ఏజెన్సీ డీఎస్సీ ప్రకటించాలి : వూకె రామకృష్ణ

తెలంగాణ ప్రభుత్వం పదకొండు వేల డీఎస్సీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో.. ఏజెన్సీ ప్రాంతంలో కూడా ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ ప్రకటించాలని ఆదివాసీ సమాజం డిమాండ్​చేస్తున్నది. ఐటీడీఎ ముట్టడి కార్యక్రమం కూడా ఆదివాసీ సంఘాలు చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో  స్పందించాలి.  ఏజెన్సీ ప్రాంతంలో 100 శాతం టీచర్  పోస్టులు ఆదివాసీలకు ఇవ్వాల్సిందే.  

కాబట్టి  ప్రత్యేక గిరిజన డీఎస్సీ తెలంగాణ రాష్ట్రంలో  పెట్టాలి. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్​ హయాంలోని టీడీపీ  ప్రభుత్వంలో ఆదివాసీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలనే ఉద్దేశంతో అప్పుడు జీవో  ఎంఎస్ నెంబర్ 275ను తీసుకొని వచ్చి 1956లో  టీచర్ ఉద్యోగాలు ఇప్పించటం జరిగింది.  ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో 275 జీవో పై  కేసు వేస్తే 2010లో  జీవో ఎంఎస్ నెంబర్ 03 తీసుకువచ్చి టీచర్ ఉద్యోగాలు ఇప్పించటం జరిగింది.  కాబట్టి  తెలంగాణ రాష్ట్రం  ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వం అసమర్థత వలన జీవో  నెంబర్ 03 సుప్రీంకోర్టు కొట్టేస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జీవోతో ప్రత్యేక గిరిజన డీఎస్సీ ఇవ్వాలని ఆదివాసీ ప్రజా సంఘాలు, నిరుద్యోగులు, విద్యార్థులు కోరుతున్నారు.

- వూకె రామకృష్ణ,  భద్రాద్రి కొత్త గూడెం జిల్లా