జూరాలకు వరద వచ్చినా.. లిఫ్ట్​ చేసింది 3 టీఎంసీలే

  • రిపేర్లు, మెయింటెనెన్స్ లేక నీరంతా వృథా
  • ఏండ్లుగా గట్టు, నెట్టెంపాడు లిఫ్ట్  పనులు పెండింగ్

గద్వాల, వెలుగు: పదేండ్లుగా ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగానికి సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇటీవల వరద వచ్చినా ఎత్తి పోసుకోలేక కిందికి వదిలేయాల్సి వచ్చింది. ఇలా సోమవారం నాటికి 498.29 టీఎంసీల నీటిని జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు వదిలివేశారు. ర్యాలంపాడ్  రిజర్వాయర్ కు బుంగలు పడ్డా రిపేర్లు చేయకపోవడం, జూరాల ప్రాజెక్ట్​లో సిల్ట్ తీయకపోవడం, గట్టు లిఫ్ట్  పనులు కంప్లీట్ చేయకపోవడం, నెట్టెంపాడు ప్రాజెక్ట్​ 10 శాతం పనులు పూర్తి చేయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. 90 రోజుల్లో 21 టీఎంసీలు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా.. 3 నుంచి 4 టీఎంసీలకే పరిమితం కావాల్సి వస్తోంది.

ఆరు టీఎంసీలు మాత్రమే..

జూరాల ప్రాజెక్టుకు ఈసారి పెద్ద ఎత్తున వరద వచ్చినా.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాలకు 6 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 3.1 టీఎంసీలు, భీమా లిఫ్ట్​కు 2.7 టీఎంసీలు, కోయిల్ సాగర్ కు 1.06 టీఎంసీలు ఎత్తి పోశారు. ఒకవేళ జూరాలకు మరిన్ని రోజులు వరద వచ్చినా పూర్తి స్థాయిలో నీటిని లిఫ్ట్​ చేయలేని పరిస్థితి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటిలాగా భారీ వరదలు వచ్చే ఛాన్స్  కూడా తక్కువేనని అంచనా వేస్తున్నారు.

21 టీఎంసీలకు రూపకల్పన చేసినా..

జూరాల ప్రాజెక్టుకు వరద వచ్చే సమయంలో 90 రోజుల్లో 21 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోసుకునేలా నెట్టెంపాడు లిఫ్ట్​ను రూపకల్పన చేశారు. నెట్టెంపాడు లిఫ్ట్  చరిత్రలో ఇప్పటివరకు 12 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారు. ప్రస్తుతం 3 టీఎంసీలకే పడిపోయింది. ఈసారి 3.1 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారు. ఈ ప్రాజెక్టు కింద పూర్తి స్థాయిలో రెండు పంటలకు నీరు ఇవ్వాలంటే 12 టీఎంసీల నీరు ఎత్తిపోసుకోవాల్సి ఉంటుంది. నెట్టెంపాడు లిఫ్ట్  ఇరిగేషన్ లో పెద్ద ర్యాలంపాడ్ రిజర్వాయర్  నాలుగు టీఎంసీలతో నింపాల్సి ఉన్నా, ఆరేండ్ల కింద రిజర్వాయర్ కు బుంగలు పడ్డాయి. అప్పటి సర్కారు కాలయాపన చేస్తూ వచ్చిందే తప్ప రిపేర్లు చేయలేదు. దీంతో నాలుగేండ్ల నుంచి కేవలం రెండు టీఎంసీలే నింపుతున్నారు. నెట్టెంపాడు లిఫ్ట్  కింద 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో రెండు పంటలకు నీరు ఇవ్వడం సాధ్యం కాని పని.

పదేండ్లుగా నిర్లక్ష్యమే..

బీఆర్ఎస్  పాలనలో పదేండ్లు సాగునీటి ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. కనీసం మెయింటెనెన్స్ కు ఫండ్స్  ఇవ్వలేదు. నెట్టెంపాడు లిఫ్ట్​లోని గుడ్డెం దొడ్డి పంప్ హౌస్  దగ్గర వారం రోజుల కింద సాంకేతిక సమస్య తలెత్తి నీటి లిఫ్ట్  ఆగిపోయింది. అప్పటి ప్రభుత్వం నెట్టెంపాడు లిఫ్ట్  ఇరిగేషన్  మెయింటెనెన్స్  చేస్తున్న కంపెనీకి రూ.1.13 కోట్లు పెండింగ్  పెట్టడంతో మెయింటెనెన్స్  చేయడం ఆపేసింది. ఇటీవల ప్యానెల్  బోర్డులో సర్క్యూట్  స్టాటికల్  ఫ్రీక్వెన్సీ సమస్య తలెత్తడంతో కంపెనీ వాళ్లను ఆఫీసర్లు రిక్వెస్ట్  చేసి సమస్యను పరిష్కరించారు. అలాగే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని 99, 100 ప్యాకేజీ పనులు స్లోగా నడుస్తున్నాయి. ఇలా పనులు పెండింగ్ లో ఉండడంతో నెట్టెంపాడు లిఫ్ట్  కింద పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందించే పరిస్థితి కనిపించడం లేదు.

జూరాల కింద ఆశాజనకం..

గత ఏడాది జూరాల కింద రబీలో క్రాప్​ హాలిడే ప్రకటించారు. ఈసారి మాత్రం రెండు పంటలకు నీరందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వాయర్  పూర్తి స్థాయిలో నిండడం, పైనుంచి ఇంకా వరదలు వస్తుండడంతో రెండు పంటలు పండుతాయని రైతులు ఆశిస్తున్నారు. జూరాల కింద లక్ష ఎకరాలకు పైగా పంటలు సాగయ్యే అవకాశం ఉంది.

వరద వచ్చే అవకాశం ఉంది..

జూరాల ప్రాజెక్టుకు ఇంకా వరద వచ్చే ఛాన్స్  ఉంది. మరికొన్ని రోజులు నీళ్లు లిఫ్ట్​ చేస్తాం. డిసెంబర్  వరకు వరద వస్తే అప్పటివరకు నీటిని ఎత్తిపోస్తూనే ఉంటాం.

వెంకటేశ్వరరావు, ఏఈ, జూరాల