వింటర్లో ఫుడ్ తినాలంటే కాస్త కష్టమే. ఏది వండినా కాసేపటికే చల్లారిపోతుంది. చల్లగా తినాలంటే గొంతు దిగదు. కొందరికైతే ఆకలి కూడా తెలియదు ఆ చలికి. పెద్దల పరిస్థితే ఇలా ఉంటే మరి పిల్లల పరిస్థితేంటి? మామూలుగానే పిల్లలు ఒక పట్టాన ఏది తినరు. వాళ్లకు నచ్చింది పెడితేనే తింటారు. అలాగని వేడి వేడి దోశలు, ఇడ్లీలు, శ్నాక్స్ వంటివి చేసినా, వాళ్లు తినబోయేసరికి అవి కూడా చల్లారిపోతాయి. దాంతో సగం తిని వదిలేస్తారు. ఇక జ్యూస్లు, కూల్ డ్రింక్లు అంటారా? వింటర్లో వాటి జోలికి అస్సలు పోకూడదు. మరి ఏం తినిపించాలంటే.....
• చలికాలంలో పిల్లల్ని గొంతు గరగర, జలుబు బాగా ఇబ్బంది పెడతాయి. వాటి నుంచి కాపాడుకోవాలంటే వెజిటబుల్ సూప్స్ తాగించాలి.ఒక కప్పు టొమాటో సూప్ తాగినా చాలు రిఫ్రెష్ మెంట్, ఎనర్జీ వస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇదే కాకుండా పాలకూర, బ్రకోలి, మష్రూమ్, బీట్ రూట్ సూప్లు కూడా తాగొచ్చు. వీటన్నింటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇలా పిల్లలకు వెజిటబుల్స్ అలవాటు చేయొచ్చు కూడా.
• చిలగడ దుంపలు కూడా చలికాలంలో పిల్లలకు పెట్టాల్సిన ఫుడ్ ఐటమ్. వీటిలో పొటాషియం, ఫైబర్ లు ఎక్కువ. ఇందులో ఉండే బీటా కెరోటిన్ రోజంతా శక్తినిస్తుంది.
• నట్స్, డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల బాడీలో వెచ్చదనం వస్తుంది. వీటిలో మైక్రో న్యూట్రియెంట్స్, విటమిన్స్ ఎక్కువ. జీడిపప్పు, అంజీర్, బాదం, పిస్తా, ఖర్జూరం, వాల్ నట్స్, పల్లీలు తినడం వల్ల మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది.
• వింటర్లో వెచ్చదనాన్నిచ్చే మరో ఫుడ్ బెల్లం. ఇది దగ్గు, జలుబు, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.
• అన్నం తిన్నాక, చిన్న బెల్లం ముక్క నోట్లో పెట్టుకుంటే డైజెషన్ కు మంచిది. పాయసం వంటివి చేసుకున్నప్పుడు చక్కెర బదులు బెల్లం వేస్తే చాలా మంచిది. ఫ్రూట్స్ కివీ, జామ, ఆరెంజ్లు తింటే బెటర్. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఇమ్యూనిటీ పెరుగుతుంది. వీటిని క్యాండీలుగా చేసుకుని కూడా తినొచ్చు.
• కోడిగుడ్లు తింటే ప్రొటీన్ బాగా అందుతుంది. కిడ్స్ ఈ సీజన్లో మంచి న్యూట్రిషనల్ ఫుడ్ కోడిగుడ్డు, దీన్నిబ్రెడ్ ఆమ్లెట్, ఫ్రైడ్ వెజిటబుల్ ఎగ్స్, క్యారెట్, బీట్ రూట్లతో కలిపి తినొచ్చు. ఈ వెజిటబుల్స్ ని హల్వా, ఖీర్, వేపుళ్లలో కూడా వాడొచ్చు. వీటిలో విటమిన్ -ఎ ఉంటుంది. అది పిల్లలకు ఇన్ఫెక్షన్స్, అలర్జీలు రాకుండా అడ్డుకుంటుంది. డైజెషన్ని కూడా మెరుగుపరుస్తుంది.
• జొన్న, రాగి, సజ్జ, మొక్కజొన్నలతో పాన్ కేక్ లు లేదా రొట్టెలు తినొచ్చు. వీటిని పెరుగు, నెయ్యి, బెల్లం, పప్పుతో కలిపి పిల్లలకు పెట్టొచ్చు. ఇలా కాకపోతే చపాతీనే పిజ్జాలా చేసి పెట్టొచ్చు. పిజ్జా బేస్ కోసం న్యూట్రిషనల్ ఫుడ్ ఐటమ్స్ వాడాలి.
• ఇలాంటివి తినిపిస్తే వింటర్లో ఇబ్బంది పెట్టే జలుబు, దగ్గు, జ్వరాలు రాకుండా చేస్తాయి. ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి.