గర్భిణిల కోసం వెయిటింగ్ రూమ్​లు

  •     డెలివరీకి వారం రోజుల ముందే హాస్పిటల్​కు తరలింపు
  •     ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆడబిడ్డలకు చేయూత
  •     ఆదిలాబాద్ జిల్లాలో ఏడు పీహెచ్​సీల్లో ప్రత్యేక గదులు
  •     ఇప్పటికే 20 మందికి డెలివరీ
  •     163 హైరిస్క్ గ్రామాల్లోని గర్భిణిల డేటా సేకరణ

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణిల కోసం పీహెచ్​సీల్లో బర్త్ వెయిటింగ్ రూమ్​లను వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. వర్షాకాలంలో గర్భిణిలు డెలివరీ టైమ్​లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో తల్లీబిడ్డ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లు సరిగ్గా లేని గ్రామాలను గుర్తించి అక్కడున్న గర్భిణిలను డెలివరీ డేట్ కంటే వారం రోజుల ముందే పీహెచ్​సీల్లో ఏర్పాటు చేసిన బర్త్ వెయిటింగ్ రూమ్​కు తరలిస్తారు.

 అక్కడ 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉంచుతారు. గర్భిణిలకు భోజన సదుపాయం కూడా కల్పిస్తారు. ఇలా చేయడంతో తల్లీబిడ్డకు ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏడు పీహెచ్​సీల్లో బర్త్ వెయిటింగ్ రూమ్​లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 20 మందికి డెలివరీలు చేశారు. 163 హై రిస్క్ గ్రామాల్లోని గర్భిణిల వివరాలను సేకరించారు.

గర్భిణిల గుర్తింపు కంప్లీట్

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు, వంతెనలు లేని గ్రామాల్లో ఉన్న గర్భిణిల డెలివరీ తేదీలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సేకరించారు. జిల్లాలో 22 పీహెచ్​సీలు, ఒక సీహెచ్​సీ, ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 163 హైరిస్క్ గ్రామాలను గుర్తించారు. అన్ని ఏజెన్సీ గ్రామాలే కావడంతో వర్షాలు పడితే వాగులు ఉప్పొంగుతాయి. దీంతో రాకపోకలు నిలిచిపోతాయి. 

గర్భిణిలను తరలించేందుకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పటికే హైరిస్క్ గ్రామాల్లోని గర్భిణిలను గుర్తించారు. జులై, ఆగస్టు, సెప్టెంబర్​లో 85 మంది డెలివరీకి సిద్ధంగా ఉన్నారు. జులైలో 20 మంది గర్భిణిలు బర్త్ వెయిటింగ్ రూమ్​లలో డెలివరీ అయ్యారు. మిగిలిన వారిని కూడా గడువులోగా బర్త్ వెయిటింగ్ రూమ్​కు తరలిస్తామని అధికారులు తెలిపారు.

ప్రత్యేక గదుల్లో అన్ని సౌలత్​లు

ఏడు పీహెచ్​సీల్లో బర్త్ వెయిటింగ్ రూమ్​లను వైద్య శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఉట్నూరు సీహెచ్​సీ, ఇంద్రవెల్లి, నేరడిగొండ, గుడిహత్నూర్, బజార్​హత్నూర్, ఇచ్చోడ, నార్నూర్ పీహెచ్​సీల్లో ప్రత్యేక గదులు, బెడ్లు అందుబాటులో ఉంచారు. ఈ పీహెచ్​సీల్లో 24 గంటల పాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. అధికారులు సేకరించిన ముందస్తు వివరాల ప్రకారం.. ఆయా గ్రామాల నుంచి ఆశాలు, ఏఎన్ఎంలు గర్భిణిలను బర్త్ వెయిటింగ్ రూమ్​లకు తీసుకొస్తారు. గర్భిణిల వెంట వచ్చిన కుటుంబ సభ్యులకు కూడా భోజన సౌకర్యం కల్పిస్తారు. 

హెల్త్ పరంగా ఇబ్బందులు ఎదురైతే.. వెంటనే రిమ్స్ హాస్పిటల్​కు తరలిస్తారు. వీరి కోసం అంబులెన్సులు, ఆర్బీఎస్​కే వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని చాలా మంది గర్భిణిలకు ఇవి ఎంతో భరోసా ఇస్తున్నాయి

వారం రోజులు ముందే గర్భిణిలను తీసుకొస్తం

మారుమూల ప్రాంతాల్లో గర్భిణిలను డెలివరీ డేట్​కు వారం రోజుల ముందే బర్త్ వెయిటింగ్ రూమ్​కు తీసుకొస్తం. వారి కోసం అన్ని రకాల సౌలత్​లు ఏర్పాటు చేశాం. 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉంటారు. ప్రతి రోజూ వైద్య పరీక్షలు నిర్వహించి.. బేబీ కండీషన్ తెలుసుకుంటూ ఉంటాం. ఇప్పటికైతే ఏడు పీహెచ్​సీల్లో వీటిని ఏర్పాటు చేశాం. ఇలా చేయడంతో గర్భిణిలకు ఇబ్బందులు తప్పుతాయి. తల్లీబిడ్డ క్షేమంగా ఉంటారు.- నరేందర్ రాథోడ్, డీఏహెచ్ వో, ఆదిలాబాద్.