పదేండ్ల పాపాలను కడిగేస్తున్న హైడ్రా..!

Water retains of its Land,  2020వ సంవత్సరం అక్టోబర్ నెలలో హైదరాబాద్​ నగరంలో వరదలు ముంచెత్తిన  సమయంలో,  ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఈ ఆసక్తికర హెడ్డింగ్​తో ఒక కథనం ప్రచురించింది.  ‘నీరు దాని సొంత భూమిని నిలుపుకుంటుంది’ అని  దీని అర్థం.  ఈ టైటిల్​ని లోతుగా పరిశీలిస్తే,  మానవుడు నీటి సమూహాలైన  చెరువులు,  కుంటలు,  కాలువలు  కబ్జా చేసి,  ఇండ్లు,  అపార్ట్​మెంట్లు,  కమర్షియల్ బిల్డింగులు కట్టుకుంటే,  ప్రకృతి ఆగ్రహించి వరదల రూపంలో తిరిగి తన తన భూమిని తను స్వాధీనం చేసుకుంది’ అని ఎంతో గొప్ప మెసేజ్ దాగి ఉన్నట్టుగా నాకు అనిపించింది.

 ఆనాటి  కేసీఆర్​ ప్రభుత్వం  హైదరాబాద్ వరదల నివారణకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయింది.  కానీ,  ప్రజాప్రభుత్వం కొలువుదీరిన వెంటనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ నగర ప్రజలు మరోసారి ఇలాంటి ప్రకృతి ఆగ్రహనికి గురి కావొద్దని, కబ్జాదారులు చెరబట్టిన మూసీ నదినీ, చెరువులను, కుంటలను,  కాలువలను వాళ్ల కబ్జా కోరల నుంచి విడిపించడమే హైడ్రా అనే  మహా భూ-యజ్ఞం ముఖ్య లక్ష్యం అని పేర్కొన్నారు. 

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ‘హైడ్రా’ మీదనే చర్చ జరుగుతున్నది.  తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  నాయకత్వంలో పుట్టిన హైడ్రా  భూయజ్ఞానికి ముగ్ధులైన  ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు తెలంగాణను ఒక కేస్ స్టడీగా తీసుకొని,  కబ్జాదారులు చెరబట్టిన తమ తమ రాష్ట్రాల్లోని ప్రభుత్వ భూములను విడిపించుకోవడానికి.. హైడ్రాలాంటి పటిష్టమైన చట్టం తీసుకురావాలని ఆలోచనతో అధికార బృందాలను అధ్యయనం కోసం తెలంగాణకు  పంపిస్తున్నారు. 

 కానీ,  రాష్ట్రంలో ప్రధాన  ప్రతిపక్ష  హోదాలో ఉన్న బీఆర్ఎస్  మాత్రం హైడ్రా చేస్తున్న మంచి పనులు పింక్ కళ్లద్దాల వల్ల చూడలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భూములను పరిరక్షించే బాధ్యత  కేసీఆర్ మీద ఉండేది.  కానీ, ఆయన నిర్లక్ష్యం చేశారు.

డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఐజీ రంగనాథ్ 

డైనమిక్ పోలీస్ ఆఫీసర్​గా పేరున్న ఐజీ ఏవీ రంగనాథ్​ని హైడ్రా కమిషనర్​గా నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్​ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే చార్జ్ తీసుకున్న వెంటనే తనదైన శైలిలో కబ్జాదారుల భరతం పట్టడానికి హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ పూనుకున్నాడు.  జోన్లవారీగా చెరువుల కబ్జాలను గుర్తించి వాళ్లకు నోటీసులు ఇస్తూ గడువు ముగియగానే కూల్చివేతలు ప్రారంభించారు. 

