ఉమ్మడి వరంగల్ జిల్లాకు ట్రాఫిక్ ​ఇక్కట్లకు చెక్​

  • పశ్చిమలో నాలుగు రోడ్లు వైడెనింగ్​
  • ఎంజీఎం నుంచి పోలీస్ హెడ్​క్వార్టర్స్, కాంగ్రెస్ భవన్, మచిలీ బజార్, అంబేద్కర్ జంక్షన్ రోడ్ల వెడల్పుపై సర్కారు ఫోకస్​
  • స్మార్ట్ సిటీలో ఇరుకుగా మారిన ప్రధాన రోడ్లు
  • 10 ఏండ్లలో ప్రధాన, ఇంటర్నల్ రోడ్లను పట్టించుకోలే
  • నేడో రేపో పనులు ప్రారంభం

వరంగల్, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాకు హెడ్ క్వార్టర్​గా ఉండే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హనుమకొండ సిటీలో మరో నాలుగు ప్రధాన రోడ్ల వెడల్పునకు అడుగులు పడనున్నాయి. వరంగల్ స్మార్ట్ సిటీకి అనుబంధంగా వందలాది కొత్త కాలనీలు వెలిసిన నేపథ్యంలో గ్రేటర్ వరంగల్​లో జనాభా, వాహనాలు పెరిగాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేటతో కలిపి ట్రైసిటీగా ఉండే నగరానికి ప్రధాన రోడ్డు ఒక్కటే ఉంది.

 వివిధ కాలనీలు, చుట్టూరా ఉండే విలీన గ్రామాల నుంచి సిటీకి చేరుకునే క్రమంలో ప్రధానమైన ఇంటర్నల్ రోడ్లు ఉన్నా, పెరిగిన రద్దీకి అనుగుణంగా ఇవి అభివృద్ధికి నోచుకోలేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమ నియోజకవర్గంలో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేలా నాలుగు ప్రధాన రోడ్ల వెడల్పునకు చర్యలు చేపట్టింది. 

11 లక్షల జానాభా, 10 లక్షల వెహికల్స్​

గ్రేటర్ వరంగల్ పరిధి 407.71 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండగా, దాదాపు 42 విలీన గ్రామాలతో కలిసి11 లక్షల జనాభా ఉంది. ఉమ్మడి 6 జిల్లాల ప్రజలతోపాటు ఇతర జిల్లాల వారు కూడా నిత్యం గ్రేటర్ సిటీకి వివిధ పనులరీత్యా వచ్చివెళ్తుంటారు. కేవలం వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలోనే 5 లక్షల 73 వేల బైకులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, మరో 60 శాతం ఇతర వాహనాలు నడుస్తున్నాయి. పొరుగు జిల్లాలైన కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, చత్తీస్​గఢ్ నుంచి ప్రయాణికులు సిటీకి వస్తుంటారు.

వరంగల్, హనుమకొండ, కాజీపేటను కలిపే మెయిన్​రోడ్డు ఒక్కటే ఉంది. దీనికి అనుబంధంగా హంటర్​రోడ్, కేయూసీ పెద్దమ్మగడ్డ రోడ్డు ఉన్నప్పటికీ, వీటినుంచి హనుమకొండ చౌరస్తాకు చేరుకునే ప్రధాన ఇంటర్నల్ రోడ్లన్నీ 20 నుంచి 30 ఫీట్ల వెడల్పుతో ఉన్నాయి.

స్థానిక కాలనీల ప్రయాణికులతో ఆ రోడ్లు సైతం రద్దీగా ఉంటున్నాయి. లీడర్ల మీటింగులు, ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలతో పాటు బతుకమ్మ, దసరా, శివరాత్రి వంటి సమయాల్లో హనుమకొండ చౌరస్తా, వెయ్యిస్తంభాల ఆలయ రోడ్లపై రాకపోకలు బంద్​ చేస్తుండగా, లక్షలాది మంది ప్రయాణికులతో పెద్ద ఎత్తున ట్రాఫిక్​జామ్​అవుతుంది. ట్రాఫిక్ డ్యూటీలు చేయలేక పోలీసులు ఇబ్బందులు పడ్తున్నారు. వరంగల్ నగరం పేరుకే స్మార్ట్ సిటీగా ఉన్నా, ఏండ్లుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించడంపై గత ప్రభుత్వం కనీస శ్రద్ధ పెట్టలేదు.  

వెడల్పు చేసేలా నాలుగు ప్రధాన రోడ్లు..

గ్రేటర్ సిటీ హెడ్ క్వార్టర్​గా మధ్యలో ఉండే మెయిన్ రోడ్​తోపాటు ప్రధాన ఇంటర్నల్ రోడ్లను వెడల్పు, అభివృద్ధి చేయనున్నారు. ప్రధానంగా ట్రాఫిక్​తో బిజీగా ఉండే వరంగల్ ఎంజీఎం జంక్షన్ నుంచి హనుమకొండ చౌరస్తా మీదుగా పోలీస్ హెడ్​క్వార్టర్స్ వరకు మెయిన్ రోడ్డును మరింత విస్తరించనున్నారు. 

ప్రధాన ఇంటర్నల్ రోడ్లుగా ఉన్న హనుమకొండ బస్టాండ్ నుంచి మచిలీ బజార్, వెయ్యిస్తంభాల గుడి వెనక వైపు నుంచి అలంకార్ జంక్షన్ రోడ్డు వరకు, హనుమకొండ కాంగ్రెస్ భవన్ నుంచి బుద్ధభవన్ మీదుగా కేయూసీ 100 ఫీట్లకు చేరుకునే రోడ్డు, అంబేద్కర్ జంక్షన్ నుంచి ఓల్డ్ బస్ డిపో, సుమంగళి ఫంక్షన్ హాల్, బాలయ్య హోటల్ మీదుగా వడ్డెపల్లి చర్చి మీదుగా ఉనికిచర్ల రింగురోడ్డుకు సాఫీగా వెళ్లేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.  ​

ట్రాఫిక్ కు చెక్..​​ 

గ్రేటర్ అధికారులు ప్రధానంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కేంద్రంగా ఉండే హనుమకొండ పరిధిలో ఈ నాలుగు రోడ్లను వెడల్పు చేయనుండడంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది. హనుమకొండ బస్టాండ్ మీదుగా వరంగల్ వెళ్లేవారు వెయ్యిస్తంభాల గుడి వైపు రాకుండా మచిలీ బజార్​రోడ్డు మీదుగా అలంకార్ జంక్షన్ వెళ్లవచ్చు.

బస్టాండ్​, హనుమకొండ చౌరస్తా మీదుగా కేయూ, కరీంనగర్ వెళ్లాల్సినవారు నయీంనగర్​ రూట్ కాకుండా కాంగ్రెస్ భవన్ మీదుగా కేయూ రోడ్డుకు చేరవచ్చు. దీంతో పెగడపల్లి డబ్బాలు, గుండ్లసింగారం మీదుగా ముచ్చర్ల రోడ్​లోని రింగురోడ్డుకు చేరవచ్చు. సిటీ నుంచి హైదరాబాద్ వెళ్లేవారు ఫాతిమా నగర్​ బ్రిడ్జి, కాజీపేట వెళ్లకుండా అంబేద్కర్ జంక్షన్, వడ్డెపల్లి చర్చి మీదుగా ఉనికిచర్లలోని రింగురోడ్డుకు చేరవచ్చు. వందలాదిగా ఏర్పడ్డ కొత్త కాలనీల జనాలకు మెయిన్ రోడ్డుగా మారనుంది.