చేసిందే దొంగతనం అయినప్పుడు.. అందులో మంచేమిటి..? చెడేమిటి..? మంచి దొంగ, చెడ్డ దొంగ అనే రకాలుంటారా..! అని తిట్టుకోకండి. తప్పు చేసినప్పటికీ, పశ్చాత్తాపపడి తనంతట తానే వచ్చి పోలీసులకు లొంగిపోవటమే ఈ దొంగను అలా పిలిచేలా చేసింది. పోలీసులు తన మీద వేసిన వాంటెడ్ పోస్ట్‌కు స్పందించడమే కాదు.. తనకు తానుగా పోలీసులకు లొంగిపోయాడు ఈ దొంగ. మూడేళ్ల క్రితం జరిగిన ఈ దొంగ కథనం మరోసారి వైరల్ అవుతోంది.
ఆంటోనీ అకెర్స్ 'రిచ్‌ల్యాండ్ (వాషింగ్టన్)'లో దొంగతనాలు చేసేవాడు. దీంతో ఆ ప్రాంత పోలీసులు అతని ఫొటోను ఫేస్‌బుక్‌లో పెట్టి 'వాంటెడ్' అంటూ ఒక పోస్ట్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ పోస్టుకు ఆంటోనీనే స్పందించాడు. 'కంగారు పడకండి.. నేనే వచ్చి లొంగిపోతా' అనిపోలీసుల పోస్టుకు బదులిచ్చాడు. మొదట అతను తమాషా చేస్తున్నాడని పోలీసులు భావించారు. 'నీకెందుకు శ్రమ ఎక్కడ ఉన్నావో చెప్పు.. మేమే వచ్చి రిసీవ్ చేసుకుంటాం' అని మరో పోస్ట్ పెట్టారు అధికారులు.
ALSO READ | ఉబెర్, రాపిడోతో ఇంత సంపాదనా? ఇతని స్టోరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
అందుకు ఆంటోనీ తనకు కొన్ని పనులు ఉన్నాయని, 48 గంటల తర్వాత లొంగిపోతానని బదులిచ్చాడు. రెండు రోజులు గడిచినా అతను రాకపోయే సరికి పోలీసులు మరో మెసేజ్ పెట్టారు. అయితే ఈసారి ఆంటోనీ మాట తప్పలేదు. 'మీ ఆఫీస్ లోనే ఉన్నాడియర్' అంటూ ఎస్కులేటర్ మీద ఎక్కుతున్న ఓ సెల్ఫీ దిగి అధికారులకు పంపాడు. సాదరంగా స్టేషన్ లోకి ఆహ్వానించిన అధికారులు అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. పోలీసులతో అతను కొనసాగించిన సంభాషణను చూసిన కొందరు నెటిజన్లు.. దాదాపు డేటింగ్ చేసినంత పని చేశాడంటూ కామెంట్లు పెట్టారు. చెప్పినట్లుగానే పోలీసులకు లొంగిపోయిన ఆ దొంగ నిజాయితీకి మెచ్చి అతన్ని మెచ్చుకున్నారు కూడాను. తాజాగా, ఇలాంటి ఘటన అమెరికాలో మరొకటి చోటుచేసుకోవడంతో ఆంటోనీ అకెర్స్ వైరల్ గా మారాడు.