తెలుగు నేలపైనే నరకాసుర వధ

దీపావళి పండుగలో రెండోరోజు నరకచతుర్దశ జరుపుకొంటాం. నరకుడిపై శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై వచ్చి సంహారం చేసింది తెలుగునేలపైనే! లోక కంఠకుడైన నరకాసురుడిని వధించింది ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురు ప్రాంతంలోనే జరిగిందని స్కంధ పురాణం చెబుతోంది. నదీతీర గ్రామమైన నడకుదురు ఆనాడు నరకోత్తారక క్షేత్రంగా విలసిల్లింది. నరకాసుర సంహారం అనంతరం శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై... ఇక్కడ వెలసిన లక్ష్మీనారాయణులను పాటలీ పుష్పాలతో పూజలు చేశాడని పురాణ కథనం. ఆ తరువాత శ్రీకృష్ణుడు దేవవనం నుంచి పాటరీ వృక్షాలను తెచ్చి నడకుదురులో నాటాడట.

నరకోత్తారక క్షేత్రంగా విలసిల్లిన ఈ ప్రాంతం తర్వాతి కాలంలో వరకొత్తూరు, నడకదూరు, నడకుదురుగా రూపాంతరం చెందిందని తెలుస్తోంది. శ్రీకృష్ణుడు పూజించినట్టు చెప్పే లక్ష్మీనారాయణుల నిగ్రహాలు ఇక్కడి కార్తీక వనంలోని ఓ గుడిలో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ద్వాపరయుగం నాటికే ఈ ప్రాంతంలో పరమేశ్వరుడు పృథ్వీశ్వరుడిగా వెలిశాడు. లక్ష్మీనారాయణుల ఆలయమూ ఉంది. నరకాసురుడు ఇక్కడ ద్విముఖుడు అనే బ్రాహ్మణుణ్ణి చంపాడు.

ఆ పాప పరిహారార్థం పృథ్వీశ్వరుడికి పూజలు చేశాడట. ఒకప్పుడు ఈ ఆలయం ఎంతో ఎత్తులో ఉండేదట. కాలగర్భంలో మార్పుల కారణంగా భూమి కంటే తక్కువ ఎత్తులోకి దిగిపోయింది. ఇది మిగతా ఆలయాల్లా కాకుండా పశ్చిమాభి ముఖంగా ఉంటుంది. దీనికి ఎదురుగా కృష్ణా నది ప్రవహిస్తుంటుంది. పృథ్వీశ్వరుణ్ణి పూజిస్తే సంతానం కలుగుతుందని స్థానికుల నమ్మకం.

పాటలీవనం ప్రత్యేకం

దేశంలో పాటరీ వృక్షాలు చాలా అరుదు. కాశీ, నడకుదురు ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు కాశీలో కూడా పాటలీ వృక్షాలు అంతరించిపోతున్నాయి. కానీ నడకుదురు ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ చాలా పాటలీ వృక్షాలు వనంలో పెరుగుతున్నాయి. కార్తీక మాసంలో పూస్ పాటలీ పుష్పాలతో పృథ్వీశ్వర స్వామికి పూజలు చేస్తారు.

ALSO READ : Diwali 2024 : సారె తిరుగుతోంది కానీ.. లక్ష్మీ కటాక్షం లేదు.. ప్రమిదల  తయారీదారుల జీవితాలు ఇలా..!

సృధ్వీశ్వరుని పూజకు కార్తీక మాసాన్ని అత్యంత సవిత్రమైన మాసంగా భక్తులు భావిస్తారు. ఆలయం చెంతనే ఉన్న కార్తీక వనంలో వందలాదిగా ఉన్న ఉసిరి చెట్లు వేలాది మందికి ఆతిథ్యాన్నిస్తాయి. కార్తీకంలో ఇక్కడి వనాల్లో సహపంక్తి భోజనాలు చేస్తారు.