నీది కాకుంటే అప్పట్లో రేవంత్​పై  ఎందుకు కేసు పెట్టినవ్​? : బండి సంజయ్

  • మీరు పవర్​లో ఉన్నప్పుడు సొంతమైన ఫామ్​హౌస్​.. ఇప్పుడు లీజుకు ఎట్లాయె?
  • కేటీఆర్​పై కేంద్ర మంత్రి బండి సంజయ్​ ఫైర్
  • అక్రమ ఫామ్​హౌస్​ల కూల్చివేతను సమర్థిస్తున్నట్లు వెల్లడి​

సికింద్రాబాద్, వెలుగు : జన్వాడ ఫామ్​హౌస్​ విషయంలో  బీఆర్​ఎస్​ నేత కేటీఆర్​ చాలా లాజిక్​గా మాట్లాడుతున్నారని కేంద్ర హోం​శాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ విమర్శించారు. ‘‘జన్వాడ  ఫామ్​హౌస్​ నీది కాకుంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు  డ్రోన్​ వీడియో తీశారని అప్పట్లో రేవంత్​రెడ్డిపై కేసు ఎందుకు పెట్టినవ్​?” అని కేటీఆర్​ను ఆయన ప్రశ్నించారు. 

బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నప్పుడేమో ఫామ్​హౌస్​ సొంతమైనప్పుడు, ఇప్పుడు లీజుకు ఎట్ల అయిందని నిలదీశారు. బుధవారం సికింద్రాబాద్ క్లాసిక్​గార్డెన్​లో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బండి సంజయ్​ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేటీఆర్​ తానొక్కడినే సంసారి అయినట్లు .. అమాయకుడి లెక్క మాట్లాడుతున్నడు” అని విమర్శించారు. అక్రమంగా నిర్మించిన ఫామ్​ హౌస్​ల కూల్చివేతలను సమర్థిస్తున్నామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తీసుకురావడం వెనుక మహారాష్ట్ర, హర్యానా ఎలెక్షన్ల కోసం కలెక్షన్ల దందా దాగి ఉందని ఆయన ఆరోపించారు. ‘‘గుంట, రెండు గుంటల స్థలాల్లో ఇండ్లు కట్టుకుంటే కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు.. ఎకరాల కొద్ది ఫామ్​హౌస్​లు కట్టుకుంటే వాటిని ఎందుకు కూల్చడం లేదు?  పెద్దతలకాయలను వదిలేసి గజాల్లో కట్టిన ఇండ్లను మాత్రమే హైడ్రా కూల్చుతున్నది. ఇది సరైంది కాదు” అని ఆయన అన్నారు. 

సింఘ్వీ.. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ ఉమ్మడి అభ్యర్థి

బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలు ఒకటేనని,  త్వరలోనే కాంగ్రెస్​ పార్టీలో బీఆర్​ఎస్​ విలీనం అవుతుందనే  ఒప్పందంలో భాగంగానే  రాజ్యసభకు అభిషేక్​ సింఘ్వీని ఆ రెండు  పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టాయని బండి సంజయ్​ దుయ్యబట్టారు. బీఆర్​ఎస్​ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు  ఉన్నప్పటికీ రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని ఆ పార్టీ ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో అరెస్టయి తీహార్​ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసును అభిషేక్​ సింఘ్వీ వాదిస్తున్నారని, అందుకు ప్రతిఫలంగానే  రాజ్యసభ ఎన్నికల్లో  బీఆర్​ఎస్​ అభ్యర్థిని కేసీఆర్​ ప్రకటించలేదని   ఆయన విమర్శించారు.

దాదాపు 10 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు  కేసీఆర్​తో టచ్​లో ఉన్నారని  ఆరోపించారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలు ఇప్పుడు ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టికి మరల్చడానికి విగ్రహాల పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. సెక్రటేరియెట్​ ముందు వాజ్​పేయి విగ్రహం పెట్టాలని తమకూ ఉందని, ఇకనైనా విగ్రహాల లొల్లి మానేయాలని, ప్రజా సమస్యలపై దృష్టిసారించాలన్నారు.