వరంగల్ లో హడలెత్తిస్తున్న దొంగతనాలు

  • వరంగల్ ​కమిషనరేట్ లో ఏటికేడు పెరుగుతున్న చోరీలు
  • సైలెంట్​గా దోచేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలు
  • కేసులను ఛేదించడంలో వెనుకబడుతున్న పోలీసులు
  • ఇండ్లకు తాళం వేసి వెళ్లాలన్నా జంకుతున్న జనం

హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్​పరిధిలో వరుస చోరీలు జనాలతో పాటు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దొంగల ముఠాలు వరంగల్ ను టార్గెట్​చేసి ఇండ్లు, అపార్ట్​మెంట్లు, వ్యాపార సముదాయాలను కొల్లగొడుతూ అందిన కాడిన దోచేస్తున్నాయి. తాజాగా వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్​బీఐ బ్యాంక్ లో రూ.కోట్లు విలువ చేసే బంగారాన్ని ఎలాంటి క్లూస్​వదలకుండా పకడ్బందీగా ఎత్తుకెళ్లడం కలకలం రేపుతుండగా, గతంలో జరిగిన చోరీలు కూడా ఇంతవరకు సాల్వ్ కాకపోవడం విమర్శలకు తావిస్తోంది.

 దీంతో జనాలు ఇండ్లకు తాళం వేసి ఎక్కడికి వెళ్లాలన్నా జంకాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, కేసులను ఛేదించడంతో పాటు చోరీలను నియంత్రించడంలో పోలీసులు వెనకబడి పోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

టార్గెట్ ఓరుగల్లు .. 

వరంగల్ ట్రై సిటీకి రోడ్డు, రైలు మార్గాలతో వివిధ రాష్ట్రాల నుంచి రాకపోకలకు కనెక్టివిటీ పెరిగిపోయింది. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు వరంగల్ ను ఈజీగా టార్గెట్ చేస్తున్నాయి. నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల జరిగిన చోరీలను చూస్తే వరంగల్ లోకి ప్రొఫెషనల్ గ్యాంగ్స్​ ఎంటరైనట్లు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి రావడం, సైలెంట్ గా ఇండ్లు కొల్లగొట్టి వెళ్తుండటంతో ఏటికేడు చోరీలు పెరిగిపోతుండగా, దుండగులను గుర్తించడం పోలీసులకు సవాల్ గా మారుతోంది.  

ఛేదన, రికవరీ అంతంతే..

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రొఫెషనల్ గ్యాంగ్స్ వరంగల్ కమిషనరేట్ లో తరచూ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీస్ అధికారులు అంచనా వేస్తున్నారు. తాజాగా తమిళనాడు, కర్నాటక గ్యాంగులపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కమిషనరేట్ లో సీపీ, ముగ్గురు డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు సహా దాదాపు 3 వేలకు పైగా సిబ్బంది ఉన్నా, చోరీ కేసులు మాత్రం చాలా వరకు సాల్వ్ కావడం లేదు.

దీంతో చోరీల కేసుల డిటెక్షన్, నగదు, నగల రికవరీ శాతం కూడా చాలా తక్కువగా ఉంటోంది. 2022లో మొత్తంగా 756కు పైగా దొంగతనాలు జరగగా, 416 కేసులను ఛేదించారు. మొత్తంగా 6.19 కోట్లకుపైగా ప్రాపర్టీ లాస్ జరగగా, రూ.3.01 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. గతేడాది 911 చోరీలు జరగగా, 486 కేసులు మాత్రమే డిటెక్ట్​చేశారు. ఓవరాల్ గా రూ.10.86 కోట్ల వరకు చోరీకి గురవగా, రూ.4 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. ఈ ఏడాది చోరీలు ఇప్పటికే 900 మార్క్​ దాటగా, రికవరీ పర్సంటేజీ 50 శాతం కూడా దాటలేదు.  

రాయపర్తి ఘటనతో కలకలం..

వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్​బీఐ బ్యాంక్ లో రూ.13 కోట్లకుపైగా విలువైన బంగారాన్ని గుర్తు తెలియని దుండగులు కాజేయగా, ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. పోలీసులు నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేశారు. రాయపర్తి ఘటనతో వరంగల్ పోలీస్ ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. వరంగల్ సెంట్రల్ జోన్లలోని వివిధ స్టేషన్ పరిధిలోని బ్యాంకు ఆఫీసర్లతో సమావేశమయ్యారు. సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థ ఏర్పాటు చేసుకుని, సరైన సెక్యూరిటీ గార్డ్స్ ను నియమించుకునేలా అవగాహన కల్పించారు.

కాలనీల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ ఆఫీసర్లు సూచిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ లో తరచూ జరుగుతున్న చోరీలు కలకలం రేపుతుండగా, వాటిని కట్టడి చేయడంలో పోలీస్ ఆఫీసర్లు విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా పోలీస్ ఆఫీసర్లు చోరీలపై దృష్టి సారించి, దుండగులను గుర్తించడంతోపాటు చోరికి గురైన నగదు, బంగారాన్ని రికవరీ చేయడంపై ఫోకస్ పెంచాలని ఓరుగల్లు ప్రజలు కోరుతున్నారు.