుడు కేరళలో వందలమంది  ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించే మొత్తం మరణాల్లో మన దేశంలో ఎనిమిది శాతం నమోదు అవుతున్నాయి. 2001–21 మధ్య కాలంలో కొండచరియలు విరిగిపడటం వల్ల 847 మంది చనిపోయారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. దీనిపై స్టడీ చేసిన ఐఐటీ –మద్రాస్ టీం మెషిన్ లెర్నింగ్ మోడల్స్​ను వాడి, హై–రిజల్యూషన్ ఇండియా ల్యాండ్‌‌‌‌స్లైడ్ ససెప్టబిలిటీ మ్యాప్​ని డెవలప్​ చేసింది.

దీని ప్రకారం.. 13.17శాతం  ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది. గతంతో పోలిస్తే ఇది 4.75 శాతం ఎక్కువ. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న అతిపెద్ద భూభాగం సిక్కింలో (57.6%) ఉంది. హిమాలయాలకు దూరంగా ప్రాంతాల్లో మాత్రం కేరళ టాప్​లో ఉంది. ఇక్కడ14 శాతం కంటే ఎక్కువ భూభాగం హై ససెప్టబిలిటీ కలిగి ఉంది. ఒడిశా చుట్టుపక్కల ఇలాంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. 

పశ్చిమ కనుమలు ఎంతో సున్నితం 

పశ్చిమ కనుమలనే సహ్యాద్రి పర్వతాలు అంటారు. ఇవి కొన్ని కోట్ల ఏండ్ల కిందట ఇండియా, మడగాస్కర్ విడిపోయిన తర్వాత ఏర్పడ్డాయి. భారత పశ్చిమ తీర ప్రాంతాన్ని, దక్కన్ పీఠభూమిని వేరు చేస్తున్నాయి. గుజరాత్​లోని తాపీ నది దక్షిణ ప్రాంతం నుంచి మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, గోవా, కర్నాటకలను తాకుతుంది. వీటిని మహారాష్ట్రలో ‘ఘాట్స్’, కర్నాటకలో ‘బాబూ బుడాన్​ కొండలు’, తమిళనాడు, కేరళ, కర్నాటక సరిహద్దు ప్రాంతాల్లో ‘నీలగిరి కొండలు’ అని పిలుస్తారు.

కేరళలోని నీలగిరి ప్రాంతంలో అన్నామలై కొండల్లోని అనాముడి 2695 మీటర్ల ఎత్తులో పశ్చిమ శిఖరాల్లో అత్యంత ఎత్తయినదిగా పేరుగాంచింది. గోదావరి, కృష్ణ, భీమా, తుంగభద్ర, కావేరీ నదులన్నింటికీ పశ్చిమ కనుమలే జన్మ స్థానాలు. దేశంలో ఐదు శాతం ఉన్న ఈ ప్రాంతంలో 27 శాతం జీవరాశి ఉనికికి తోడ్పడుతుంది.139 రకాల క్షీరదాలకు, 227 రకాల సరీసృపాలకు ఆవాసం ఇది. 43 శాతం కొండ చరియలు విరిగిపడే ప్రాంతాలుగా ఉన్నాయి.

పశ్చిమ కనుమలను యునెస్కో 2012లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. పశ్చిమకనుమలు హిమాలయాల కన్నా పురాతనమైనవి. నిజానికి చారిత్రక ప్రదేశం లేదా భౌగోళిక ప్రదేశాల్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటిస్తారు. అలాంటిది ఇంతటి విశాలమైన ప్రదేశాన్ని అలా ప్రకటించడం విశేషం. పశ్చిమ కనుమలు రుతుపవనాలకు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే రుతుపవనాలు విస్తరించిన ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి.

పశ్చిమ కనుమలు.. కేరళ, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర, గుజరాత్​ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆకుపచ్చని మైదానాలు140 వేల చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో దాదాపు1600 కిలో మీటర్లు పొడవున విస్తరించి ఉన్నాయి. మధ్యలో 30 కిలో మీటర్ల మేర పాలక్కడ్ గ్యాప్ ఉంటుంది. ఈ పశ్చిమ కనుమల్లోని మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నేషనల్ పార్కులు, రిజర్వ్ ఫారెస్ట్​లు వంటి వరల్డ్​ హెరిటేజ్ సైట్​లు 39 వరకు ఉన్నాయి. అంతేకాకుండా హిల్ స్టేషన్స్, సిటీలు, సరస్సులు, టూరిస్ట్ డెస్టినేషన్​లు వంటివి ఉన్నాయక్కడ.

