న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు స్మారక నిర్మాణ స్థలం కేటాయింపు విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. తన ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని గట్టెక్కించిన మహానేతను కేంద్రంలోని బీజేపీ సర్కారు అవమానిస్తున్నదని కాంగ్రెస్ఆరోపించగా.. మాజీ ప్రధాని మృతితో కాంగ్రెస్నీచ రాజకీయాలు చేస్తున్నదంటూ బీజేపీ మండిపడింది. స్మారక నిర్మాణం చేపట్టేందుకు వీలున్న స్థలంలోనే మన్మోహన్ సింగ్అంతిమ సంస్కారాలు పూర్తిచేయాలని కాంగ్రెస్ తొలుత కోరింది. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే శుక్రవారం ఉదయం ఫోన్‌లో మాట్లాడారు.
మాజీ ప్రధానులు, రాజనీతిజ్ఞులకు అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశంలోనే స్మారకాలు ఏర్పాటుచేయడం దేశంలో సంప్రదాయంగా వస్తున్నదని పేర్కొన్నారు. ఇదే విషయమై మోదీకి ఖర్గే లేఖ కూడా రాశారు. ఆపై- నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్ అంత్యక్రియలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. భరతమాత గొప్ప పుత్రుడు, సిక్కు సమాజానికి చెందిన మొదటి ప్రధాని అయిన మన్మోహన్సింగ్అంత్యక్రియలను నిగమ్‌బోధ్ ఘాట్‌లో నిర్వహిస్తూ.. ఆయనను కేంద్రం అవమానపరుస్తున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
స్మారకం నిర్మించాలని కేబినెట్ నిర్ణయం..
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతి పై కాంగ్రెస్డర్జీ పాలిటిక్స్చేస్తున్నదని బీజేపీ మండిపడింది. రాహుల్‌గాంధీ పోస్ట్ దురదృష్టకరమని, సిగ్గుచేటని బీజేపీ ఎంపీ సంబిత్‌పాత్ర మండిపడ్డారు. ‘‘మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు స్మారకం నిర్మించాలని కేబినెట్లో నిర్ణయించాం. ఈ మేరకు స్థలం కేటాయిస్తామని ఆయన కుటుంబ సభ్యులతోపాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశాం. దీనికి కొంత సమయం పడుతుందని చెప్పాం” అని పేర్కొన్నారు.
అయినా.. కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. రాజకీయాల్లో ఇదే అత్యంత పతనం అని విమర్శించారు. ఇలాంటి సమయంలో గౌరవప్రదంగా వ్యవహరించాల్సిందిపోయి.. రాహుల్ దిగజారి ట్వీట్స్చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంత్యక్రియల విషయంలో కాంగ్రెస్ ఎలా వ్యవహరించిందో గుర్తుచేసుకోవాలని చురకలంటించారు.
నిగమ్ బోధ్ ఘాట్ ప్రత్యేకతలివే..
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్అంత్యక్రియలు నిర్వహించిన నిగంబోధ్ఘాట్కు చాలా ప్రత్యేకత ఉన్నది. ఇది పురాతనమైన శ్మశాన వాటిక. దీన్ని ఇంద్రప్రస్థ రాజు యుధిష్టరుడు స్థాపించినట్టు నమ్ముతారు. ఇక్కడ దేవతలు సంచరిస్తారని విశ్వసిస్తుంటారు. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ నుంచి జనసంఘ్ వ్యవస్థాపకుడు సుందర్సింగ్భండారీ వరకు అనేకమంది ప్రముఖుల అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, దీన్ని అధికారికంగా అబారి పంచాయతీ వైష్ బిసా అగర్వాల్ 1898లో స్థాపించారు.