Summer Tip : వాటర్ బాటిళ్లను ఇలా క్లీన్ చేయండి.. ఎండాకాలంలో ముఖ్యంగా..!

వేసవి కాలంలో ఎక్కడికెళ్లినా వెంట ఒక వాటర్ బాటిల్ ఉండాల్సిందే. ఎండకి బయటికి వెళ్లినప్పుడు తరచూ నీళ్లు తాగడం మంచిది. మరి మీ బాటిల్ ఎంత శుభ్రంగా ఉంటుందో ఎప్పుడైనా గమనించారా... దాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచకపోతే అనారోగ్య సమస్యలు తప్పవు. అందుకే రెండు రోజులకోకసారి నీళ్ల సీసాలో కాసిని గోరువెచ్చని నీళ్లూ, వెనిగర్ కలిపి బాగా కదపాలి. 

దీనివల్ల లోపల పేరుకున్న బ్యాక్టీరియా పోతుంది. సీసాలు వాసన వస్తుంటే చిన్న దాల్చిన చెక్కను సీసాలో ఉంచి కాసేపు ఎండలో ఉంచితే సరి. తక్కువ ఖరీదుకు లభించే ప్లాస్టిక్ సీసాలను వాడడం మంచిది కాదు. వాటిల్లోని హానికారక రసాయనాలు కడుపులోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే కొనేటప్పుడే నాణ్యతగల వాటిని ఎంచుకోవాలి. అలాగని వాటిని ఏండ్ల తరబడి వాడేయాలనుకోవడమూ తప్పే, నాలుగైదు నెలలకొకసారి వాటిని మార్చేయాల్సిందే.

మంచినీళ్లే కదా అందులో ఉండేది. రోజూ కడగడం. ఎందుకు అనుకోవద్దు. నీళ్లలో ఉండే మలినాలు రోజూ చేరి కాస్తచొప్పున అడుగున పొరలా ఏర్పడతాయి. అందుకే ఎప్పటికప్పుడు కడగాల్సిందే. కొంచెం ఉప్పు, కాసిని గోరువెచ్చని నీళ్లు వేసి అటూ ఇటూ ఊపితే అడుగుభాగంలో పేరుకున్న మలినాలు తొలగిపోతాయి.