కన్నీటి సంద్రంలో వయనాడ్

కనుచూపు మేర ఎటు చూసినా పచ్చదనం. మంచు కురిసే వేళల్లో వయనాడ్​లో ప్రకృతి అందాలు చూస్తే పరవశించిపోతారు ఎవరైనా. ఆకుపచ్చని చీర కట్టినట్టు సుందరంగా కనిపించే కొండలు, వంకలు తిరిగిన మార్గాలు, రకరకాల ఆకృతుల్లో అబ్బురపరిచే ప్రకృతి సోయగాలు, జలపాతాలు.. ఇలా ఎన్నెన్నో ప్రకృతి అందాలను తనలో ఇముడ్చుకుంది ఈ ప్రాంతం. అంతరించిపోతున్న వన్య ప్రాణులకు ఊపిరిపోస్తోంది. ప్రకృతి ఎంత అందమైనదో చెప్పే ప్రతిబింబాలు పశ్చిమ కనుమలు. ఒకప్పుడు ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునేవాళ్లు.. ఇప్పుడు మృత్యుఒడిగా మారిన పరిస్థితిని  చూసి భయపడుతున్నారు. 

హెచ్చరికలు పెడచెవిన...

ఆరు రాష్ట్రాల్లోని 56, 800 కిలో మీటర్ల ప్రాంతంలో ‘పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతం’గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఐదో ముసాయిదా నోటిఫికేషన్​ రిలీజ్ చేసింది. జులై 31న విడుదలైన నోటిఫికేషన్ మీద ఏమైనా సూచనలు, అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లోగా చెప్పమని కోరింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం పశ్చిమకనుమలు విస్తరించిన ఆరు రాష్ట్రాల్లోని భూభాగాన్ని ఈఎస్​ఏ(ఎకో సెన్సిటివ్​ ఏరియా)గా ప్రకటించారు. దీని కింద కర్నాటకలో 20, 668 చదరపు కిలో మీటర్లు, మహారాష్ట్రలో17, 340 చదరపు కిలో మీటర్లు, కేరళలో వయనాడ్​ జిల్లాలోని13 గ్రామాలతో పాటు మొత్తం 9, 933 చదరపు కిలో మీటర్లు, తమిళనాడులో 6, 914 చదరపు కిలో మీటర్లు, గోవాలో 1,461 చదరపు కిలో మీటర్లు, గుజరాత్​లో 449 కిలో మీటర్ల ప్రాంతం ఉంది. 

ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం, ఈఎస్​ఏగా పరిగణించే ప్రాంతంలో మైనింగ్, క్వారీయింగ్​, ఇసుక తవ్వకాలపై పూర్తి నిషేధం ఉంది. ఇప్పటికే మైనింగ్ జరుగుతుంటే కనుక లీజు గడువు పూర్తయ్యాక లేదా తుది నోటిఫికేషన్ విడుదలైన ఐదేండ్లలోపు దాన్ని ఆపేయాలి. కొత్తగా బొగ్గు ఆధారిత (థర్మల్) విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయొద్దు. ఇప్పటికే ఉన్న వాటిని నడపొచ్చు. కానీ విస్తరించకూడదు. భారీ స్థాయిలో టౌన్​ షిప్​లు, భవనాల నిర్మాణాలపై నిషేధం ఉంది. అయితే, పెరుగుతున్న జనాభా, వాతావరణ మార్పులు, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం పశ్చిమ కనుమలపై ఏ విధంగా ఉంది అని స్టడీ చేసేందుకు 2010లో ఒక కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ కమిటీకి ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్​ గాడ్గిల్ నేతృత్వం వహించారు.

కమిటీ సూచనలు ఇవే..

ఈ కమిటీ 2011లో పశ్చిమ కనుమల్లోని మొత్తం పర్వత ప్రాంతాన్ని ఈఎస్​ఏగా ప్రకటించాలని చెప్పింది. దేశ పడమటి తీరాన గుజరాత్‌‌‌‌ నుంచి తమిళనాడు దాకా ఆరు రాష్ట్రాల పరిధిలో విస్తరించిన పశ్చిమ కనుమల్లో దాదాపు70 శాతం ప్రాంతంలో మైనింగ్‌‌‌‌, అభివృద్ధి పనులకు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని గాడ్గిల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ నివేదికలో సూచించింది. 

జోన్​ –1లో మైనింగ్‌‌‌‌ అనుమతులను తగ్గించుకుంటూ వెళ్లి.. 2016 నాటికి అక్కడ మైనింగ్‌‌‌‌ను పూర్తిగా ఆపేయాలి. రెండు జోన్లలోనూ 2015 నాటికి ప్లాస్టిక్‌‌‌‌ సంచుల వాడకాన్ని, 2020 నాటికి అన్ని రకాల క్రిమిసంహారక పురుగు మందుల వినియోగాన్ని నిషేధించాలని చెప్పింది. ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతం గాడ్గిల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ గుర్తించిన జోన్‌‌‌‌ –1లోనిది. ఈఎస్​జెడ్‌‌‌‌-–2లో మాత్రం మైనింగ్‌‌‌‌ కార్యకలాపాలను అత్యంత కఠినమైన ఆంక్షలతో కొనసాగించవచ్చు. కానీ ఎప్పటికప్పుడు మైనింగ్‌‌‌‌పై సోషల్‌‌‌‌ ఆడిట్‌‌‌‌ నిర్వహించాలని కమిషన్‌‌‌‌ చెప్పింది. 

రెండు జోన్లలోనూ.. కొత్తగా ఎలాంటి డ్యామ్స్, రైల్వే లైన్లు, పెద్ద పెద్ద రహదారులు నిర్మించకూడదు. అటవీ భూమిని అటవీయేతర అవసరాలకు మళ్లించడంపైన నిషేధం విధించాలి. పశ్చిమ కనుమల్లో 75 శాతం ప్రాంతాన్ని పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతంగా ప్రకటించాలి. అక్కడ ఏ ప్రాజెక్టుకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ అనుమతులు ఇవ్వకూడదు అని చెప్పింది. ఈ సిఫార్సులపై రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానికుల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. దాంతో 2013లో కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చైర్మన్​ కె. కస్తూరిరంగన్ సారథ్యంలో మరో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ పశ్చిమ కనుమల్లో 37 శాతం భూభాగం పర్యావరణ పరంగా సున్నితమైనదని గుర్తించింది. ఇప్పటివరకు ఈ కమిటీ నాలుగు ముసాయిదా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇది ఐదోది. 

తూర్పు కనుమల్లో కదలిక! 

కేరళలోని వయనాడ్​లో జరిగిన ప్రకృతి వైపరీత్యం మానవాళికి హెచ్చరిక అని భూగర్భ జల నిపుణులు చెప్తున్నారు. పశ్చిమ కనుమల్లో భాగమైన ఈ ప్రాంతం ఇప్పటికే ఎలా నష్టపోయిందో కళ్లారా చూస్తున్నాం. 

అయితే, ఇదే తరహాలో తూర్పు కనుమలకు కూడా ముప్పు రాబోతుందనేది  అంచనా. తూర్పు కనుమలు ఒడిశాలోని మహానది నుంచి తమిళనాడులోని నీలగిరి కొండల వరకు 75 వేల చదరపు కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. పశ్చిమ కనుమల కంటే పురాతనమైన తూర్పు కనుమలు ఒడిశా, ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు వరకు ఉన్నాయి. తూర్పు కనుమల్లో కొండలపై చిన్నపాటి వాగులు ప్రవహిస్తుంటాయి. కొండలపై కురిసిన వర్షం కిందకు పారుతుంది. దానివల్ల ఇబ్బంది ఉండదు. కానీ, తూర్పు కనుమల్లో అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసం జరుగుతోంది. గనుల తవ్వకాలు చేపట్టి, వాటి రవాణా కోసం రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు కట్టారు. అదేకాకుండా పర్యాటకం పేరుతో కొండలు

వాలు ప్రాంతాల్లో రిసార్టులు, హోటళ్లు, ఇతర కార్యకలాపాలు మొదలుపెట్టారు. దీంతో ‘కిరండోల్ – కొత్త వలస’ మధ్య రైల్వే ట్రాక్​పై కొండ చరియలు విరిగిపడడం, బండరాళ్లు దొర్లడం జరిగింది. ముఖ్యంగా అరకు లోయ ప్రాంతంలో 1990లో ఒకసారి 2006, 2014లోనూ కొండ చరియలు విరిగిపడి ప్రాణనష్టం జరిగింది. వయనాడ్​ లాగానే 2006 ఆగస్టు 3న రాత్రి కొండచరియలు, బురదతో కూడిన వరద అరకు లోయ మండలం కోడిపుంజు వలస గ్రామాన్ని ముంచెత్తాయి. అప్పుడు ప్రాణనష్టంతోపాటు చాలామంది గాయపడ్డారు. 

దక్షిణ ఒడిశాలో బాక్సైట్, లేటరైట్ గనులను తవ్వుతున్నారు. అరకులోయ ప్రాంతంలో పర్యాటకం పేరుతో నిర్మాణాలు చేస్తున్నారు. ఒడిశా నుంచి ఏపీ వరకు సుమారు 21 డ్యామ్​లు తూర్పు కనుమల్లోనే నిర్మించారు. వీటి క్యాచ్​మెంట్ ఏరియాలో మైనింగ్​ పనులు జరుగుతుండడం వల్ల భవిష్యత్​లో ప్రాజెక్ట్​లకు ముప్పు ఏర్పడుతుందని అంటున్నారు. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవడం మంచిదని నిపుణులు గట్టిగానే చెప్తున్నారు.

ఆ రాత్రి ఎలా గడిచిందంటే...

చూరల్మల గ్రామంలో నివసించే ఒక కుటుంబం వరద బీభత్సానికి సర్వం కోల్పోయింది. ప్రాణభయంతో అక్కడి నుంచి కొండపైకి వెళ్లారు. ఆ కుటుంబానికి చెందిన సుజాత ఆనాటి పరిస్థితి గురించి వివరిస్తూ ‘‘మేం కొడ మీదకి చేరుకునే సరికి చిమ్మచీకటిగా ఉంది. ఏమీ కనిపించలేదు. కాసేపయ్యాక కళ్లు నిక్కపొడుచుకుని చూస్తే మా పక్కనే ఏనుగుల మంద ఉంది. ఆ ఏనుగుల మందకు, మాకు మధ్య కేవలం ఒక మీటర్ దూరం ఉంది. కిందకి వెళ్తే వరదలు, పైన ఉంటే ఏనుగులు.. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ‘మమ్మల్ని ఏం చేయొద్దు. ఈ రాత్రికి ఇక్కడ ఉండనివ్వమ’’ని భయపడుతూనే బతిమిలాడాం. చేతులెత్తి ఏనుగులకు మొక్కాం. ఏనుగులు కూడా వరద ప్రవాహానికి భయపడ్డట్టున్నాయి. మమ్మల్ని అర్థం చేసుకుని తెల్లవారేదాకా మాకు కాపలాగా ఉన్నాయి! రాత్రంతా వాటి కాళ్ల దగ్గరే ఉన్నాం. రెస్క్యూ టీమ్ మా దగ్గరకు వచ్చేవరకు ఏనుగులు మాతోనే ఉన్నాయి” అని చెప్పింది ఆమె.

సీత కట్టిన వారధి ఇది

రామాయణంలో సీతను తీసుకురావడానికి హనుమంతుడు వారధి కట్టిన విషయం తెలిసిందే. అయితే, నేడు కేరళ ప్రజల్ని కాపాడేందుకు ‘సీత’ వారధి కట్టింది. అందుకే ఆమెను సీత కాదు.. సివంగి అంటున్నారంతా. కేరళలోని వయనాడ్​లో జరిగిన విధ్వంసంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ సహాయక చర్యల్లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. కొండ చరియలు విరిగిపడిన చూరల్మలా గ్రామంలో సహాయక చర్యల కోసం వంతెన కట్టింది సీత దళం. ఇండియన్​ ఆర్మీ ఇంజనీర్​తో కలిసి మేజర్​ సీత అశోక్ షెల్కె పదహారు గంటల్లోనే 24 టన్నుల సామర్థ్యం ఉన్న బెయిలీ వంతెన నిర్మించారు. నిజానికి అక్కడ ఉన్న పరిస్థితికి ఆ పని సాధ్యమయ్యేది కాదు. వరద ప్రవాహం వల్ల సగం భూభాగం కొట్టుకుపోతోంది.

దాంతో అక్కడ పరిమిత స్థలం మాత్రమే ఉంది. ప్రతికూల పరిస్థితుల్లో బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది ఆర్మీ టీంకి లీడర్​గా ఉన్న సీత. సహాయక చర్యల్లో ఈ బ్రిడ్జి కీలకంగా మారింది. నిద్రాహారాలు లేకుండా వంతెన పనులు పూర్తి చేసింది సీత. మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ (ఎంఈజీ) అనేది వంతెనలు నిర్మించడం, మందు పాతరలను నిర్వీర్యం చేయడం వంటివి చేస్తుంది. ఈ గ్రూపులో ఉన్న 70 మంది సభ్యుల్లో ఏకైక మహిళ సీత. మహిళకు ఈ జాబ్​ అవసరమా అన్నవాళ్లకు ఆమె ఇచ్చే జవాబు ఇది.  

బాలిక రాసిన కథ.. నిజమైంది

‘విధి ఆడే వింత నాటకం’ అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే కొండ చరియలు విరిగిపడి, వరద ప్రవాహానికి ఊళ్లకు ఊళ్లు తుడిచి పెట్టుకుపోయాయో అచ్చం అదే సంఘటనను ఓ చిన్నారి పోయినేడాది కథగా రాసింది. తాను స్వయంగా ఊహించి రాసిన కథ ఇప్పుడు నిజమైంది. వివరాల్లోకి వెళ్తే.. వయనాడ్​ జిల్లాలోని గవర్నమెంట్​ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది లయ. జలపాతంలో మునిగిపోయే అమ్మాయి గురించి గతేడాది స్కూల్లో నిర్వహించిన పోటీల్లో ఒక కథ రాసింది లయ. స్కూల్ మ్యాగజైన్​లో పబ్లిష్ అయిన ఆ కథలో జలపాతంలో మునిగిపోవడం వల్ల ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ తర్వాత ఆమె పక్షిగా మారుతుంది. తిరిగి అదే గ్రామానికి వస్తుంది. ఆ పక్షి ఆ ఊరి పిల్లలతో ‘‘పిల్లలూ.. ఈ ఊరి నుంచి పారిపోండి. ఇక్కడ పెద్ద ప్రమాదం జరగబోతుంది’’ అని చెప్తుంది. ఆ పిల్లలంతా వెనక్కి తిరిగి చూసేసరికి కొండపై నుంచి భారీగా వర్షపు నీరు, మట్టి

బురద వేగంగా ఆ గ్రామం వైపు దూసుకొస్తుంటుంది. ఆ తర్వాత పక్షి అందమైన అమ్మాయిగా మారుతుంది. అయితే ఆ గ్రామస్తులను రక్షించడానికి ఎవరూ రాకపోవడంతో వాళ్లు మునిగిపోతారు. అదే ఘటన ఇప్పుడు నిజంగా జరిగింది. లయ ఉండే చూరల్మలా ప్రాంతం వరదల్లో నాశనం అయింది. ఇందులో లయ తండ్రి లెనిన్​ కూడా చనిపోయాడు. లయ చదువుతున్న స్కూల్లో మొత్తం 497 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో 32 మంది ఈ ప్రకృతి విలయానికి బలయ్యారు. లయ చదివే స్కూలు పూర్తిగా ధ్వంసం అయింది. ఆ స్కూలు హెడ్ మాస్టర్, టీచర్లు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ స్కూల్ టీచర్లు అద్దె గదిలో ఉంటున్నారు. ఒకవేళ స్కూల్లో ఉండుంటే ప్రాణాలు దక్కేవి కాదని చెప్పారు.

మనసు దోచిన ‘బోచె’

ఒక్కొక్కరు ఒక్కో రకంగా హెల్ప్ చేస్తున్నారు. అయితే, బాబీ చెమ్మన్నూరు అనే వ్యాపారవేత్త నిరాశ్రయులైన వంద కుటుంబాలకు ఇండ్ల స్థలాలు ఇస్తున్నారు. బోచె చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేస్తున్నారు. దాతల చేత ఇండ్లు కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం దగ్గరకి వెళ్లి బాధితుల వివరాలు తెలుసుకున్నారు. దానికి ప్రభుత్వం కూడా సమ్మతించింది. సహాయ కార్యక్రమాలు ముగిసిన వెంటనే నిర్మాణ పనులు చేపడతారట. గోల్డ్ బిజినెస్ నుంచి బాబీకి చెమ్మన్నూర్ జువెలర్స్ చెయిన్​తో పాటు వెయ్యి ఎకరాల టీ ఎస్టేట్ ఉంది.

భూదానం కోసం పది నుంచి పదిహేను ఎకరాలు అవసరం పడొచ్చు. అవసరం అయితే ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పారాయన. గతంలో కూడా ఆయన భూదానం చేశారు. వ్యాపారంలోనే కాదు.. సేవలోనూ ముందుండే ఆయన్ని అభిమానంగా ‘బోచే’ అనిపిలుస్తారు. గల్ఫ్​లో చిక్కుకున్నవాళ్లను విడిపించడం, రక్తదానం ప్రోత్సహించడం, పర్యాటకాన్ని వివరించడం, ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడం వంటి వాటిలో ముందుంటారు బోచె.

ఆ ఏనుగు వల్లేనా? 

కేరళలోని వయనాడ్​ విలయానికి కారణం ఏంటా? అని రకరకాల ప్రశ్నలు రేకెత్తుతున్న తరుణంలో సోషల్ మీడియాలో ఒకటి వైరల్​ అవుతోంది. కేరళలో ఏనుగులు ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. అక్కడి వాళ్లు గజరాజులను దైవంగా చూస్తారు. అలాంటి చోట నాలుగేండ్ల కిందట గర్భంతో ఉన్న ఒక ఏనుగు ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు ఎవరో పేలుడు పదార్థం కలిపిన పైనాపిల్​ను పెట్టారు. దాన్ని తినేటప్పుడు పేలుడు జరిగి ఆ ఏనుగు మరణించింది. ఇప్పుడు ఆ ఏనుగుకు పైనాపిల్ పెట్టిన గ్రామమే ప్రకృతి ప్రకోపానికి బలయిందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఏనుగుల శాపమే ఆ గ్రామ ప్రజల చావుకు కారణమైందని అంటున్నారు. 

అందులో నిజమెంత?

నాలుగేండ్ల కిందట జరిగిన విషయం అది. మల్లప్పురం దగ్గర ఒక గ్రామంలో నది పాయల్లో ఆహారం వెతుక్కుంటూ గర్భంతో ఉన్న ఏనుగు వచ్చింది. అది ఎవరినీ ఏమీ అనలేదు. కానీ దారినపోయే కొందరు దానికి పైనాపిల్ ఆశ చూపారు. దానికి తినడానికి ఇచ్చేటప్పుడు అందులో పేలుడు పదార్థాలు పెట్టారు. మనుషులను అమాయకంగా నమ్మిన ఆ ఏనుగు పైనాపిల్​ నోట్లో పెట్టుకుని తినబోయింది. వెంటనే ఆ పైనాపిల్​ పేలింది. దాంతో ఆ ఏనుగు నోటివెంట రక్తం కారింది. అంత బాధలో కూడా ఆ ఏనుగు మోసం చేసిన వారిపై దాడి చేయలేదు.

రక్తమోడుతూనే గ్రామం వదిలి వెళ్లిపోయింది. ఆకలితో, గాయంతో బాధపడుతున్న ఆ ఏనుగు వెల్లియార్ నదిలో దిగి దాహం తీర్చుకుంది. ఆ నీటి ప్రవాహంలో గాయానికి ఉపశమనం పొందింది. ఆ విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది.. సురేందర్, నీలకంఠన్ అనే రెండు ఏనుగులను తీసుకొచ్చి దాన్ని బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, గాయం బాధతో ఉన్న ఆ ఏనుగు బయటకు రాలేకపోయింది. మరో రెండు ఏనుగులతో బలవంతంగా దాన్ని బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు. 2020 మే 27న సాయంత్రం 4 గంటలకు బయటకొచ్చిన ఏనుగు చనిపోయింది.

తిండిపెడతారని నమ్మిన మనుషుల చేతిలో కడుపుతో ఉన్న బిడ్డతో సహా ప్రాణాలు కోల్పోయింది ఆ ఏనుగు. మనసును కదిలించే ఈ ఘటన గురించి అటవీ శాఖ అధికారి సోషల్ మీడియాలో షేర్​ చేశారు. అది గర్భంతో ఉందని తెలిసి వైద్యులు బాధపడ్డారు. దానికి అటవీ శాఖ సిబ్బంది అంత్యక్రియలు చేశారు. అలా చనిపోయిన ఏనుగు శాపం ఫలితాన్ని వయనాడ్​ నేడు అనుభవిస్తోందని సోషల్​ మీడియాలో వైరల్​ చేస్తున్నారు. అయితే, అది జరిగింది మల్లప్పురంలో, విలయం జరిగింది వయనాడ్​లో.. ఆ రెండు ప్రాంతాలు వేరు. పైగా ఆ ఘటనలో ఏనుగును చంపిన వ్యక్తి అరెస్ట్​ అయ్యాడు. ఒకవేళ ఏనుగుల శాపమే అయితే ఇప్పుడు ఒక గజరాజు నలుగురి ప్రాణాలు కాపాడింది. దాన్నేమంటారు అని అడుగుతున్నారు కొందరు. ఏదేమైనా అప్పుడు ఏనుగును చంపిన ఘటన, ఇప్పుడు జరిగిన వయనాడ్ విలయం.. విషాదాన్ని నింపాయి.

ఆర్మీకి ఓ ఉత్తరం

కొండచరియలు విరిగిపడిన వెంటనే ఇండియన్​ ఆర్మీ, ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌, అటవీ శాఖ టీంలు సాయం చేసేందుకు అక్కడికి చేరుకున్నాయి. మట్టి దిబ్బల్లో చిక్కుకుపోయిన వాళ్లను తమ ప్రాణాలకు తెగించి కాపాడాయి. దాని గురించి ఒక పిల్లగాడు ఇండియన్​ ఆర్మీకి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరానికి ఆర్మీ కూడా రిప్లై ఇవ్వడంతో సోషల్‌‌‌‌ మీడియాలో అది వైరల్‌‌‌‌గా మారింది. వయనాడ్‌‌‌‌కు చెందిన మూడో తరగతి స్టూడెంట్​ ఆర్మీకి రాసిన ఉత్తరం​లో ‘‘ప్రియమైన ఇండియన్‌‌‌‌ ఆర్మీ..  నా పేరు రాయన్​. వయనాడ్‌‌‌‌లో శిథిలాల కింద చిక్కుకున్న ఎంతోమంది ప్రజలను మీరు ప్రాణాలకు తెగించి కాపాడటం చూసి చాలా సంతోషించా. మిమ్మల్ని చూసి నేను గర్వపడుతున్నా. ఫుడ్​ లేకపోయినా బిస్కెట్లు తింటూ..  అక్కడివాళ్లను కాపాడేందుకు బ్రిడ్జి కడుతున్న వీడియో చూశా. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు  మీరు కష్టపడుతున్న తీరు చూస్తుంటే నాక్కూడా సైన్యంలో చేరాలని.. మీలాగా దేశాన్ని రక్షించాలి’’ అని ఉంది. 

ఈ ఉత్తరాన్ని చూసిన ఆర్మీ అధికారులు చాలా సంతోషపడ్డారు. ‘‘డియర్‌‌‌‌ రాయన్‌‌‌‌ నువ్వు రాసిన మాటలు మా మనసుల్ని హత్తుకున్నాయి. దేశ ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా తోడుగా ఉండాలనేదే మా లక్ష్యం. నీ లాంటి వాళ్లు ఇచ్చే ప్రేరణతో మేం మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. నువ్వు ఆర్మీ యూనిఫామ్‌‌‌‌ వేసుకుని మాతో కలిసి నిలబడే రోజు కోసం ఎదురుచూస్తుంటాం. అప్పుడు దేశ ప్రజల కోసం మనం కలిసి పోరాడదాం. నీ ధైర్యానికి, స్ఫూర్తికి ధన్యవాదాలు’’ అంటూ ఇండియన్​ ఆర్మీ సదరన్​ కమాండ్​ ‘ఎక్స్​’లో పోస్ట్​ చేశారు.

- దర్వాజ డెస్క్