చెరువుల్లో  కాలువలు ఆక్రమించిన భూములకు  పట్టా పాస్ బుక్కులు, రిజిస్ట్రేషన్,  అనుమతులు ఇచ్చిన మున్సిపల్,  టౌన్ ప్లానింగ్  అధికారులపై  చర్యలు తీసుకుంటున్నారు.  ప్రజల దృష్టిలో ఎన్​ కన్వెన్షన్ కూల్చివేత లాంటి చర్యలతో రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ అమాంతం పెరిగింది . గతంలో  కేసీఆర్,  కేటీఆర్  చేయని సాహసం డైనమిక్  సీఎం  రేవంత్ రెడ్డి  చేస్తున్నందుకు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.  బీఆర్ఎస్ నాయకులు వాళ్ల పదేండ్ల ప్రభుత్వ కాలంలో చెరువులు,  కుంటలు కబ్జా పెట్టి స్థానిక అధికారుల మీద ఒత్తిడి తెచ్చి తూతూ మంత్రంగా కట్టడాలు నిర్మించి పేద ప్రజలకు అమ్మి వారి ఉసురు పోసుకుంటున్నారు. 

నిరాశ్రయులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు

హైడ్రా నిర్ణయాన్ని బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు,  కొండా విశ్వేశ్వర్ రెడ్డి సైతం సమర్థిస్తున్నారు. మూసీ రివర్బెడ్​లో  అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ, నిరాశ్రయులయ్యే పేద వర్గాలకు 15,000 ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు  కేటాయిస్తూ మానవత్వం చాటుకుంటుంది కాంగ్రెస్ సర్కార్.   మల్లన్న సాగర్  నిర్వాసితులు  రెండు సంవత్సరాలు  దీక్ష  చేసినా  పోలీస్ పహారాలలో  వేరే ఇతరులను ఆ గ్రామాల్లోకి అనుమతించకుండా,  పోలీస్ బెటాలియన్లను కాపలాబెట్టి, ఊర్లకు ఊర్లను బలవంతంగా ఖాళీ చేయించిన తన నిరంకుశ చరిత్ర  కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలి.  

హైడ్రాను  విమర్శించే  రాజకీయ పక్షాలకు మా సూటి ప్రశ్న

భూ కబ్జాల విముక్తి ఇప్పుడు కాకపోతే మరెప్పుడు?  పది ఏండ్లు  కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చేయలేని సాహసాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో  హైడ్రా కమిషనర్  రంగనాథ్   అమలుచేస్తున్నారు. అర్హులైన నిర్వాసితులకు ఇల్లుతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటించారు. 

ప్రతిపక్షాలు రెచ్చగొట్టే మాటలు,  సృష్టించే వదంతులు  ప్రజలు నమ్మొద్దు.  హైడ్రా ఒక బూచీ కాదు, కోటి  మంది నగర ప్రజలకు రేవంత్​ సర్కార్​ ఇస్తున్న భరోసా.  ప్రకృతి రక్షణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ చేపట్టిన హైడ్రా అనే ఈ  భూ మహాయజ్ఞానికి పంచభూతాలు సహకరిస్తాయన్న నమ్మకం మాకుంది.   తెలంగాణ  భూములను  పరిరక్షించాలని కోరుకునే మేధావులు,  బుద్ధిజీవులందరూ హైడ్రాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. 

కేసీఆర్ కుటుంబ సభ్యులు కబ్జాదారులతో  చేతులు కలిపి 60 ఏండ్ల ఆంధ్రా పాలనలో జరిగిన భూదోపిడీ కంటే పది రెట్లు ప్రభుత్వ భూములను,  చెరువులను, కుంటలను మాయం చేశారు.   చెరువుల ఆధునికీకరణ పేరుతో   చెరువుల ఎఫ్  టీఎల్  సామర్థ్యాన్ని  తగ్గించి,  చుట్టూ రంగురంగుల పూల మొక్కలు ఏర్పాటు చేసి  ఈ రంగుల చాటున  వందల  ఎకరాల  భూములు  కొట్టేశారు.ఈ మధ్య సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) ప్రచురించిన ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ అర్బన్ వాటర్ బాడీస్’ రిపోర్టు ప్రకారం గడిచిన 10 సంవత్సరాలలో హైదరాబాదులో 3,245 చెరువు శిఖం భూములు మాయమైపోయినయి.

-డా. కొనగాల మహేశ్​, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి –